సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్ నేపథ్యంలో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపశమన ప్యాకేజీ ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్‌ఎంఈ)ని ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తోంది. పరిశ్రమలకు ఏ తరహా ఉపశమనం ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తర్వాత ఉపశమన ప్యాకేజీ ఉత్తర్వులు వెలువడే అవకాశముందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
(మే, జూన్‌లోనే 84 శాతం మరణాలు )
ఫిక్స్‌డ్ విద్యుత్ చార్జీలు రద్దు..
లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి మే వరకు 3 నెలల పాటు విద్యుత్ బిల్లుల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో మారిటోరియం విధించింది. అయితే లాక్‌డౌన్ మూలంగా సుమారు రెండున్నర నెలల పాటు ఉత్పత్తి నిలిచిపోవడంతో ఫిక్స్‌డ్ విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఫిక్స్‌డ్ విద్యుత్ చార్జీల ద్వారా ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.130 కోట్ల మేర ఉపశమనం కలిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ తాజా ప్రతిపాదనల్లో అం చనా వేసింది. అయితే అన్ని రకాల పరిశ్రమలకు సంబంధించిన íఫిక్స్‌డ్ చార్జీల వివరాలివ్వాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. (24 గంటల్లో 279 మంది మృతి)
విడతల వారీగా సబ్సిడీలు..
పారిశ్రామిక రంగానికి వివిధ సబ్సిడీలు, ప్రోత్సాహకాలకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్ల మేర బకాయిలను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేయాల్సి ఉంది. ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.1,284 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ.600 కోట్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.600 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో బకాయిల్లో కనీసం నాలుగో వంతును విడుదల చేయడంతోపాటు, మిగిలిన మొ త్తాన్ని దశల వారీగా విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. తద్వారా సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలకు కొంత ఉపశమనం కలగనుంది. (కడుపులో కాటన్ కుక్కి ఆపరేషన్)
ఏడాది పాటు ఆస్తి పన్ను రద్దు...
ఉపశమన ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలకు ఏడాది పాటు ఆస్తి పన్ను రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో దేశ వ్యాప్తంగా కనీసం రూ.2 లక్షల కోట్లు కూడా బ్యాంకర్ల నుంచి రుణాలు అందే పరిస్థితి లేదని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఉపశమన ప్యాకేజీ ద్వారా కొంతైనా మేలు కలుగుతుందని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) అధ్యక్షుడు కొండవీటి సుధీర్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. ఉపశమన ప్యాకేజీకి సంబంధించి వివిధ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, వీలైనంత త్వరగా వివరాలు వెల్లడిస్తామని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment