టీఆర్‌ఎస్‌కు ఝలక్! | TRS Jhalak! | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు ఝలక్!

Published Thu, Mar 26 2015 1:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

TRS Jhalak!

  • మండలి ఫలితాల్లో అధికార పార్టీకి చేదు ఫలితం
  • మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో ఓటమి
  • దేవీప్రసాద్‌పై బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపు, 13,318 ఓట్ల ఆధిక్యం
  • మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఘన విజయం
  • టీఆర్‌ఎస్‌ను గట్టెక్కించలేకపోయిన హామీలు
  • నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో మాత్రం ఆధిక్యం
  • నేటి మధ్యాహ్నానికి ఫలితం తేలే అవకాశం

  • సాక్షి, హైదరాబాద్, నల్లగొండ: శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ ఖంగుతిన్నది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్ధి దేవీప్రసాద్ ఓటమిపాలయ్యారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపొందారు. 13,318 ఓట్ల ఆధిక్యతతో విజయభేరి మోగించారు. మొత్తం 1,11,739 ఓట్లు పోలవగా రామచంద్రరావుకు 53,881 ఓట్లు, దేవీప్రసాద్‌కు 40,563 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్ గుప్తాకు 2,856 ఓట్లు మాత్రమే పడ్డాయి. లెక్కింపు పూర్తయి ఫలితం తెలిసినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతితో వివరాలను గురువారం ప్రకటించనున్నారు. కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజక వర్గంలో ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగుతుండడంతో గురువారం మధ్యాహ్నానికి తుది ఫలితం వస్తుందని అధికార వర్గాలు చెప్పాయి. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం  కోసం టీఆర్‌ఎస్ తీవ్రంగా శ్రమించింది. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో మంత్రులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి పెట్టారు. హాల్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. తొమ్మిది నెలలుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలను సైతం పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి దించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో ఏకంగా డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మంత్రులు విస్తృత ప్రచారం చేశారు. ఇంత చేసినా ఫలితం ప్రతికూలంగా రావడంపై టీఆర్‌ఎస్ వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి.
     
    పనిచేయని ‘పీఆర్సీ’

    ప్రభుత్వంపై సుమారు రూ. 5 వేల కోట్ల ఆర్థిక భారం పడుతున్నా, ఉద్యోగ వర్గాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించింది. ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం చేసినా.. పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా మూడు జీవోలను సర్కారు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆ వర్గాలు పూర్తిగా తమ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తాయని టీఆర్‌ఎస్ నాయకత్వం భావించింది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఉద్యోగులను నడిపించిన టీఎన్జీవోల నేత దేవీప్రసాద్‌ను అభ్యర్థిగా ఎంచుకోవడంలో కూడా టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. కానీ, చివరకు పీఆర్సీ మంత్రం కూడా పారకపోవడం పార్టీ నాయకత్వాన్ని షాక్‌కు గురిచేసింది. అలాగే హైదరాబాద్‌లో పట్టభద్రుల ఓట్లను దృష్టిలో పెట్టుకునే ఆంధ్రా ఉద్యోగులను, సెటిలర్స్‌ను టీఆర్‌ఎస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా, ప్రయోజనం లేకపోయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
     
    ఉపాధ్యాయ సంఘాలు చేయిచ్చాయా?

    టీఎన్జీవోల పెత్తనాన్ని ఉపాధ్యాయ సంఘాలు జీర్ణించుకోలేదని, అందుకే రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలు దేవీప్రసాద్‌కు వ్యతిరేకంగానే ఓట్లేశాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ‘ కేవలం ఉద్యోగాలు ఇవ్వడం కోసం డీఎస్సీ ప్రకటించం’ అంటూ సీఎం కే సీఆర్ శాసనమండలిలో చేసిన ప్రకటన కూడా కొంత ప్రతికూల ప్రభావం చూపినట్లు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క ప్రకటనా వెలువడ కపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం కూడా పట్టభద్రుల ఆగ్రహానికి కారణంగా పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ ఫలితంతో టీఆర్‌ఎస్ వర్గాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ ధీమాతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్లాలన్న పార్టీ నేతల ఆశలు అడియాసలయ్యాయి.
     
    ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిట్టీలు

    ప్రభుత్వంపై గూడుకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతూ కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిట్టీలను  బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. ‘తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు-నిధులు- నియామకాల కోసం.. కుటుం బ పాలన కోసం కాద’ని కొందరు ఓటర్లు చిట్టీలు వేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని, వెంటనే డీఎస్సీ ప్రకటన చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఎలాంటి సాకులు చూపొద్దని కూడా చిట్టీలు పడ్డాయి. ప్రభుత్వ పెద్దల తీరు మారకపోతే ఎన్నికల్లో ఇక ముందు కూడా బుద్ధి చెబుతామంటూ కొందరు ఓటర్లు చిట్టీల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈసారి భారీగా చెల్లని ఓట్లు పోలవడం గమనార్హం. ఒక్క ‘హైదరాబాద్’ ఎమ్మెల్సీ స్థానంలోనే 8,433 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 7.54 శాతం. దీంతో అభ్యర్థుల భవితను ఇవి కూడా ప్రభావితం చేశాయి.

    మరో స్థానంలో టీఆర్‌ఎస్ ఆధిక్యం

    నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడి కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి 10,886 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావుకు 8,935 ఓట్లు వచ్చాయి. వామపక్షాల అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డికి 2,947 ఓట్లు, కాంగ్రెస్ పక్షాన పోటీ చేసిన తీన్మార్ మల్లన్నకు 2,639 ఓట్లు లభించాయి. మొత్తంమీద చూస్తే టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టిపోటీ ఇస్తుం డగా, కాంగ్రెస్, వామపక్షాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. మొత్తం 13 రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, ఈ ఎన్నికల్లో పోలైన 1.50 లక్షల ఓట్ల లెక్కింపునకు కేవలం 20 టేబుళ్లనే ఏర్పాటు చేయడంతో లెక్కింపు ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. తుది ఫలితం గురువారం మధ్యాహ్నానికి వెల్లడయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, తొలి ప్రాధాన్యత ఓటులో విజేత తేలకుండా రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి వస్తే మరింత ఆలస్యం కానుంది.
     
    బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం

     
    హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపుతో బీజేపీలో నూతనోత్సాహం నిండింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం తమ పార్టీకే ఉందని బీజేపీ నేతల్లో ధీమా పెరిగింది. మూడు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన గెలుపును పార్టీ విస్తరణకు అనువుగా మార్చుకోవాలని, పక్కా వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే సానుకూ ల ఫలితాలు ఉంటాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌పై ఉద్యోగుల్లోనూ, విద్యావంతుల్లోనూ పేరుకున్న వ్యతిరేకత ఈ ఫలితాలతో వెల్లడైందని వారు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీకే అనుకూలం గా మారతాయని స్పష్టమైందని సంబరపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాత్మకంగా ఉంటూనే, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చినందుకు ఇప్పుడు సత్ఫలితాలు వస్తున్నాయని సీనియర్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో అనవసరంగా పోటీ చేశామని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ మూడో స్థానానికి  పడిపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నిండింది.
     
    ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు
     
    ‘ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు. మూడు జిల్లాల్లోని పట్టభద్రులు, విద్యావంతులు, ఓయూ విద్యార్థుల పాత్ర నా గెలుపులో ఉంది. టీడీపీ, లోక్‌సత్తా, కొన్ని సంస్థలు, విద్యార్థి సంఘాలు నా గెలుపు కోసం కృషి చేశాయి. గెలుపు కోసం అధికార పార్టీ డబ్బులు వెద జల్లింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లను బెదిరింపులకు గురి చే సినప్పటికీ నాకు ఓటేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు. ఖాళీ పోస్టుల భర్తీకి, ఇతర నోటిఫికేషన్ల కోసం శాసనమండలిలో నా గళాన్ని వినిపిస్తా. దేవిప్రసాద్ పోటీ చేయనని చెప్పినా... టీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. చివరకు ఆయన్ను బలిపశువును చేశారు’        
    - ఎన్. రామచంద్రరావు, బీజేపీ అభ్యర్థి
     
    ప్రజలు మాకు వ్యతిరేకం కాదు

    ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు కాదు. అభ్యర్థిత్వం ఆలస్యం కావడంతో ఓటర్ల దగ్గరకు వెళ్లలేకపోయాం. రామచంద్రరావు రెండు సార్లు మండలి, ఒకసారి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయారు. దీని వల్ల ఓటర్లను ఎక్కువసార్లు కలుసుకున్న నేత గా ఆయనకు అధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలు ఒక్కటై టీఆర్‌ఎస్‌ను ఓడించాయి. నా గెలుపు కోసం వంద శాతం కట్టుబడి టీఆర్‌ఎస్ పని చేసింది. కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కష్టపడి పనిచేశారు. ఓటర్ల ను అనేక రకాలుగా ప్రలోభ పెట్టారు. ఓటమిపై విశ్లేషణ చేసుకుంటా. భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగుతాం.
    - దేవీప్రసాద్, టీఆర్‌ఎస్ అభ్యర్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement