
టీఆర్‌ఎస్‌లో ‘ఎర్రబెల్లి’ ముసలం!
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేరిక వ్యవహారం టీఆర్‌ఎస్‌లో అసంతృప్తికి తెర తీసింది. ముఖ్యంగా వరంగల్ జిల్లా పార్టీ నేతల్లో విభేదాలకు కారణమవుతోంది. పార్టీలో ఎర్రబెల్లి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి.. జిల్లాలోని పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశం కావాలనుకున్నారు. ఎర్రబెల్లిని పార్టీలో చేర్చుకోవద్దంటూ అందులో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని నిర్ణయించా రు.
ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆ ప్రయత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లికి వ్యతిరేకంగా ఎలాంటి సమావేశాలు పెట్టుకోవద్దంటూ శ్రీహరికి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ‘పార్టీ ప్రయోజనాల కోసమే ఎర్రబెల్లిని చేర్చుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో వ్యతి రేక సమావేశాలు పెట్టుకోవద్దు. ఇలాంటి పనులు మానుకో’ అని సీరియస్‌గానే కడియంని కేసీఆర్ హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో ఎర్రబెల్లి వ్యతిరేక సమావేశం ఆలోచనను కడియం, ఇతర ఎమ్మెల్యేలు విరమించుకున్నారు. ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని ఆ పార్టీలోని వరంగల్ పట్టణానికే చెందిన ఇద్దరు ముఖ్య ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లోకి వస్తే ఆ పార్టీలో ఇక మేమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు.