తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా
ధారూరు : ఎన్నోఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను వదిలివేయబోమని గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. వివరాలు.. మండలంలోని రాంపూర్‌తండా సమీపంలో 1 నుంచి 70 సర్వేనంబర్లలలో 1274.19 ఎకరాల భూములు నిజాం వారసురాలైన ఫజలున్నీసాబేగం పేరున ఉన్నాయి. 653.20 ఎకరాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రభుత్వ హయాంలో టెనెన్సీ ద్వారా పట్టాలిచ్చారు. మిగిలిన 620 ఎకరాలను దాదాపు 100 మంది గిరిజన రైతులు కబ్జాలో ఉండి సాగుచేసుకుంటున్నారు.
ఫజలున్సీసాబేగం 1970లో మృతి చెందగా ఇప్పటి వరకు ఆరు వర్గాల వారు తామే వారసులమంటూ వచ్చి బెదిరిస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. గతేడాది కొందరు డూప్లికేట్ పత్రాలు సృష్టించి దొంగరిజిస్ట్రేషన్లు చేసుకోగా తాము ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. తాము సాగుచేసుకుంటున్న భూములను ప్రాణాలు పోయినా వదిలిపెట్టబోమని సర్పంచ్ పాండునాయక్ తెలిపారు. విషయం కోర్టులో ఉందని, పరిష్కారం అయ్యేవరకు విరాసత్ చేయరాదని సర్పంచ్ ఆధ్వర్యంలో గిరిజన రైతులు తహసీల్దార్ శ్రీనివాస్‌కు విజ్ఞప్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా కోర్టు ద్వారా ఫజలున్నీసాబేగం వారసులు అశ్రఫ్‌ఖురేషి, అఫ్సర్‌ఖురేషిలు కోర్టు ఆర్డర్ తీసుకువచ్చారని, కోర్టు ఆదేశాన్ని అమలు చేయాల్సిందేనని తహసీల్దార్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. గడువులోగా పరిష్కరించుకుంటే తమకేం అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. వారసులు కేవలం విరాసత్‌లో తమపేర్లు నమోదు చేయాలని కోరుతున్నారని, భూములు కబ్జా ఇప్పించమని కోరడం లేదని వివరించారు.
భూములు వదిలేయం
Published Sun, Feb 21 2016 1:28 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement