ఎడ్‌సెట్‌లో 99 శాతం అర్హులు
ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. పాపిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో 99.04 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 25 వేల సీట్ల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించినట్లు చెప్పారు. ఈనెల 6న జరిగిన ఈ పరీక్షకు 64,297 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 57,775 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 57,220 మంది (99.04 శాతం) అర్హత సాధించారు. వీటికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూలును త్వరలోనే జారీ చేస్తామని పాపిరెడ్డి వివరించారు. 150 మార్కులకు నిర్వహించిన పరీక్షలో అర్హత నిర్ధారణకు 25 శాతం మార్కులను పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఎడ్‌సెట్‌కు హాజరవుతున్న వారిలో ఎక్కువ శాతం బలహీన వర్గాల వారే ఉంటున్నందున ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులేమీ పెట్టలేదన్నారు. అలాగే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో మహిళలు పరీక్ష రాస్తే వారి మార్కులను బట్టి ర్యాంకు ఇచ్చామన్నారు. ఈ సబ్జెక్టుల్లో మహిళలకు కనీస అర్హత మార్కులను పెట్టలేదన్నారు.
మెడికల్ కౌన్సెలింగ్‌కు 4 కేంద్రాలు
ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూలును త్వరలోనే జారీ చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. కాలేజీల్లోని సీట్ల సంఖ్యపై ఈనెల 28న స్పష్టత వస్తుందన్నారు. మెడికల్ కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌లో రెండు, వరంగల్, విజయవాడలలో ఒక్కో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుందని వివరించారు.