సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన గులాబీ పార్టీ.. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోకు సాన పెడుతోంది. ఆసరా పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయంలో మేనిఫెస్టో బాగా ప్రభావం చూపింది. అప్పటి హామీలు, ముఖ్యంగా బంగారు తెలంగాణ నినాదం ప్రజలకు బాగా చేరింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే పంథాతో వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇందుకు అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పనకు టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నేతృత్వంలో 14 మంది నేతలతో కమిటీ నియమించారు. మంత్రులు కేటీఆర్, చందూలాల్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కమిటీలో ఉన్నారు. కమిటీ తొలి సమావేశం ఈ నెల 15న జరగనుంది. ఆరోజే మేనిఫెస్టో నివేదికను కేసీఆర్‌కు అందించే అవకాశం ఉంది.
వికలాంగులకు రూ.2 వేలు!: మేనిఫెస్టోలో కొత్త హామీలు తక్కువగానే ఉండనున్నాయి. ప్రస్తుతం ఆసరా పథకం కింద రాష్ట్రంలో 40 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వికలాంగులకు నెలకు రూ.1,500.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు బాధితులకు రూ.1,000 చొప్పున చెల్లిస్తున్నారు. వికలాంగులకు రూ.2,000, ఇతర వర్గాలకు రూ.1,500లకు పింఛన్ పెంచే అవకాశాలపై టీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు తెలిసింది. అలాగే నిరుద్యోగ భృతి చెల్లింపు అంశమూ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది.
ఆసరా పింఛన్లు పెంపు!
Published Thu, Sep 13 2018 2:00 AM | Last Updated on Thu, Sep 13 2018 2:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment