ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరం | TRS Picks Tummala, Kadiam for MLC Polls, Cong Faces Danam Ire | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరం

Published Fri, May 22 2015 3:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

TRS Picks Tummala, Kadiam for MLC Polls, Cong Faces Danam Ire

ఐదో అభ్యర్థిని రంగంలోకి దింపిన టీఆర్‌ఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా సీట్లకు జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానాల్లో ఐదింటిని సొంతం చేసుకునే వ్యూహంలో అధికార టీఆర్‌ఎస్ ఉంది. తమకున్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి తేలిగ్గా 4 స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా లో ఉన్న ఆ పార్టీ మరో స్థానం కోసం కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో ఎన్నిక అనివార్యమవుతోంది. స్థానాలు, ఓట్ల సంఖ్యను బట్టి ఒక్కో ఎమ్మెల్సీ గెలవడానికి 18 ఓట్లు అవసరం.

ఈ లెక్కన టీఆర్‌ఎస్‌కు నాలుగు, కాంగ్రెస్‌కు ఒక స్థానం ఖాయమవుతాయి. ఇక టీడీపీ చేతిలో 16 ఓట్లు(బీజేపీ 5 ఓట్లను కలిపితే) ఉన్నాయి. ఇతర పార్టీల మద్దతుతో ఆ పార్టీ కూడా ఒక స్థానం గెలుచుకునే ది. అయితే ఆరుగురు అభ్యర్థులే బరిలో ఉంటే నే ఇది సాధ్యమయ్యేది. టీడీపీకి అవసరమైన మెజారిటీ లేదని భావిస్తున్న టీఆర్‌ఎస్ తమ వద్ద మిగిలిపోయిన మూడు ఓట్లకు తోడు, అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం చేతిలో ఉన్న ఏడు ఓట్లను పరిగణనలోకి తీసుకుని పది ఓట్లు ఉన్నాయని లెక్కలేసుకుంది.

ఇతర పార్టీల నుంచి తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి అండతో ఐదో స్థానాన్ని కూడా గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.
 
విప్ జారీ చేస్తే!
మండలి ఎన్నికలు రహస్య బ్యాలెట్  విధానంలో జరగనున్నందున ఏ పార్టీ ఎమ్మెల్యే.. ఏ పార్టీ అభ్యర్థికి ఓటేశాడో అధికారికంగా తెలియదు. దీన్ని ఆసరా చేసుకుని ఓట్లను క్రాస్ చేయించాలన్న ఆలోచనలో అధికార పార్టీ ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, మండలి ఎన్నికల్లోనూ ఓటును చూపించి వేయాలని కోర్టు నుంచి ఆదేశాలు పొందే వెసులుబాటు ఉందని, దీంతో ఇతర పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం ఎక్కువగా ఉందన్న వాదన వినిపిస్తోంది.

దీంతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓట్లేయలేని పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇదే జరిగితే, నాలుగో అభ్యర్ధిని గెలిపించుకోవడానికే టీఆర్‌ఎస్ నానా కష్టాలు పడాల్సి వస్తుంది. దీంతో ఐదో అభ్యర్థి ఓడిపోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 25వ తేదీ దాకా నామినేషన్ల ఉపసంహరణకు గడువున్నం దున, ఈ అంశాలన్నింటినీ విశ్లేషించుకుని ఒక అభ్యర్థిని బరిలో నుంచి తప్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
వాస్తవ బలమెంత?
సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచిన ఎమ్మెల్యే స్థానాలు 63. ఇద్దరు బీఎస్పీ సభ్యులు కూడా విలీనం కావడంతో పార్టీ ఎమ్మెల్యేల బలం 65కు పెరిగింది. ఈ సంఖ్యతో నాలుగు స్థానాలు గెలుచుకోవడమే కష్టం. నాలుగో అభ్యర్థికి కచ్చితంగా ఎంఐఎం మద్దతు అవసరం. కానీ, కాంగ్రెస్, టీడీపీల నుంచి నలుగురు చొప్పున, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు కలిపి మొత్తంగా పది మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో తమ బలం 75కి చేరినట్లు ఆ పార్టీ చెబుతోంది. దీంతో నాలుగు స్థానాలు గెలచుకుంటామని, ఇంకా మిగిలే మూడు ఓట్లు, ఎంఐఎం ఓట్లు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో ఐదో స్థానాన్నీ సొంతం చేసుకుంటామని గులాబీ నేతలు చెబుతున్నారు. ఇక సీపీఐ మద్దతుతో కాంగ్రెస్ తన ఒక్క సీటును సునాయాసంగా గెలుచుకునే అవకాశముంది. టీడీపీ గెలుపు అవకాశాలు దాని వ్యూహాలపైనే ఆధారపడి ఉన్నాయి.
 
టీఆర్‌ఎస్ నుంచి ఐదుగురు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 1న ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజైన గురువారం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వేంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

అయితే, వీరిలో ఎవరు మొదటి అభ్యర్థి, ఎవరు అయిదో స్థానం కోసం పోటీ పడే అభ్యర్థి అన్న విషయాన్ని పార్టీ ప్రకటించలేదు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు నేతలంతా గన్ పార్కులోని అమర వీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల సొంత జిల్లాలకు చెందిన పలువురు నాయకులు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, చందూలాల్, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

మొదట గురువారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తారని సమాచారం అందించారు. అయితే మధ్యాహ్నం 2.30 గంటలకు వీరంతా నామినేషన్లు దాఖలు చేశారు. నలుగురు అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను ఉదయం 11 గంటలకే పంపించారని సమాచారం. అయితే, కె.యాదవరెడ్డి నామినేషన్ పత్రాలతో జతచేయాల్సిన ఓటరు ధ్రువీకరణ పత్రాలను పాత ఫార్మాట్‌లో పెట్టడంతో ఆలస్యమైందని తెలిసింది.
 
ఐదూ గెలుస్తాం: కడియం
‘శాసన మండలి ఎన్నికల్లో ఐదుగురు టీఆర్‌ఎస్ అభ్యర్థులం గెలుస్తాం. ఎమ్మెల్యేగా గెలిచాక వారంలోపు ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా మాకు మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నా.’

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement