సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండేది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011 తర్వాత నియోజకవర్గ ఓటర్లు టీఆర్‌ఎస్‌కు జైకొట్టారు. అప్పటి నుంచి టీడీపీ కంచుకోటలో టీఆర్‌ఎస్ పాగా వేసింది. అయితే, సైకిల్ జోరుకు తొలిసారిగా బ్రేకులు వేసింది మాత్రం ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీయే. 1952 నుంచి ఇప్పటివరకు నియోజకవర్గంలో 14 సార్లు సాధారణ ఎన్నికలు, ఒకసారి (2012) ఉప ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, రెండు సార్లు టీఆర్‌ఎస్ విజయం సాధించగా ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు. రాజకీయ చైతన్యం తక్కువగా ఉన్న కాలం నుంచి సామాజిక, ప్రజా సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉన్న నాయకులకే నియోజకవర్గం ఓటర్లు పట్టం కట్టారు. 1952లో కామారెడ్డి నియోజకవర్గం ఏర్పడింది.
ఇప్పటికీ నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డిలో రాజకీయ వేడి ఇప్పటికే జోరందుకుంది. అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై పోయారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇది వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, భవిష్యత్‌లో కల్పించే సౌకర్యాలను వివరిస్తూ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ ప్రజల్లోకి వెళ్తున్నారు. మంత్రిగా తాను చేపట్టిన అభివృద్ధి, టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ శాసన మండలివ ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సైతం గెలుపుపై ధీమాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఏడుసార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ..
1952లో మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీడిపల్లి విఠల్ రెడ్డి గెలుపొందారు. 1967 ఎన్నికల్లో స్వ తంత్య్ర అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి గెలుపు మినహా 1978 వరకు ఐదు పర్యాయాలు కాంగ్రెస్ హవా నడిచింది. దివంగత ము ఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్టీ పెట్టాక కామారెడ్డి టీడీపీకి కంచుకోటగా మారిపోయింది. 1983లో సంజయ్ విచారహ మంచ్ తో టీడీపీ పొత్తులో భాగంగా టికెట్ గెలిచారు. 1985లో కృష్ణమూర్తి, 1994, 1999, 2009లలో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే, 1989లో టీడీపీ జోరుకు బ్రేకులు వేసింది మాత్రం షబ్బీర్‌అలీయే. 1994 నుంచి ప్రధానంగా గంప, షబ్బీర్‌అలీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంటోంది. ఇప్పటికే వారి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. 2004లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పొత్తులో భాగంగా కామా రెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్‌కు కేటాయించారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకోగా, కామారెడ్డి నుంచి బీజే పీ అభ్యర్థి మురళిధర్‌గౌడ్ పోటీ చేశారు. షబ్బీర్‌అలీ భారీ మెజారిటీతో గెలిచి వైఎస్‌ఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్ పొత్తు లో భాగంగా కామారెడ్డి టికెట్ టీడీపీకి ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న షబ్బీర్‌అలీపై గంప గోవర్ధన్ విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడంతో 2011లో గంప ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్ల రాజిరెడ్డిపై టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన గంప గోవర్ధన్ గెలవడంతో కామారెడ్డి స్థానం టీఆర్‌ఎస్ ఖాతాలోకి చేరింది. 2014 సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగింది.
ప్రభావం చూపే అంశాలు..
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు ఎంతగానో ప్రభావం చూపించాయి. నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రూ.140 కోట్లతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డికి పైప్‌లైన్ ద్వారా తాగునీటిని అందించేందుకు గాను 2008లో గోదావరి జలాల తాగునీటి పథకాన్ని మంజూరు చేశారు. దీంతో నీటి సమస్య కొంత వరకు పరిష్కారమైంది. నియోజకవర్గంలో సాగునీటి వసతులు లేవు. చెరువులు, బోర్లపైనే ఆధారం.
2008లో నియోజకవర్గానికి సాగునీటిని అందించి సస్యశామలం చేసే ఉద్దేశంతో ప్రాణహిత–చేవెళ్ల 22 ప్యాకేజీ పనులకు వైఎస్ శంకుస్థాపన చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ పనులను రీడిజైన్ పేరుతో నిలిపివేశారు. దీంతో రైతుకుల సాగునీటి కష్టాలు తీరలేదు. భూసేకరణ పనులు పూర్తి చేసి 22 ప్యాకేజీ పనులు చేపట్టాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా చెరుకు పండిస్తారు. ఇది వరకు ఎంతోమంది రైతులు నల్లబెల్లం తయారు చేశారు. ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో చెరుకు రైతులు ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల కామారెడ్డిలో జరిగిన రాహుల్‌గాంధీ సభలో షబ్బీర్‌అలీ మాట్లాడుతు ఈ అంశాన్ని లేవనెత్తారు. తాము అధికారంలోకి వస్తే నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.
విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్న కామారెడ్డి ఎడ్యూకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే డిమాండ్ ఉంది. టెక్నికల్, మెడికల్ కళాశాలలు నెలకొల్పాలని ఎంతోకాలంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక వేల సంఖ్యలో యువత, నిరుద్యోగులు గల్ఫ్‌బాట పడుతున్నారు. వ్యవసాయ ఆధారిత, ఇతర పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలనే డిమాండ్ ఉంది. సౌత్‌క్యాంపస్, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గ్రౌండ్ వివాదాలు, దోమకొండలో డిగ్రీ కళాశాల ఏర్పాటు డిమాండ్, జిల్లా కేంద్రంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రైల్వేఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం లాంటి అంశాలు సైతం రానున్న ఎన్నికల్లో ప్రభావితం చూపించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment