మద్యంతో ముంచేద్దాం..!
⇒ ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం పెంపుపై సర్కారు దృష్టి
⇒ మద్యం ధరలు, దుకాణాల సంఖ్య పెంచే యోచన
⇒ విదేశీ మద్యంపై భారీగా పన్నుల బాదుడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది మద్యం పొంగి పొర్లనుంది. మద్యం ద్వారా ఏకంగా రూ.20 వేల కోట్లు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడున్న మద్యం దుకాణాల సంఖ్యను పెంచటంతో పాటు మద్యం రేట్లు, లైసెన్సు ఫీజులు, మద్యం అమ్మకాలపై పన్నుల మోత మోగించేందుకు నడుం బిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలతో రాష్ట్ర ఖజానాకు రూ.13 వేల కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త బడ్జెట్‌లో ఈ అంచనాలను అమాంతం 50 శాతానికి పైగా పెం చింది. అదనంగా రూ.7 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని నిర్ణయించడం గమనార్హం.
భారీగా పెరగనున్న దుకాణాలు..
రాష్ట్రంలో ప్రస్తుతం 2,144 మద్యం దుకాణాలు న్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో వీటి లైసెన్స్ గడువు ముగియనుంది. ఆశించిన ఆదాయం రాబట్టా లంటే లైసెన్సు ఫీజులను పెంచడంతోపాటు ఇప్పు డున్న దుకాణాల సంఖ్యనూ పెంచాలని సర్కారు యోచిస్తోంది. విదేశీ మద్యం ద్వారా వీలైనంత ఎక్కు వ ఆదాయం సంపాదించాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ మద్యం ద్వారా రూ.4,447 కోట్ల ఆదాయం సమకూరనుంది. విదేశీ మద్యం విక్రయాలను విస్తరించటంతో పాటు అదనపు ఫీజుల ను పెంచాలని సర్కారు నిర్ణయించింది. అందుకే విదేశీ మద్యం ద్వారా రూ.8,201 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకుంది.
ఎక్సైజ్ ఆదాయమే పెద్ద దిక్కు
అమ్మకపు పన్ను తర్వాత ఖజానాకు ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయమే పెద్ద దిక్కు. ఎక్సైజ్ డ్యూటీ, లీజు, లైసెన్సు ఫీజు, ఎక్సైజ్ వ్యాట్, ప్రివిలేజ్ ఫీజు ఇవన్నీ ఈ పద్దులో ఉంటాయి. మద్యం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్ డ్యూటీని ఈసారి గణనీయంగా పెంచే అవ కాశం ఉంది. తద్వారా మద్యం ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం మద్యం అమ్మకాలపై 70 నుంచి 180 శాతం వరకు వ్యాట్ విధిస్తుండగా, ప్రీమియం, ఫారిన్ లిక్కర్‌పై వ్యాట్‌ను మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీటితో పాటు లైసెన్సు ఫీజులు ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన సంవత్సరానికి రూ.40 లక్షల నుంచి రూ.1.08 లక్షల వరకు వివిధ స్లాబుల్లో ఉన్నాయి. వీటిని సవరించాలని నిర్ణయిం చింది. ప్రస్తుతం 13 వేల జనాభాకి ఓ మద్యం దుకా ణం ఉండగా, వీటిని విస్తరించే అవకాశాలున్నాయి. బార్ల లైసెన్సులను నగర పంచాయతీల నుంచి మం డల స్థాయి వరకు విస్తరించాలని యోచిస్తోంది.
సుప్రీం ఆదేశాలతో వ్యాపారుల బెంబేలు..
జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 తర్వాత రహదారులకు ఆనుకుని మద్యం అమ్మకాలు ఉండరాదని స్పష్టం చేసింది. దీంతో మద్యం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రహదారులకు దూరంగా వెళితే వ్యాపారాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం సైతం తగ్గిపోతుంది.