- రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో అమీతుమీ
- టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ
- ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
- తొలిసారిగా ‘నోటా’కు అవకాశం
- ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
- 25న ఓట్ల లెక్కింపు.. ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాష్ర్ట ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆరు జిల్లాల పరిధిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ స్థానంలో 2,86,311 మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా, 413 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ‘వరంగల్-ఖమ్మం-నల్గొండ’ నియోజవకర్గంలో 2,81,138 మంది ఓటర్లకు గాను 273 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి.
ఈ నెల 25న హైదరాబాద్ విక్టరీ ప్లేగ్రౌండ్, నల్గొండ ఎన్‌జీ కాలేజ్ ప్రాంగణాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 53 మంది పోటీ పడుతున్నారు. పోలింగ్ సజావుగా సాగడానికి అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగినంత మంది సిబ్బందిని, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అన్నిచోట్ల సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం గుర్తించిన 13 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని చెప్పారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా(నన్ ఆఫ్ ది అబౌ)’కు అవకాశం కల్పించారు.
దేవీప్రసాద్‌పైనే అందరి దృష్టి
‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 31 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉద్యోగ సంఘాల నేత జి. దేవీప్రసాద్‌రావు, టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా ఎన్. రామచంద్రారావు, కాంగ్రెస్ నుంచి ఆగిరి రవికుమార్ గుప్తా పోటీలో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీ మేరకు దేవీప్రసాద్‌ను శాసనమండలికి పంపించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున కసరత్తు చేశారు.
జిల్లాల్లో మకాం వేసి మరీ మంత్రులు ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో టీడీపీ, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీతో పాటు బీజేపీ శ్రేణులు ప్రచారం చేశాయి. ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే నెలకొని ఉందని, కాంగ్రెస్‌తో పాటు ఇతర అభ్యర్థులు నామమాత్రంగానే ప్రభావం చూపే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోచోట నలుగురి మధ్య పోటీ
‘వరంగల్-ఖమ్మం- నల్గొండ’ పట్టభద్రుల నియోజవకర్గంలో 22 మంది పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విద్యా సంస్థల అధినేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, కమ్యూనిస్టు పార్టీల నుంచి సూరం ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. వరంగల్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా ప్రభావం చూపుతోంది. అన్ని పార్టీల నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు.