సాక్షి, ములకలపల్లి(ఖమ్మం): టీఆర్‌ఎస్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉంది ప్రస్తుతం మండల రాజకీయ పరిస్థితి. ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన ఎంపీపీ పీఠం కోసం ఇరుపార్టీలు ‘నువ్వా నేనా’అన్నట్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఎంపీపీ సీటు అధిరోహించి అధికార పార్టీకి ఝలక్ ఇవ్వాలని టీడీపీ ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా ఎంపీపీ దక్కించుకోవాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిసోంది. పది స్థానాల్లో కేవలం రెండు ఎంపీటీసీలను గెలుపొందిన అధికార టీఆర్‌ఎస్, రెండు పర్యాయాలు ఎంపీపీ ఎన్నిక నిర్వహించినా, టీడీపీకి పీఠం దక్కకుండా చేయడంలో సఫలీకృతమయింది. ప్రజాకూటమి పేరిట టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం సామూహికంగా పోటీ చేయగా, టీడీపీ మూడు స్థానాల్లో, సీపీఎం ఒక్క స్థానంతో కూటమి మొత్తం నాలుగు ఎంపీటీసీ స్థానాలను గెలుపొందింది.
అధికార టీఆర్‌ఎస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచినా, సీపీఐతోపాటు మరో స్వతంత్య్ర అభ్యర్థి మద్దతు సాధించి, తాను నాలుగు ఎంపీటీసీ సభ్యులను కలిగిఉంది. ఈ క్రమంలో 7వ తేదీన జరిగిన ఎంపీపీ ఎన్నిక కార్యక్రమానికి టీఆర్‌ఎస్ కూటమి హాజరుకాగా, టీడీపీ కూటమి గైర్హాజరవడంతో కోరంలేక వాయిదా పడింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మళ్లీ 15వ తేదీన ఎంపిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సారి టీడీపీ కూటమి హాజరుకాగా, టీఆర్‌ఎస్ కూటమి గైర్హాజరవడంతో రెండో ‘సారీ’ఎంపిక వాయిదా పడింది. రెండో దఫా (15వ తేదీ) కార్యక్రమానికి టీడీపీకి పూర్తి ఆధిపత్యం సాధించినట్లు వార్తలు వినిపించాయి. టీఆర్‌ఎస్ కూటమి నుంచి ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకున్నారని, ఇక ఎంపీపీ ఎన్నిక టీడీపీకి లాంఛనమే అనే వ్యాఖ్యలు వినిపించాయి.
ఐతే అనూహ్యంగా టీఆర్‌ఎస్ కూటమిలోని నలుగురు ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి హాజరుకాకపోవడం ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా కేవలం 188 ఓట్ల తేడాతో జెడ్పీటీసీ సభ్యురాలిని కోల్పోయిన టీఆర్‌ఎస్, ఎంపీపీ పదవిపై నజర్ వేసింది. ఇందుకుగాను అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రజాకూటమిలో నాలుగు సీట్లు పొందిన టీడీపీ మండలంలో తమ ఆధిక్యత ప్రదర్శించేందుకు విరామంలేకుండా శ్రమిస్తోంది. ఏదిఏమైనా మం డల పరిషత్ అధ్యక్షురాలి పదవికోసం ఇరుపార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు పోరాడుతున్నాయనడంలో సందేహమేలేదు.
కోరం నిండాలంటే ...
మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కోరం నిండాలంటే కనీసం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ ఎన్నిక సమావేశానికి హాజరుకావాలి, టీడీపీ కూటమికి నాలుగు, టీఆర్‌ఎస్‌కు నాలుగు (సీపీఐ, స్వతంత్య్ర అభ్యర్థి మద్దతుతో) స్థానాలు విజయం సాధించాయి. రెండు చోట్ల గెలిచిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పార్టీ ఆదేశానుసా రం ఎన్నిక సమావేశానికి గైర్హాజరవుతూనే ఉంది. ఈ క్రమంలో ఎదుటి కూటమి నుంచి కనీసం ఒక్క ఎంపీటీసీనైనా సాధించగల్గితే, కోరంపూర్తయ్యే పూర్తవుతుంది. లేనిపరిస్థితుల్లో ఇరుపక్షా లు ఎంపిక సమావేశానికి హాజరైతే ‘టాస్’వేసి, ఎంపీపీని ఎంపిక చేస్తారు. సమావేశానికి ఐదుగురు కంటే తక్కువ మంది ఎంపీటీసీ సభ్యులు హాజరైతే, కోరంలేక వాయిదా వేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment