టీఆర్‌ఎస్‌కు క్షేత్రస్థాయిలో బలం లేదు
- అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను చేరుకోలేదు
- దేవీప్రసాద్ ఓటమికి టీఎన్‌జీవోలకు సంబంధం లేదు
- టీఎన్‌జీవో ప్రభుత్వ అనుబంధ సంస్థ కాదు
- ఫిట్‌మెంట్ బకాయిలకు బాండ్లు ఇవ్వరు
- మీట్ ది ప్రెస్‌లో టీఎన్‌జీవో అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు క్షేత్రస్థాయిలో బలంలేక ఓటర్లను చేరుకోలేకపోయిందని, అందువల్లనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ఓటమి చెందారని టీఎన్‌జీవో నూతన అధ్యక్షుడు కె. రవీందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్ని జిల్లాలకు చెందిన ఓటర్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉండడం, భిన్న సంస్కృతుల నేపథ్యం కూడా ఆయన ఓటమికి కారణమయ్యాయని అన్నారు. దేవీప్రసాద్ పోటీలో ఉండడం వల్లనే 40 వేల ఓట్లు పోలయ్యాయని తాము భావిస్తున్నట్లు చెప్పారు.
టీఎన్‌జీవో అధ్యక్షుడిగా నియమితులైన రవీందర్‌రెడ్డితో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(టీయూడబ్ల్యూజే) గురువారం మీట్ ది ప్రెస్ నిర్వహించింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్ ఓటమికీ టీఎన్‌జీవోలకు సంబంధం లేదని, ప్రతీ ఉద్యోగి ఆయన గెలుపు కోసం పనిచేశారని అన్నారు. టీఆర్‌ఎస్ ఓటింగ్ శాతాన్ని పెంచుకోలేకపోయిందని, సమయం తక్కువగా ఉన్నందు వల్ల కిందిస్థాయిలో ఓటర్ల దగ్గరికి వెళ్లలేకపోయినట్లు చెప్పారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి కూడా పనిచేసిందన్నారు.
అవగాహన లేకే.. ఎన్నికల కమిషన్ పట్టభద్రుల ఓట్లు వినియోగించుకునే పద్ధతిపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలమైందని రవీందర్‌రెడ్డి అన్నారు. దానివల్లే దేవీ ప్రసాద్ ఓడిపోయారని చెప్పారు. దేవీప్రసాద్ ఎప్పటికీ ఉద్యోగ సంఘాల నేతేనని, ఆయనకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని సీఎంను కోరామని చెప్పారు. పెరిగిన పీఆర్‌సీకి సంబంధించి త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందన్నారు. బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేసి నగదు రూపంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. నగదు రూపంలోనే చెల్లిస్తారని, హెల్త్‌కార్డుల జారీకి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని ఆశిస్తున్నామన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే..
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఎన్‌జీవో సమర్థించిందని రవీందర్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభించదన్నారు. సకలజనుల సమ్మె ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసినట్లు చెప్పారు. ఇన్నాళ్లూ సీమాంధ్ర పాలకులతో సమస్యలపై పోరాడిన టీఎన్‌జీవో ఇప్పుడు తెలంగాణలో మన ప్రభుత్వం ముందు సమస్యలపై పోరాటం చేయాల్సిన పరిస్థితి రానుందన్నారు.
42 రోజుల సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, తద్వారా రిటైరైన ఉద్యోగులకు కూడా ఉపయోగం ఉంటుందన్నారు. అంతకు ముం దు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజే యూ) సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు టీఎన్‌జీవోకు అవినాభావ సంబంధం ఉందన్నారు. మీడియాలో హక్కుల కోసం జర్నలిస్టులు చేసిన పోరాటాలకు కూడా టీఎన్‌జీవో మద్దతు పలికిందన్నారు.
ఈనాడు పత్రికలో యాజమాన్య వైఖరికి నిరసనగా 24 రోజుల పాటు జరిగిన సమ్మెకు మూడున్నర దశాబ్దాల క్రితమే టీఎన్‌జీవో అండగా నిలిచి పత్రికలోని ఉద్యోగులకు తిండిపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి హమీద్, మన తెలంగాణ దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, హెయూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విరాహత్ అలీ, కోటిరెడ్డి, ఇతర నాయకులు సోమసుందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.