బోధన్ నియోజకవర్గంలో ప్రతిసారి సార్వత్రిక ఎన్నికల లాగే ఈ సారి కూడా త్రిముఖ పోరు జరుగనుంది. 1994 సంవత్సరం నుంచి ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంటోంది. ఇతర పార్టీలు బరిలో ఉంటున్నా పోటీ నామమాత్రంగానే ఉంటుంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నువ్వానేనా అన్నట్లు పోటీ ఉండేది. ప్రస్తుతం టీడీపీ స్థానంలో టీఆర్‌ఎస్ చేరింది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి టీఆర్‌ఎస్ అభ్యర్థిని పార్టీ ముందుగానే ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి సైతం దాదాపుగా ఖరారయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
సాక్షి, బోధన్(నిజామాబాద్ ): బోధన్ నియోజక వర్గంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా ఉండనుంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మహాకూటమి, బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ సాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావనంతరం రెండోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యుహా, ప్రతివ్యూహాలు, ఎత్తుకుపై ఎత్తులతో ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆయా సామాజిక వర్గాలు, నియోజక వర్గ స్థాయి ప్రత్యర్థి పార్టీల్లో కొనసాగుతున్న ముఖ్యనేతల మద్దతు సమీకరణ ప్రయత్నాల్లో అభ్యర్థులు బిజీబిజీగా ఉన్నారు. ఈ సారి ఎన్నికల సమరాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. నియోజక వర్గ పరిధిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు మహ్మద్ షకీల్ ఆమేర్, పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిలకు మద్దతుగా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రచారంతో సందడి వాతావరణం మొదలైంది.
1994 నుంచి త్రిముఖ పోరే..
1952లో నియోజక వర్గం ఏర్పడింది. ఆనాటి నుంచి 1989 వరకు తొమ్మిది సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీతో పాటు స్వతంత్రులు, కొన్ని సార్లు ప్రధాన రెండు రాజకీయ పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ సాగింది. 1994 ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల పోటీ అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1994 ఎన్నికల్లో మాజీ మంత్రి బషీరుద్దీన్‌బాబుఖాన్(టీడీపీ), నర్సింహారెడ్డి (బీజేపీ), తాహెర్‌బిన్ హుందాన్(కాంగ్రెస్ పార్టీ)లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ త్రిముఖ కోణంలో సాగింది. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా రంగ ప్రవేశం చేసింది. 2004, 2009, 2014 ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ముఖ్యంగా ఈ మూడు ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది.
2004 ఎన్నికల్లో మాజీ మంత్రిసుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్), అబ్దుల్‌ఖాదర్ (టీడీపీ), కెప్టెన్ కరుణాకర్ రెడ్డి (తెలంగాణ జనతా పార్టీ)ల మధ్య త్రిముఖ పోరు జరిగింది. 2009లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి(కాంగ్రెస్), టీడీపీ, టీఆర్‌ఎస్ మహాకూటమి అభ్యర్థి మహ్మద్ షకీల్(టీఆర్‌ఎస్), కెప్టెన్ కరుణాకర్ రెడ్డి (ప్రజారాజ్యం పార్టీ), డాక్టర్ శివప్ప(బీజేపీ) ఈ నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు బరిలో నిలిచినా ఇందులో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. 2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నియోజక వర్గంలో బహుముఖ కోణంలో పోటీ కొనసాగినప్పటికీ ఆఖరులో మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డిలు ప్రధానంగా పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా కాటిపల్లి సుదీప్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. వీరితో పాటు బీఎస్పీ, ఆర్‌ఎస్పీ, ఆమ్‌ఆద్మీ పార్టీలు పోటీ చేశాయి.
ఇప్పుడూ మూడు పార్టీలే..
తాజా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ మహాకూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందని స్పష్టమవుతుంది. అయితే బీజేపీ అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కాలేదు. శివసేన పార్టీ అభ్యర్థిగా గోపి కిషన్ పేరు ఆ పార్టీ ప్రకటించింది. టీఆర్‌ఎస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం ఈ సారి ఎన్నికల్లో పోటీలో ఉండడం లేదని స్పష్టమైంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి పేరుపై ఇంకా స్పష్టత రాలేదు. బీఎల్‌ఎఫ్ అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే తాజా రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే మళ్లీ త్రిముఖ కోణంలోనే ఎన్నికల సమరం ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment