నెలనెలా పండుగలే.. | tribal peoples culture | Sakshi
Sakshi News home page

నెలనెలా పండుగలే..

Published Sun, Oct 12 2014 1:57 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

నెలనెలా పండుగలే.. - Sakshi

నెలనెలా పండుగలే..

భాష, వేషధారణలోనూ విభిన్నం
అడవులే వారికి ఆయువుపట్టు
ఇదీ జిల్లా ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల తీరు

 
కొండా కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. రాజకీయాలు తెలియని మనస్తత్వం.. ప్రతి నెలా పండుగలు.. పండుగలకు అనుగుణం గా ప్రత్యేక పూజలు.. అందుకు తగ్గట్టుగా వేషధారణ.. ఇదీ ఆదివాసీ గిరిజనుల ప్రత్యేకత. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల కు పెట్టింది పేరు. వివిధ తెగల రూపంలో జీవిస్తున్న వారి ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. వారి సంస్కృతి సంప్రదాయాలూ అందరికీ ఆశ్చర్యం కలిగించేవే. జిల్లా గిరిజన జీవనంపై నేటి సండే స్పెషల్.     
 
జిల్లావ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 4 లక్షల 95 వేల 794 మంది ఆదివాసీ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. అయితే లంబాడా(బంజార)లను ప్రభుత్వం 1977 సంవత్సరంలో గిరిజనులుగా గుర్తించడంతో ఆనాటి నుంచి వీరు గిరిజనులుగా గుర్తింపు పొందారు. గోండులు, కొలాంలు, మన్నెవార్, తోటి, ప్రధాన్లు, నాయక్‌పోడ్, ఆంద్, కోయా, ఇతర జాతులను ఆదివాసీలుగా వ్యవహరిస్తుండగా వీరిలో కొలాం, మన్నెవార్, తోటి తెగలను పీటీజీ(ఆదిమ గిరిజన తెగలు)గా వ్యవహరిస్తారు.

గోండులు
గోండుల ప్రధాన వృత్తి పోడు వ్యవసాయం. ఆదిమ జాతి గిరిజనులైన గోండులు గోండి భాషలో మాట్లాడుతారు. కుస్రం హన్మంతరావు గోండు లిపిని  రూపొందించారని చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే ఇటీవల నార్నూర్ మండలం గుంజాలలో గోండుల లిపి వెలుగులోకి వచ్చింది. దీంతో లిపిపై పరిశోధనలు జరుగుతున్నాయి. గోండు గూడాల్లో జీవించేవారు మర్యాదకు, క్రమశిక్షణకు మారు పేరు. ఆచార వ్యవహారాలు పాటించడంలో వారికి వారే సాటి. కొమురం భీమ్ కాలం నుంచి గోండులది పోరాటతత్వం. మారుముల ప్రాంతాల అడవుల్లో జీవిస్తున్న వీరు ఎవరైనా కొత్తవారు గూడెంలోకి వస్తే ‘రాం...రాం’(నమస్కారం) అని ఆహ్వానిస్తారు.

వీరు తమ గూడెం పటేల్ మాట కాదనరు. గోండులు కాలికి చెప్పులు వేసుకుని ఇంట్లోకి అడుగుపెట్టరు. ఇతరులను అనుమతించరు. గూడాల్లో ఏ చిన్న పండుగైన అంతా కలిసి సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారు. గోండులు పెర్సాపెన్, ఆకిపెన్, జంగుబాయి తదితర దేవుళ్లను నమ్ముతారు. దీపావళీ సమయంలో గోండులు దండారీ పండుగను అత్యంత నియమనిష్టలతో జరుపుకుంటారు. గిరిజన సంస్కృతి నుంచి పుట్టిన రాయిసెంటర్ల (న్యాయస్థానం) తీర్పును గోండులు శిరసావహిస్తారు.

కొలాంలు
అభివృద్ధిలో వెనుకబడిన ఆదివాసీ తెగల్లో కొలాం గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. వీరు కొలామీ భాషలో మాట్లాడుతారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో జీవిస్తారు. వ్యవసాయం, వెదురు బుట్టలు, తడకలు అల్లడం వీరి ప్రధాన వృత్తులు. వీరు ముఖ్యంగా భీమల్ పేన్ దేవతను కొలుస్తారు. థింసా నృత్యం చేస్తారు. కొలాం జాతుల్లో తెలుగు మాట్లాడే వారిని మన్నెవార్ అంటారు. గోండుల ఆచార వ్యవహారాలకు వీరి ఆచార వ్యవహారాలకు పెద్దగా తేడా లేనప్పటికీ కొన్ని పద్ధతులు ప్రత్యేకంగా ఉంటాయి.
 
ప్రధాన్, తోటి
రాజ్‌గోండుల కాలంలో ప్రధాన్, తోటి తెగలకు చెందినవారు కవులుగా ఉండేవారని చరిత్రకారులంటారు. ప్రధాన్‌లు అధికంగా మరాఠీ మాట్లాడుతారు. వ్యవసాయం ప్రధాన వృత్తి. తోటి తెగవారు అత్యంత వెనుకబడి ఉన్నారు. ప్రధానంగా గోండి భాష మాట్లాడుతారు. తోటిలలో అధిక శాతం ఇతర ప్రాంతాలకు వలసలు సాగిస్తూ జీవనం కొనసాగిస్తారు. కిక్రీ వాయిద్యాలు వాయించటం, చుక్కబొట్టులు వేయడంలో వీరు సిద్ధహస్తులు.
 
ఆంద్, నాయిక్‌పోడ్
ఆంద్ తెగ వారు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు కాగా.. మరాఠీ భాషలో మాట్లాడుతారు. వీరి జనాభా అంతంతే. వ్యవసాయం జీవనాధారం. పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు.

లంబాడీ
రాష్ట్రంలో లంబాడీలను రాష్ట్ర ప్రభుత్వం 1977లో గిరిజన తెగల్లో చేర్చింది. జిల్లాలో ఉన్న లంబాడీలు ఆదిమజాతి గిరిజనుల కంటే అభివృద్ధి చెందిన వారు. గోండు జనాభా తరువాత వీరు రెండో స్థానంలో ఉన్నారు. వీరు వ్యవసాయమే కాకుండా వ్యాపారం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు. వీరు నిర్వహించే తీజ్ ఉత్సవాలు ఎంతగానే ఆకట్టుకుంటాయి.
 
అడవి బిడ్డల జాతరలు
ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే వివిధ జాతర ఉత్సవాలు వారి సంస్కృతి సంప్రాదాయాలు, ఆచార వ్యవహరాలే ప్రధానంగా సాగుతాయి. ఆదివాసీలకు నాగోబా జాతర అత్యంత పవిత్రమైనది. నాగోబాతో పాటు ఖాందేవ్, బుడుందేవ్, మహాదేవ్, జంగుబాయి ఇలా.. ప్రతీ జాతర వారికి ప్రత్యేకమైనదే.

నాగోబా జాతర
ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువై ఉంది. ఏటా పుష్య మాసంలో అమావాస్య అర్ధరాత్రి మెస్రం వంశీయులు పవిత్ర గంగజలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాతర ప్రారంభిస్తారు. ఈ పూజలకంటే ముందు ఇంద్రాయిదేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. మెస్రం వంశీయులలో ఏడు దైవతలను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. మెస్రం వంశంలో ఉన్న 22 తెగలవారు అత్యంత నియమనిష్టలతో నాగోబాను కొలుస్తారు.

నాగోబా పూజలకు ముందు మెస్రం వంశీయులు పవిత్ర గంగజలం కోసం కాలినడకన జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి రేవు అత్తల మడుగు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగజలం తీసుకొచ్చి పుష్యమి అమావాస్య అర్ధరాత్రి నాగోబాకు అభిషేకించి జాతర ప్రారంభిస్తారు. దక్కన్ పీఠభూమిలోనే ఆదివాసీలకు ముఖ్యమైనది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్ర పండుగగా గుర్తింపునిచ్చింది.
 
ఖాందేవ్ జాతర
నాగోబా జాతర ప్రారంభానికి ముందు నార్నూర్ మండల కేంద్రంలో ఖాందేవ్ జాతర జరుగుతుంది. పుష్య పౌర్ణమికి ఖాందేవ్‌ను తొడసం వంశీయులు కొలువడం ద్వారా జాతర ప్రారంభమవుతుంది. 15 రోజుల పాటు జరుగుతుంది. పూర్వ కాలంలో తోడసం వంశాస్థుడైన ఖమ్ము పటేల్‌కు రాత్రి వేళ కలలో ఖాందేవుడు ప్రత్యక్షమై గ్రామమంత సుఖసంతోషాలతో ఉండాలంటే నీ వ్యవసాయ భూమిలో నేను కొలువయ్యాయని తనను కొలవాలని పేర్కొన్నాడని.. నాటి నుంచి ఏటా పుష్య పౌర్ణమితో ఖాందేవును తొడసం వంశీయులు కొలుస్తున్నారు. ఈ జాతర ముగింపుతో ఇక్కడికి వచ్చిన ఆదివాసీలు నాగోబా జాతర కేస్లాపూర్‌కు తరలివెళ్తారు.
 
బుడుందేవ్ జాతర
నాగోబా జాతర ముగింపు మరుసటి రోజు ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో బుడుందేవ్ జాతరను మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలతో ప్రారంభిస్తారు. పది రోజుల పాటు నిర్వహిస్తారు. పూర్వకాలంలో గౌరాపూర్ అనే గ్రామంలో ఉన్న ఆవుల మందలో ఉన్న ఆంబోతు(ఎద్దు) పశువుల మంద నుంచి తప్పించుకొని శ్యాంపూర్  ప్రాంతంలో ఉన్న పంట చేలల్లో పడి పంట నాశనం చేయడంతో ఆగ్రహించిన కొత్వాల్‌లు వారి వద్ద ఉన్న ఆయుధంతో ఆంబోతును సంహరించారని మృతి చెందిన ఆంబోతును దూర ప్రాంతంలో పారేయడానికి వెళ్తుండగా అక్కడే బండరాయిగా మారి బుడుందేవ్‌గా అవతరించిందని పూర్వీకుల కథనం.
 
మహాదేవ్ జాతర
శ్యాంపూర్‌లో బుడుందూవ్ జాతర ముగింపుతో సిర్పూర్(యు) మండల కేంద్రంలో మహాదేవ్ జాతర ప్రారంభమవుతోంది. ఆత్రం వంశీయులు ప్రత్యేక పూజలతో మహాదేవ్‌ను కొలిచి ప్రారంభించే జాతర పదిహేను రోజులపాటు సాగుతుంది. అంతేకాకుండా మండలంలోని లింగాపూర్‌లో జగదాంబ జాతరను బంజారాలు అత్యంత నియమ నిష్టలతో నిర్వహిస్తారు.

జంగుబాయి జాతర
శార్దూల వాహిని దుర్గమాత ప్రతి రూపమే జంగుబాయి అని ఆదివాసీల నమ్మకం. ఏటా పుష్య మాసంలో నెల రోజుల పాటు ఆదివాసీలు అత్యంత నియమనిష్టలతో జంగుబాయిని కొలుస్తారు. ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దు కెరమెరి మండలం పరందోళి గ్రామం సమీపంలో గల శంకర్‌లొద్ది అటవీ ప్రాంతంలో జంగుబాయి కొలువై ఉన్న ఈ ప్రదేశమంతా పదుల సంఖ్యలో దేవతలున్నాయని పూర్వకాలం నుంచి ప్రచారంలో ఉంది. జంగుబాయి దేవతను ఆదివాసీలోని ఆరు తెగలకు చెందిన వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజలు చేస్తారు. నెల రోజుల పాటు జరిగే ఈ పూజలకు జిల్లా, ఏజెన్సీ నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీగా ఆదివాసీలు, ఇతరులు తరలివెళ్తారు.
 
నెలనెలా పండుగలే

ఆదివాసీ గిరిజనులు సంవత్సర కాలంలో నిర్వహించుకునే పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. చైత్రమాసం(ఏప్రిల్)లో చెంచు భీమన్న మెర్మి పండుగతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. వైశాఖ(మే)లో పెర్సాపెన్ పూజలు చేస్తారు. జ్యేష్ఠ మాసం(జూన్)లో విదిరి మొహుతుక్ పండుగతో ఆకి దేవర వద్ద జొన్నలతో నైవేద్యం సమర్పిస్తారు. ఆషాడం(జులై)లో ఆకిపెన్ పండుగతో పంట చేలల్లో కలుపుతీత పనులు ప్రారంభించడంతో పాటు పంటల దిగుబడులు పెరగాలని పచ్చదనం సంతరించుకున్న అడవి తల్లి చల్లంగా చూడాలని వేడుకుంటారు.

శ్రావణం(ఆగస్టు)లో బంజారాలు తీజ్ పండుగ, ఆదివాసీలు శ్రావణమాసం చివరలో పొలాల పండుగ, జాగేయ్ మాతరీ జాగేయ్ పండుగలు నిర్వహిస్తారు. భాద్రపద(సెప్టెంబర్)లో పెత్రమాస(పెద్దల పండుగ), అశ్వీయుజ(అక్టోబర్)లో దండారీ, మృ గశిర(డిసెంబర్)లో కొత్త పంటలు ఇంటికి వచ్చే సందర్భంగా సెట్టి పండుగ జరుపుకుంటారు. ఇవే కాకుండా కాలాన్ని బట్టి దురాడి, మరుగోళ్ల ఉత్సవం, దాటుడి పండుగలతో పాటు దసరా, దీపావళీ, ఉగాది, హోలీ తదితర పండుగలను ఘనంగా చేస్తారు.

దండారీ సంబురం
గోండులు దీపావళీ సందర్భంగా జరుపుకునే దండారీ పండుగ అతి ప్రధానమైనది. అకాడి నుంచి మొదలై దీపావళీ తరువాత రెండు రోజులకు బొడుగ పండుగతో దండారీ ఉత్సవాలు ముగిస్తారు. దండారీ ఉత్సవాల్లో భాగంగా గోండులు ఆషాడ మాసం లేదా దసరా తర్వాతి రోజుల్లో అకాడి పెన్ దేవతకు పూజలు నిర్వహించి దండారీ ఉత్సవాలు ప్రారంభిస్తారు. దండారీలో ఆటపాటలకు ఉపయోగించే పర్రా, వెట్టె, తుడుం, డప్పు, పెప్ప్రి తదితర సంగీత పరికరాలను, నెమలి ఈకలతో కుంచెం కట్టిన గుస్సాడీ కిరీటాలను, ఇతర వస్తు సామగ్రిని గూడెం గ్రామ పటేల్ ఇంటి ముందు పేర్చి సంప్రదాయ రీతిలో పూజలు జరుపుతారు. ఈ నృత్యాల్లో గుస్సాడీ, చచ్చొయి-చాహోయి, థింసా, గుమ్మెలాట ప్రధానమైనవి. గుస్సాడీ అలంకరణ చేసుకునే వారు అత్యంత నియమ నిష్టలతో ఉంటారు.
 
బంజారాల బతుకమ్మ తీజ్
లంబాడీలు(బంజారాలు) నిర్వహించే ఉత్సవాల్లో తీజ్ అతి ముఖ్యమైనది. రాఖీపౌర్ణమి నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు గిరిజన తండాల్లో పెళ్లి కాని యువతులు నిర్వహించే తీజ్‌ను బంజారాల బతుకమ్మ పండుగ అనవచ్చు. రాఖీపౌర్ణమి రోజు నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు తీజ్ ఉత్సవాలను పెళ్లికాని యువతులు, చిన్నారులు తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. ముందుగా తండాల్లో పెద్దలు ప్రతీ ఇంటి నుంచి గోధుమలు సేకరిస్తారు. చిన్న చిన్న వెదురు బుట్టలు కొనుగోలు చేస్తారు.

యువతులు తండాలకు సమీపంలో చీమల పుట్టమన్ను(మకొడ ధూడ్) తీసుకువచ్చి వెదురు బుట్టల్లో నింపుతారు. రాఖీపౌర్ణమి రోజున ఆ బుట్టల్లో ప్రత్యేక పూజలతో గోధుమలు చల్లుతారు. రోజూ పూజలు నిర్వహిస్తారు. తొమ్మిదో రోజు నీటి వనరుల్లో నిమజ్జనం చేస్తారు. పూర్వ కాలంలో తీవ్ర కరువు కాటకాలు వచ్చినప్పుడు గిరిజన పెద్దలు(నాయక్)లు తమ ఆరాధ్య దైవమైన జగదాంబ మాతను వేడుకోగా ఏటా శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించాలని సూచించిందని చెప్తారు. కాగా, తీజ్ అంటే పచ్చదనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement