సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలో భయభ్రాంతులకు గురైన సీఎం కేసీఆర్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. నారాయణపేట జిల్లా దేవరకద్ర గ్రామంలో బీజేపీ కార్యకర్త ముష్టి ప్రేమ్ కుమార్ హత్యలో టీఆర్‌ఎస్ అగ్రనాయకుల ప్రమేయముందన్నారు. ప్రేమ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని కలిపి సామూహికంగా హత్య చేసేందుకు టీఆర్‌ఎస్ నాయకత్వం కుట్రపన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, పినరయి విజయన్‌ల మాదిరి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నాయకత్వం రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో దాడులు, హత్యా రాజకీయాలు మితి మీరి పోయే ప్రమాదముందని, వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉందని సంజయ్ హెచ్చరించారు. ప్రేమ్ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి హంతకులను, కుట్రకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment