
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో 2018–19 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షకు మొత్తం 62,400 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొఫెసర్ ఎం. సుబ్రమణ్యశర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన పరీక్ష వివరాలను వెల్లడించారు. గతేడాది 73 వేల వరకు దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది 62,400 వచ్చాయని, గతేడాదితో పోలిస్తే 11వేలకు పైగా తగ్గిపోయాయని చెప్పారు. తెలంగాణలో 58 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో ఒకటి విశాఖపట్నం, మరొకటి విజయవాడలో ఉన్నాయని తెలిపారు. తొలిసారిగా ఐసెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
ఈ నెల 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుంద న్నారు. 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒక షిఫ్ట్‌లో పరీక్షను నిర్వహించనున్నట్లు చెప్పారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని, అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతోపాటు ఫొటోపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకుని తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అలాగే ఐడీ ప్రూఫ్ కార్డు కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. కరీంనగర్‌ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థుల్లో కొందరికి అక్కడే సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ మరో 700 మందికి వేరే జిల్లాల్లో కేటాయించామన్నారు. జూన్ 7న ఐసెట్ ఫలితాలను విడుదల చేస్తామని కన్వీనర్ సుబ్రమణ్యశర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment