టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే..
- ఆ పార్టీ ఎంత పెరగాలో
- అంత పెరిగింది ఇక అందరి చూపూ మనవైపే ఉంది
- సంపర్క్ అభియాన్‌తో
- బలోపేతం కావాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రె డ్డి
నిర్మల్‌రూరల్ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగామని, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రుజువైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలన్నారు. స్థానిక ఎంఎస్ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం సంపర్క్ మహా అభియాన్‌పై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార టీఆర్‌ఎస్ ఎంత పెరగాలో అంత పెరిగిందని, ఇక ఆ పార్టీకి అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న ఉద్యమ నాయకులు, కొత్తగా చేరిన నాయకుల మధ్య సయోధ్య లేదన్నారు. ఇస్లామిక్ రాజ్యాల్లో కూడా మహిళా మంత్రులు ఉన్నారని, కానీ తెలంగాణలో మహిళలకు కేసీఆర్ అవకాశమివ్వలేదని ఎద్దేవా చేశారు.
ఘనంగా హామీలిస్తూ.. అమలులో పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్తారన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్న పార్టీగా పేరొందిన బీజేపీ వైపే అందరి చూపు ఉందన్నారు. ప్రతీ కార్యకర్త సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఈనెల 20లోపు విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన వారందరినీ పార్టీ కార్యకర్తలుగా మార్చాలని చెప్పారు.
దీన్‌దయాళ్ మహా ప్రశిక్షణ అభియాన్ పేరిట మండల స్థాయి నుంచి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రతీ పోలింగ్‌బూత్‌లో జరపాలన్నారు. అదే రోజున వినాయకచవితి, విశ్వకర్మ జయంతి, ప్రధాని మోదీ జన్మదినం ఉందన్నారు. పార్టీలకతీతంగా అందరూ జాతీయజెండా ఎగరేయాలని కోరారు. తాను కూడా రాష్ట్రంలోని తొమ్మిది వేల గ్రామపంచాయితీల సర్పంచ్‌లకు లేఖలు రాస్తానన్నారు. ఎంఐఎంకు భయపడే టీఆర్‌ఎస్ గతేడాది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదన్నారు.
‘సంపర్క్’పై జిల్లా నాయకులకు క్లాస్..
దేశవ్యాప్తంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహా సంపర్క్ అభియాన్‌పై ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేకపోవడం ఏంటని జిల్లా నాయకులపై కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో అభియాన్ తీరు, సభ్యత్వ నమోదు తదితర వివరాలు సేకరించారు. ఈనెల 20లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని, ఆ తర్వాతే ఉద్యమాలపై దృష్టిపెట్టాలని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్, గిరిజన మోర్చ జాతీయ కార్యదర్శి శ్రీరాంనాయక్, స్వచ్ఛభారత్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్, కిసాన్‌మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయల శంకర్, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్, మహిళ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుహాసినిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమాదే వి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రంగు నాగేందర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు ఆరుముల్ల పోషం, ముల్కల్ల మల్లారెడ్డి, పెందూర్ ప్రభాకర్, వేణు, సతీశ్‌రావు, మెడిసెమ్మె రాజు, మడావిరాజు, ఒడిసెల శ్రీనివాస్, రచ్చ మల్లేశ్, నగర అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్, నగర ప్రధాన కార్యదర్శి నాయిడి మురళీధర్, కార్యదర్శి శశిరాజ్‌వర్మ, శ్రావణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.