'మెడలు విరుస్తాం.. పాతరేస్తాం' సరైనవేనా!
'మెడలు విరుస్తాం.. పాతరేస్తాం' సరైనవేనా!
Published Thu, Sep 11 2014 3:37 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
తెలంగాణ శాసనసభ, ఎమ్మెల్యేలపై మీడియా సంస్థలు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై మండిపడుతూ కేసీఆర్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు జాతీయ మీడియాలో బుధవారం సాయంత్రం వాడివేడి చర్చ జరిగింది. జాతీయ మీడియాలోని కొన్ని ఆంగ్ల టెలివిజన్ ఛానెల్లు టీఆర్ఎస్ నేతలతో జరిపిన చర్చాగోష్టిలో.. మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలను దుమ్ము దులిపాయి. తెలంగాణ ప్రాంతంలో పత్రికా స్వేచ్చను కాలరాసినందుకు క్షమాపణలు చెబుతారనుకుంటే.. పాతరేస్తామని జవాబిస్తారా అంటూ జాతీయ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ చర్చాగోష్టిలో పాల్గొన్న నిజమాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత కూడా తన తండ్రి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వెల్లడించారు. అంతేకాకుండా తన తండ్రి చేసిన వ్యాఖ్యలను తప్పుగా ట్రాన్స్ లేషన్ (తర్జుమా) చేసిన విధానాన్ని తప్పుపట్టారు. దాంతో కేసీఆర్ మాట్లాడిన సందర్భం, వ్యాఖ్యల్లో వాస్తవం జాతీయ మీడియాకు సరిగా చేరకపోవడం దురదృష్టకరమని కవిత అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని, సంస్కృతిని గౌరవించాలని కేసీఆర్ అన్నారని.. అయితే కొన్ని మీడియా చానెల్లు తమను మాత్రమే గౌరవించాలని విధంగా తప్పుడు కథనాలను ప్రసారం చేశాయన్నారు.
త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఎమ్మెల్యేలు కొలువుదీరిన రోజు కొన్ని మీడియా చానెల్లు ప్రసారం చేసిన కథనాలు సమంజసం కాదని కవిత తెలిపారు. తెలంగాణ ప్రాంతాన్ని, సంస్కృతిని అగౌరవపరిస్తే పాతరేస్తాం జాగ్రత్త. కేసీఆర్‌ను తిడితే బాధలేదు. తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని, ఉనికిని, గౌరవాన్ని వ్యతిరేకించేలా ఎవడు చేసినా మెడలు విరిచి అవతల పారేస్తం. మీడియా ముసుగులో ఇడియట్ ఆటలు చేస్తామంటే సాగనివ్వం. అయినా ఈ చానళ్లను మేం బ్యాన్ చేయలేదు అని కేసీఆర్ అన్న విషయాన్ని కవిత మరోసారి మీడియాకు వివరించారు.
ఏది ఏమైనా కేసీఆర్ మాటలు స్థానిక మీడియాలోనే కాకుండా.. జాతీయ మీడియాలోనూ దుమారం రేపాయి. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వ పరువును దిగజార్చేలా ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Advertisement
Advertisement