
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను జేఎన్‌టీయూ శనివారం విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన టీఎస్ ఎంసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల కానుంది. 6వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 6 నుండి 9వ తేదీ వరకు దరఖాస్తులలో సవరణ చేసుకోవచ్చు. రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదువేల రూపాయలతో ఏప్రిల్ 24వ తేదీ వరకు, పదివేల రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజనీరింగ్ పరీక్ష మే 3 నుంచి మే 6 వరకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1వరకు పరీక్ష ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ ఫార్మసీ మే 8వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్ ద్వారా మధ్యాహ్నం 3గంటల నుంచి 6 గంటల పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర‍్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. నిమిషం ఆలస్యం అయిన పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.