విశాఖ రూరల్/నర్సీపట్నం రూరల్: కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయింది. గ్రామాల్లో అభివృద్ధి మాత్రం కానరావడం లేదు. పంచాయతీకి నిధులు అరకొరగా రావడం.. పన్నుల వసూళ్లు సక్రమంగా జరగకపోవడం.. ఆదాయ వనరులు లేకపోవడం.. కారణంగా గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. పంచాయతీల్లో చిల్లిగవ్వ లేక సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మారారు. మౌలిక సదుపాయల కల్పన పనులు ఏ విధంగా చేపట్టాలో తెలియక దిక్కులు చూస్తున్నారు.
రెండేళ్ల పాటు ప్రత్యేక పాలనలో మగ్గిన పంచాయతీల్లో గతేడాది ఆగస్టు 2న కొత్త సర్పంచ్‌లు కొలువుతీరారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పన్నుల ద్వారా వచ్చే ఆర్థిక వనరులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సర్పంచ్‌లు భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకపోవడం.. ఏకగ్రీవ పంచాయతీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులు ఇవ్వకపోవడం.. పన్నులు వసూళ్లు మందగించడంతో గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది.
పంచాయతీల్లో నిధుల లేమి!
గ్రామాల్లో అభివృద్ధి పనులకు అరకొరగా నిధులు మంజూరవుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.1.34 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. తలసరి గ్రాంటుగా రూ.15.34 లక్షలు, వృత్తిపన్ను కింద రూ.55.64 లక్షలు, 13వ ఆర్థిక సంఘ నిధులు రూ. 4.32కోట్లు గతంలో మంజూరయ్యాయి. వీటితో పాటు రూ. 1.69లక్షలు సర్పంచ్‌ల జీత భత్యాలు కింద వచ్చాయి. దీర్ఘకాలంలో అభివృద్ధిదూరంగా ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఏమూలకూ సరిపోవడం లేదు.
పన్నుల వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. 2013-14 సంవత్సరానికి సంబంధించి రూ.25.47 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రమే వసూలు కావడం గమనార్హం. దీంతో పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఏజెన్సీలోని పంచాయతీల పరిస్థితి మరిరీ దయనీయం. ఒకటి, రెండు శాతం పన్నులు వ సూలుకావడమే గగనమవుతోంది.
పేరుకు పోతున్న పన్ను బకాయిలు
జిల్లాలో 925 పంచాయతీలకు 410 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కొక్కరికీ రెండు, మూడు పంచాయతీలను అప్పగించారు. ఫలితంగా వన్నుల వసూళ్లు మందగించాయి. వసూలు కావాల్సిన వాటి కంటే పాత బకాయిలు అధికంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా పన్నుల బకాయిలు రూ.14.24 కోట్లు ఉండగా, 2013-14కు సంబంధించి రూ.11.23 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. దీని ప్రకారం ప్రతీ ఏటా కనీసం 30 శాతం కూడా పన్నుల రాకపోవడంతో ఎరియర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఎరియర్స్ రూ.14.24 కోట్లకు గాను గతేడాది డిసెంబర్ వరకు రూ.5.06 కోట్లు వసూలైంది. ఇంకా రూ.9.17 కోట్లు రావాల్సి ఉంది. ఈఏడాదితో కలిపి మొత్తం రూ.17.17 కోట్లు బకాయిలు ఉన్నాయి.
పాలకవర్గాలకు అన్నీ సవాళ్లే
సర్పంచ్‌లుగా కొలువు తీరిన నాటి నుంచి వారిని వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంతో సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది. ఖజానా కూడా మూతపడడంతో నిధులు ఖర్చుచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత వరుసగా ఎన్నికలు వచ్చిపడ్డాయి. దీంతో ఎన్నికల కోడ్ ఒకవైపు, నిధుల ఫ్రీజింగ్ మరోవైపు ఉండడంతో ఉన్న కాస్త నిధులు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలనే లక్ష్యంతో పగ్గాలు చేపట్టిన కొత్త పాలకవర్గాలకు నిరాశే మిగిలింది.
పడకేసిన పాలన
Published Mon, Aug 11 2014 2:16 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement