అధికార పార్టీ హోదాలో తొలిసారి నిర్వహించనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర
అడహక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్: అధికార పార్టీ హోదాలో తొలిసారి నిర్వహించనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 24న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ప్లీనరీకి 36 వేల మంది ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లా నుంచి లక్ష చొప్పున మొత్తం 10 లక్షల మందిని 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు తరలిస్తామని చెప్పారు. ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రతినిధులతో క్షేత్ర స్థాయిలో చర్చిస్తారని వివరించారు. ప్లీనరీని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యవేక్షిస్తారని తెలిపారు. కాగా, ప్లీనరీ, బహిరంగ సభల విజయవంతానికి 7 కమిటీలను ఏర్పాటు చేశారు. ఎంపీ కె.కేశవరావు చైర్మన్‌గా మరో 9 మందితో తీర్మానాల కమిటీని ఏర్పాటు చేశారు.
మంత్రి కె . తారకరామారావు చైర్మన్‌గా మరో 16 మందితో నగర అలంకరణ కమిటీ , ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చైర్మన్‌గా మరో 11 మందితో ఫుడ్ కమిటీ ఏర్పాటు చేశారు. సభా వేదిక, ప్రాంగణం ఏర్పాట్లకు 14 మంది సభ్యులున్న కమిటీకి మంత్రి పద్మారావు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పార్కింగ్ ఏర్పాట్ల కమిటీకి హోం మంత్రి చైర్మన్‌గా మరో 8 మంది సభ్యులుంటారు. మహిళా ప్రతినిధుల కమిటీకి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చైర్‌పర్సన్‌గా, 6మందిని మీడియా ఏర్పాట్ల కమిటీని ఎంపీ బాల్క సుమన్ చైర్మన్‌గా మరో ఐదుగురిని సభ్యులుగా నియమించారు.ప్లీనరీకి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులను ఆహ్వానించనున్నట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.