సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఒంటరిగా బరిలో దిగాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ వారంలో తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఆ పార్టీ.. మొదటి విడతలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల చేరికతో మంచి ఊపు మీదున్న గులాబీ దండు జిల్లాలో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆక ర్షించడం ద్వారా సాధారణ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను నమోదు చేయాలని భావి స్తోంది.
పరిగి, తాండూరు, చేవెళ్ల ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో బలీయంగా త యారవుతోంది. దక్షిణ తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించునేలా వ్యూహ రచన చేస్తున్న టీఆర్‌ఎస్.. వలసలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా జిల్లాలో బలంగా ఉన్న టీడీపీని దారుణంగా దెబ్బతీసింది. ఇదే దూకుడును ప్రదర్శించేందుకు మరికొందరు కాంగ్రెస్ నాయకులపై కన్నేసింది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్న గులాబీ దళం.. వారం రోజుల్లోగా ఈ చేరికలను కొలిక్కి తీసుకురావాలని నిర్ణయించింది.
ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా కుత్బుల్లాపూర్, మేడ్చల్, మహేశ్వరం అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉంటాయని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టాలని అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నందున.. వీటిపై ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోవద్దని నిర్ణయించింది. ఎల్‌బీనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డిని బరిలోకి దించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అయితే, వయోభారం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయన విముఖత చూపుతున్నట్లు తెలిసింది.
మరోవైపు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు కారెక్కేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇక్కడ అభ్యర్థుల జాబితా మారే అవకాశం లేకపోలేదు. వికారాబాద్ నుంచి విద్యార్థి నేత పిడమర్తి రవిని బరిలోకి దింపాలని భావిస్తున్నప్పటికీ స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆనంద్ వ్యవహరిస్తున్నారు. తాజాగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సంజీవరావు కూడా పార్టీలో చేరారు. వీరివురినీ కాదని స్థానికేతరుడికి సీటిస్తే ఒప్పుకొనేది లేదని స్థానిక నాయకత్వం హెచ్చరిస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైనా... మల్కాజిగిరి విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కారు.. తకరారు!
Published Wed, Mar 26 2014 11:40 PM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM
Advertisement