కేంద్రంలో చక్రం తిప్పేది టీఆర్‌ఎస్సే  | TRS Party Play Key Role In Central | Sakshi
Sakshi News home page

కేంద్రంలో చక్రం తిప్పేది టీఆర్‌ఎస్సే 

Published Mon, Mar 25 2019 5:41 PM | Last Updated on Mon, Mar 25 2019 5:52 PM

TRS Party Play Key Role In Central - Sakshi

తాండూరు: భవిష్యత్తులో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పేది  టీఆర్‌ఎస్‌ పార్టీనేనని పార్టీ చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు నియోజవకర్గంలోని నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహంచారు. సమావేశానికి ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కల్పన చైర్మన్‌ పర్యాద కృష్ణమూర్తి, చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల పరిశీలకుడు గట్టు రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ జెండాను మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి బలపర్చడంతోనే తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మహేందర్‌రెడ్డి తన చిన్ననాటి మిత్రుడని గుర్తు చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు.

ఎంపీ అయిన వెంటనే తాండూరు ప్రాంతంలోని రైతుల కోసం కంది బోర్డు, మెడికల్‌ కళాశాలను తీసుకొస్తానన్నారు. తనకు ఉమ్మడి జిల్లా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వ్యాపారాలను పక్కన పెట్టి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. కుటుంబపరంగా గతేడాది కూతురి పెళ్లి చేశానని, ఉన్నత చదువుల కోసం 5 ఏళ్ల పాటు కుమారుడు విదేశాలకు వెళ్లారన్నారు. ఇక తనకు ఎలాంటి వ్యాపకాలు లేవని, ప్రజలకు సేవచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. మొదట గ్రామ స్థాయి నాయకుల నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. ఇక సీఎం సారు.. కారు.. 16 పార్లమెంట్‌ స్థానాలే లక్ష్యంగా పని చేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. సీఎం పనితీరుతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. దీంతో రాష్ట్రంలోని 90 శాతం ప్రజలు కేసీఆర్‌ వైపు నిలబడ్డారన్నారు. కేంద్రంలో రానున్న రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తోందన్నారు.

 కొండాకు గుణపాఠం చెప్పండి 
మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతిపక్షాలు కుదేలయ్యాయని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలోకి మారిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రాజకీయ అనుభవం లేదన్నారు. ఆయనకు పార్లమెంట్‌ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని నాయకులకు పిలుపునిచ్చారు. రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నరేష్‌ మహరాజ్, విశ్వనాథ్‌గౌడ్, రాకేష్, కరణం పురుషోత్తంరావు, సీసీఐ రాములు, సాయన్నగౌడ్, కోహీర్‌ శ్రీనివాస్, రాంలింగారెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, రమేష్‌కుమార్, జుబెర్‌లాల, రవిగౌడ్, రవూఫ్, అజయ్‌ప్రసాద్, ముస్తఫా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement