‘ప్రగతి నివేదన’ సక్సెస్!
2019 ఎన్నికలకు టీఆర్‌ఎస్ శంఖారావం
- వరంగల్‌లో 16వ వార్షికోత్సవ సభ
- భారీ సంఖ్యలో హాజరైన జనం, కార్యకర్తలు
- ట్రాక్టర్లలో తరలివచ్చిన రైతులు
- భారీ వేదిక.. పెద్ద సంఖ్యలో నేతలతో కళకళ
- ఆకట్టుకున్న ధూం ధాం, సాంస్కృతిక కార్యక్రమాలు
- మూడేళ్ల పనితీరును ప్రజల ముందు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్
- సంక్షేమ, అభివృద్ధి పథకాలపై వివరణ ∙కాంగ్రెస్‌పై మండిపాటు
(వరంగల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): వచ్చే సాధారణ ఎన్నికలు లక్ష్యంగా.. తమ మూడేళ్ల పాలన తీరును వివరిస్తూ టీఆర్‌ఎస్ వరంగ ల్‌లో నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరం గసభ విజయవంతమైంది. గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమ పాలన లో సాధించిన ప్రగతిని ప్రజల ముందు పెట్టా రు. నిర్ణీత సమయం కన్నా కొంత ఆలస్యంగా సభకు చేరుకున్న కేసీఆర్.. 30 నిమిషాల పాటు ప్రసంగించారు. పెద్దగా రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం సాధించిన ప్రగ తిని వివరించడంపైనే దృష్టి పెట్టారు. తెలం గాణ సాధన ఉద్యమం నుంచి రాష్ట్ర ఏర్పాటు నాటికి ఉన్న సమస్యలను గట్టెక్కే వరకు, విద్యుత్ సమస్యను తీర్చడం, సాగునీటి ప్రాజె క్టుల నిర్మాణం అంశాలను ప్రస్తావించారు.
ముఖ్యంగా తమ పాలనలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేం దుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇటీవలే రైతులకు హామీ ఇచ్చిన ఎకరాకు రూ.4 వేల ఆర్థిక సాయం తదితర పథకాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యవహరించారు. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వివిధ వృత్తులకు వెన్నుదన్నుగా నిలి చేలా తీసుకుంటున్న చర్యల గురించీ వివరిం చారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులను ట్రాక్టర్లలో సభకు తరలించాలన్న వ్యూహం ఫలితాన్నిచ్చింది.
2019 సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం!
టీఆర్‌ఎస్ తమ 16వ ఆవిర్భావ సభను రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం పూరించడానికి సమర్థంగా విని యోగించుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రాజకీయ కారణాల నేపథ్యంలో ఈ సభ ద్వారా టీఆర్‌ఎస్ ఒక విధంగా బలప్రదర్శన చేసింది. ఉద్యమమప్పుడే కాదు ఇప్పటికీ జన సమీకరణలో బలంగా ఉన్నట్లు నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ప్రగతి నివేదన బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నం చేసింది. సభ కోసం దాదాపు నెల రోజుల ముందు నుంచి ప్రణాళికబద్దంగా పనిచేసిన పార్టీ నాయకత్వం ఇందులో విజయవంతమైంది.
ఇక విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ, టీడీపీలతో పాటు ఇతర పార్టీలను పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా.. తమ ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ పార్టీయేనని మరోమారు తేల్చారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తంచేశారు. ప్రజల అండ దండలు, దీవెనలు కావాలని కోరారు కూడా.
భారీ వేదిక.. ఆకట్టుకున్న ధూం ధాం
► సీఎం సభకు చేరుకునే వరకు రాష్ట్ర సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో చేపట్టిన ధూం ధాం కార్యక్రమం ఆకట్టుకుంది.
► సభ కోసం భారీ వేదికను ఏర్పాటు చేశారు. తొలిసారిగా పూర్తిస్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు.. ఇలా అందరూ వేదికపైనే ఆసీనులయ్యారు.
► ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఎంపీ కే.కేశవరావులకు మాత్రమే కొంతసేపు ప్రసంగించే అవకాశం వచ్చింది. డిప్యూటీ సీఎంలిద్దరూ కేసీఆర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. కేసీఆర్ ఏకైక బాహుబలి అంటూ కడియం తన ప్రసం గంలో పేర్కొనడంతో సభా ప్రాంగణం చప్పట్లు, ఈలలు, కేకలతో హోరెత్తింది.
మైనారిటీలకు సర్కారు అండ
దేశంలో ఎక్కడాలేని పథకాలు అమలు: మహమూద్ అలీ
న్యూశాయంపేట: మైనారిటీల సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప జేశారని చెప్పారు. పేద ముస్లింల కోసం షాదీ ముబారక్, గురుకుల పాఠశాలలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం 80 శాతం సబ్సిడీతో రుణాలు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. వృద్ధులు, వితంతువులకు రూ.1,000, వికలాంగులకు రూ.1,500 పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి గత ప్రభుత్వాలు తక్కువగా బడ్జెట్‌ను కేటాయిస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకంగా రూ.1,200 కోట్లు కేటాయించిందన్నారు.
జయశంకర్ సార్ యాది
టీఆర్‌ఎస్ గతంలో హన్మకొండలో నిర్వహించిన సభలను కేసీఆర్ ప్రస్తావిస్తూ.. జయశంకర్ సార్‌ను గుర్తుచేసుకున్నారు. ‘‘ఇదే గ్రౌండ్‌లో అనేక సందర్భాల్లో మనం కలిసినం. ఉద్యమం గురించి మాట్లాడుకున్నం. అప్పటికీ, ఇప్పటికీ ఒక్కటే తేడా.. అప్పట్లో నేను మాట్లాడే ముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాట్లాడేవారు. ఇప్పుడాయన మన మధ్య లేరు. స్వర్గం నుంచి చూస్తున్నరు. జయశంకర్ సార్ అమర్ రహే.. అని మనమందరం ఆయనకు చప్పట్లతో నివాళి ఇవ్వాలి..’’అని పేర్కొన్నారు. దీంతో సభకు హాజరైన ప్రజలంతా చప్పట్లు కొట్టడంతో సభాస్థలి మారుమోగింది. ఇక తెలంగాణ కళాకారుల బృందం జయశంకర్ సార్‌పై పాడిన పాట ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసింది.
ఓరుగల్లు.. పోరుగల్లు
తనకు సెంటిమెంట్ పరంగా కలిసొచ్చిన వరంగల్‌ను కేసీఆర్ బహిరంగసభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉద్యమంలో అండగా నిలిచిందంటూ ‘ఓరగల్లు.. పోరుగల్లు.. నిజమే కదా’అని వ్యాఖ్యానించారు. అదే స్థలంలో గతంలో నిర్వహించిన సభలను కూడా గుర్తు చేశారు. ఇక భారీ బహిరంగ సభ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగసభ ఏర్పాట్లు చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు, గ్రేటర్ వరంగల్ మేయర్‌లను సభా వేదికపై అభినందించారు. భవిష్యత్‌లో కూడా వరంగల్ ప్రజలు తమ వెన్నంటి ఉండాలన్నారు.
కుప్పకూలిపోయి కార్యకర్త మృతి
హన్మకొండ: ప్రగతి నివేదన బహిరంగ సభ సందర్భంగా స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం సభాస్థలి నుంచి తిరిగి వెళుతుండగా.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మాటకు చెందిన ఎనుముల పోచయ్య (38) ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. ఆయనకు వెంటనే సభాస్థలిలోని వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మరణించారని బహిరంగసభ వైద్య కమిటీ సభ్యుడు డాక్టర్ మదన్‌కుమార్ తెలిపారు. ఈ సమాచారాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా.. పోచయ్య టీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త అని, ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించినట్లు తెలిపారు.