టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ‘సెప్టెంబర్‌’ ఫీవర్‌ ! | TRS Leaders Tension Elections Karimnagar | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ‘సెప్టెంబర్‌’ ఫీవర్‌ !

Published Sun, Aug 19 2018 7:53 AM | Last Updated on Sun, Aug 19 2018 6:54 PM

TRS Leaders Tension Elections Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: చరిత్రలో సెప్టెంబర్‌ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది ఈ మాసంలోనే.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కూడా సెప్టెంబర్‌నే కీలక మాసంగా ప్రకటించారు. ‘ముందస్తు’ ఎన్నికలు డిసెంబర్‌లో వస్తాయంటూ ఈనెల 13న కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన, సెప్టెంబర్‌లోనే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో దాదాపుగా ‘సిట్టింగ్‌’లకే అవకాశం కల్పిస్తామన్న గులాబీ దళనేత, సర్వే నివేదికలు, స్క్రీనింగ్‌ కమిటీల సిఫారసులను కూడా ప్రామాణికంగా తీసుకోనున్నామన్నారు. ఇదివరకే నాలుగున్నరేళ్లలో ఐదు సర్వేలు చేయించిన ఆయన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన నలుగురైదుగురు ఎమ్మెల్యేలకు పాస్‌ మార్కులు రాలేదని చెప్పారు.

మూడు నెలల కిందట కూడా ఆయన ఇంటెలిజెన్స్‌ నివేదికల ఆధారంగా జిల్లాలో నలుగురైదుగురు ‘డేంజర్‌జోన్‌’లో ఉన్నట్లు కూడా హెచ్చరించారు. ఇదే సమయంలో ఈనెల 13న టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన జిల్లా అధికార పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని పదేపదే చెప్పిన కేసీఆర్‌ ఈసారీ అదే ప్రకటన చేసినా.. సర్వే ఫలితాలు, స్క్రీనింగ్‌ కమి టీల రిపోర్టులు ఆధారంగానే అభ్యర్థుల ఖరారు ఉంటుందని మెలిక పెట్టడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

సెప్టెంబర్‌లో అభ్యర్థుల ప్రకటన..?   పార్టీ నేతలు అప్రమత్తం..
అనుకున్నట్లుగానే ఎన్నికలు వస్తే సెప్టెంబర్‌లోనే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌ పరిసర ప్రాంతాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలోనే అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ముఖ్యమంత్రి స్ప ష్టం చేయడంతో ఇక పొత్తుల బెడద తప్పినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ‘ముందస్తు’ ప్రకటన నేపథ్యంలో జిల్లాలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో ఏ పార్టీ జత కట్టే అవకాశం ఉంది? అది తమకు ఎలా కలిసి వస్తుంది? అనే అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు స్క్రీనింగ్‌ కమిటీలు వేసి అభ్యర్థుల ఎంపికలో వారి పాత్రను కీలకం చేయనున్నట్లు కూడా అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా గులాబీ నేతలు అప్రమత్తం అవుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. కులాలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల జాబితాపై ఆరా తీస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని తొమ్మిది స్థానాల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సిట్టింగ్‌లు ప్రజల్లో తమ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే అధినేత ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు.

 
ఆశావహుల్లో సర్వేలు, స్క్రీనింగ్‌ల దడ.. మంత్రి కేటీఆర్‌ ప్రకటనతో ఊరట..
టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16 సంవత్సరంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ మొదట సర్వే జరిపించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి వరకు మరో రెండు విడతల సర్వే నిర్వహించారు. మొదటి, రెండో విడతల ఫలితాలు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. ఆ సమావేశంలోనే ర్యాంకులు, మార్కులను ప్రకటించారు. తొలి సర్వేలో మంచి మార్కులు కొట్టిన్న వారు కూడా రెండో, మూడో సర్వే నాటికి వెనుకబడిపోగా, మరికొందరు మెరుగుపర్చుకున్నట్లు తేల్చారు.

ఆ తర్వాత నాలుగో విడత, ఇంటెలిజెన్స్‌ల ద్వారా కూడా జరిగినప్పటికీ గోప్యంగా వ్యవహరించిన అధినేత.. సర్వే ఫలితాలను ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వివరించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన తొలి, రెండో సర్వేలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజలు ఫస్ట్‌ ర్యాంకు ఇచ్చారు. తొలి సర్వేలో మంత్రి 73.50 శాతంగా ఉంటే.. రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది.

ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30 శాతానికి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ 70.60 శాతం నుంచి 60.40 శాతానికి తగ్గి, ఆ తర్వాత భారీగా పెరిగినట్లు అధినేత వెల్లడించారు. తొలి, రెండో, మూడో సర్వేలకు పోలిస్తే కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నాలుగు శాతం పెరగగా, మూడు, నాలుగో విడతలకు మిగతా ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే శోభ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి గ్రాఫ్‌ మొదటి, రెండు సర్వేలకంటే పెరిగినట్లు ప్రకటించారు.

చివరకు మొత్తంగా 13 మందిలో ఇద్దరు, ముగ్గురు ఇంకా డేంజర్‌జోన్‌లో ఉన్నారని పేర్కొనడం అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇదే సమయంలో ‘ముందస్తు’ నేపథ్యంలో సెప్టెంబర్‌లో అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్‌ ప్రకటించడం పలువురిలో ‘సెప్టెంబర్‌’ ఫీవర్‌ పట్టుకుంది. ఇదిలా వుంటే ఇటీవల కరీంనగర్‌లో ప్రకటించిన మంత్రి కేటీఆర్‌ ‘నాకంటే, మంత్రి ఈటల రాజేందరన్న కంటే, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ కంటే కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు’ అంటూ చెప్పకనే చెప్పారు. ‘మళ్లీ ఈ జిల్లాలో ఇప్పుడున్న మేమే పోటీ చేస్తాం.. మేమే గెలుస్తాం’ అని మాట్లాడటం ‘సిట్టింగ్‌’లకు ఊరట కలిగించింది.
 
అసెంబ్లీ స్థానాల రేసులో ఎంపీల పేర్లు..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉండి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తారని అందరూ ఆశించారు. కానీ.. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వివేక్‌ అనూహ్యంగా మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటివరకు చొప్పదండి అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న బాల్క సుమన్‌ పెద్దపల్లి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బాల్క సుమన్‌ విజయం సాధించా రు. కాగా.. గతేడాది మాజీ ఎంపీ జి.వివేక్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.

వివేక్‌ తిరిగి టీఆర్‌ఎస్‌లోకి రావడంతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో బాల్క సుమన్‌ ఇటు ఉమ్మడి కరీంనగర్, అటు ఉమ్మడి అదిలాబాద్‌లోని ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ నిజామాబాద్‌ ఎంపీ, సీఎం కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత కూడా జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగ్గా, ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. అక్కడి నుంచి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేరు ఖాయంగా చెప్తున్నారు. రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణమాలు, సమీకరణల నేపథ్యంలో ఏ మార్పులైనా సంభవించవచ్చన్న చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement