
ఓట్లు, సీట్ల కోసం టీఆర్‌ఎస్ ఆవిర్భవించలేదు
పాలమూరు గోస తీరుస్తాం: కవిత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఓట్లు, సీట్ల కోసం టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. యావత్ తెలంగాణ ప్రజల ఉద్యమ ఆశీస్సులతో ఇచ్చిన అధికారాన్ని పాలమూరు కరువు గోసను తీర్చడానికి వినియోగిస్తామని, చదువుల జిల్లాగా మార్చే వరకు సీఎం కేసీఆర్ విశ్రమించబోరన్నారు. శని వారం రాత్రి మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడు తూ ఇంటింటికి తాగునీరు ఇవ్వకపోతే ఓట్లే అడగనని ప్రజలకు స్పష్టంచేసిన రాజకీయ నేత కేసీఆర్ తప్ప దేశంలో మరెవరూ లేరని, ఇందుకు ఏ చరిత్ర పుస్తకాలైనా తిరగేయవచ్చని అన్నారు.
పాలమూరు ఎంపీగా కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ రావడం ఒక మహత్కార్యంగా భావిస్తున్నామని కవిత పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారని, డిజైన్, టెండర్ల ప్రక్రియ ఏకకాలంలో పూర్తి చేసి ఈ జిల్లాపై తనకున్న మక్కువను చాటార న్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి తప్ప మరేమీ అవసరం లేదని, పైసల, ప్రాణాలు, పదవులపై ఏనా డో ఆశలు వదులుకున్నామని, వాటి కోసం రాజకీ యం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.