జెడ్పీలన్నీ గులాబీవే | TRS Won All ZP chairperson Seats In Telangana | Sakshi
Sakshi News home page

జెడ్పీలన్నీ గులాబీవే

Published Sun, Jun 9 2019 1:42 AM | Last Updated on Sun, Jun 9 2019 1:42 AM

TRS Won All ZP chairperson Seats In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఎంపీపీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన అధికార టీఆర్‌ఎస్‌ జెడ్పీ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం 32 జిల్లాల్లో జెడ్పీపీ పదవులకు జరిగిన ఎన్నికల్లో 32 జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్, కో ఆప్షన్‌ పదవులన్నింటినీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. విపక్షాల నుంచి ఎక్కడా కనీస పోటీ కూడా ఎదురు కాలేదు. సింగిల్‌ సెట్‌ నామినేషన్లతోనే చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు బరిలో నిలిచి గెలిచారు. 20 జెడ్పీ పీఠాలను మహిళలు గెలుచుకున్నారు. తొలుత ఒక్కో జెడ్పీలో ఇద్దరు కో ఆప్టెడ్‌ సభ్యుల చొప్పున ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించారు. జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించిన ఈ ఎన్నికల్లో కో ఆప్టెడ్‌ మెంబర్స్‌ ఎన్నికకు అధిక శాతం జిల్లాల్లో ఒక్కో నామినేషనే రావడంతో ఆ స్థానాల్లో వారు ఎన్నికైనట్లు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో మినహా జెడ్పీ ఎన్నికల సందర్భంగా విపక్ష పార్టీల సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు.

32 జిల్లాల్లోని జెడ్పీ పదవులను గెలుచుకునే సంఖ్యాబలం అధికార టీఆర్‌ఎస్‌కు ఉండటంతో పోటీ అనేదే లేకుండా పోయింది. అంతేకాకుండా అన్ని జిల్లా పరిషత్‌లలో టీఆర్‌ఎస్‌ సభ్యులతో కూడిన కోరంతోనే సమావేశం నిర్వహించడంతో విపక్ష„ పార్టీల సభ్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు ముగిశాయి. జెడ్పీ పదవులు గెలుచుకునే సంఖ్యాబలం ఉండటంతో జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్, కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికల్లో వివిధ వర్గాలకు ప్రాధాన్యం కల్పించే చర్యలను టీఆర్‌ఎస్‌ అధిష్టానం చేపట్టింది. ప్రత్యేక సమావేశానికి ముందే జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవులకు పోటీ పడుతున్న వారి పేర్లను ఆయా జిల్లాల పార్టీ ఇన్‌చార్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఏకగ్రీవ తీర్మానాలతో చైర్‌పర్సన్లను ఎన్నుకున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నిక ముగియడంతో పరిషత్‌ పోరు పూర్తయింది. అయితే ఎంపీపీ, జెడ్పీ పదవులకు ఎన్నికైన వారితోపాటు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులంతా పాత పాలకమండళ్ల పదవీకాలం ముగిశాక జూలై మొదటి వారంలో పదవీ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. 

పట్నం సునీతారెడ్డి హ్యాట్రిక్‌... 
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని రెండుసార్లు చేపట్టిన పట్నం సునీతారెడ్డి (మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి) ఈసారి వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. మహబూబాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అంగోతు బిందు ఈ పదవిని చేపడతున్న పిన్న వయస్కురాలిగా నిలుస్తున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన బిందు 23 ఏళ్ల వయసులోనే జిల్లా స్థాయిలో కీలక పదవిని చేపట్టనున్నారు. బయ్యారం జెడ్పీటీసీ స్థానానికి పోటీ ద్వారా తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ సోదరి కుమార్తె. 

నేతల కుటుంబ సభ్యుల గెలుపు... 
జెడ్పీ చైర్‌పర్సన్లుగా మాజీ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి (కుమ్రం భీం ఆసిఫాబాద్‌), పుట్టా మధుకర్‌ (పెద్దపల్లి), కోరం కనకయ్య (భద్రాద్రి కొత్తగూడెం), స్వర్ణ సుధాకర్‌ (మహబూబ్‌నగర్‌) ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డా. అనితారెడ్డి, మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భార్య నల్లాల భాగ్యలక్ష్మి, యాదాద్రి జెడ్పీ చైర్‌పర్సన్‌గా దివంగత నేత, మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవ్‌రెడ్డి తనయుడు ఎ. సందీప్‌రెడ్డి, మేడ్చల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కుమారుడు శరత్‌చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. నిజామాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా దాదన్నగారి విఠల్‌రావుకు అవకాశం లభించింది. నల్లగొండ జెడ్పీ చైర్‌పర్సన్‌గా అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పని చేసిన బండా నరేందర్‌రెడ్డి, వరంగల్‌ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన గండ్ర జ్యోతికి (ఎమ్మెల్యే గ్రండ వెంకట రమణారెడ్డి సతీమణి) వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వనపర్తి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న లోక్‌నాథ్‌రెడ్డికి ఈసారి వనపర్తి జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం లభించింది. గతంలో వివిధ జెడ్పీల్లో వైస్‌ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహించిన వారికి చైర్‌పర్సన్‌ పదవులు లభించాయి. కరీంనగర్‌ జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న డా. సుధీర్‌ కుమార్‌ ఇప్పుడు వరంగల్‌ అర్బన్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ అయ్యారు. కరీంనగర్‌ జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న రాయిరెడ్డి రాజిరెడ్డి తాజా ఎన్నికల్లో హుస్నాబాద్‌ జెడ్పీటీసీగా గెలుపొంది సిద్దిపేట జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. 

ఎన్నికలు జరగని ఎంపీపీలకు విడిగా నోటిఫికేషన్‌... 
మండల ప్రజాపరిషత్‌ (ఎంపీపీ) ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన 22 అధ్యక్ష, 26 ఉపాధ్యక్ష పదవులతోపాటు 18 కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికకు తేదీని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడిగా నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. మిగతా స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. శుక్ర, శనివారాల్లో కలిపి మొత్తం 513 మంది ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకున్నారు. మొత్తంగా టీఆర్‌ఎస్‌కు 429 ఎంపీపీలు, కాంగ్రెస్‌కు 62, బీజేపీకి 6, ఇండిపెండెంట్లకు 12, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌కు 2, సీపీఎం, టీడీపీలకు చెరో ఎంపీపీ అధ్యక్ష పదవులు లభించినట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. 



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement