సాక్షి, సిటీబ్యూరో: దసరా ధమాకాకు ఆర్టీసీ సిద్ధమైంది. నగరవాసులను సొంతూళ్లకు చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించింది. పండగ రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాలు సహా బెంగళూర్, ముంబై, చెన్నై, షిరిడీ తదితర ప్రాంతాలకు 4,933 ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ బస్సులను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంజీబీఎస్, సీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్లతో పాటు లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్‌రోడ్ ఎల్‌బీనగర్ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంచనుంది. అదే విధంగా నగర శివారు కాలనీల్లో నివసించే ప్రయాణికుల కోసం బస్సులను నేరుగా ఆయా కాలనీల నుంచే నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. పండగ సెలవులు, రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 27 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండేందుకు అవకాశమున్న అక్టోబర్ 4 నుంచి 7 మధ్య మరో 3,236 బస్సులను అదనంగా నడపనున్నట్లు చెప్పారు. తెలంగాణలోని జిల్లాలు సహా ఏపీలోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూ రు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూ రు, పామూరు, పొదిలి తదితర ప్రాంతా లకు రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిదని సూచించారు.
సమ్మె సైరన్...
మరోవైపు కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రెండు జేఏసీలు ఏర్పాటయ్యాయి. వేలాది మంది కార్మికుల భద్రత, ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె చేపడతా మని ఇప్పటికే జేఏసీలు ప్రకటించాయి. ఈ నెల 27 తర్వాత సమ్మె దిశగా తమ కార్యాచర ణ చేపట్టనున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యం లో దసరా బస్సుల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ సమ్మె అనివార్యమైతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు నడిచే రెగ్యులర్ రైళ్లన్నీ ఇప్పటికే రిగ్రేట్ దశకు చేరుకున్నాయి. ప్రత్యేక రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది. ఆర్టీసీ బస్సులు మినహా మరో అవకాశం లేదు. కార్మిక సంఘాలు తమ సమ్మె ప్రతిపాదనను వాయిదా వేసుకోవడమో లేదా విరమించుకోవడమో చేస్తే తప్ప బస్సులు కదిలేందుకు అవకాశం లేదు.
ఎంజీబీఎస్‌లో బస్సులు ఇలా...
ప్లాట్‌ఫామ్ రూట్
1–5 గరుడ ప్లస్, గరుడ, అంతర్రాష్ట్ర బస్సులు
6–7 బెంగళూర్ వైపు
10– 13 ఖమ్మం
14–15 దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌కుప్రతి 15 నిమిషాలకు ఒక సిటీ బస్సు
18– 19 ఉప్పల్ క్రాస్‌రోడ్డుకు ప్రతి15 నిమిషాలకు ఒక సిటీ బస్సు
23–25 శ్రీశైలం, కల్వకుర్తి వైపు వెళ్లేవి
26– 31 రాయచూర్,మాహబూబనగర్ వైపు వెళ్లేవి
32– 34 నాగర్‌కర్నూల్, షాద్‌నగర్ వైపు
35– 36 విజయవాడ, విజయనగరం,విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి,వెస్ట్ గోదావరి, గుంటూరు
41– 42 పెబ్బేర్, కొత్తకోట, గద్వాల్ వైపు
46– 47 మెదక్, బాన్సువాడ, బోధన్ వైపు
48– 52 జహీరాబాద్, బీదర్, సంగారెడ్డి,నారాయణ్‌ఖేడ్ వైపు
53– 55 జేబీఎస్‌కు ప్రతి 15 నిమిషాలకుఒక సిటీ బస్సు
56– 58 నాగపూర్, అమరావతి, నాందేడ్,అకోలా బస్సులు (మహారాష్ట్ర)
62 దేవరకొండ వైపు వెళ్లేవి
63– 65 పరిగి, తాండూరు, వికారాబాద్ వైపు
ఏ బస్సులు ఎక్కడి నుంచి...
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే మార్గంలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశమున్న దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రెగ్యులర్ బస్సులు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులను మాత్రమే ఎంజీబీఎస్ నుంచి నడుపుతారు. అక్టోబర్ 4–7 వరకు నడిచే ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాల నుంచి నడుపుతారు.
జేబీఎస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపు వెళ్లే అన్ని బస్సులు.
ఉప్పల్ క్రాస్‌రోడ్: యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, వరంగల్ వైపు వెళ్లేవి.
దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్: మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లేవి.
ఎంజీబీఎస్: కర్నూలు, తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం,మదనపల్లి వైపు వెళ్లేవి.
ప్రయాణికుల అంచనా..
♦ తెలంగాణ జిల్లాలకు వేళ్లే ప్రయాణికులు: 15లక్షల మందికి పైగా
♦ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారు: 6లక్షల మందికి పైగా
బస్సుల సమాచారం కోసం సంప్రదించండి
ఎంజీబీఎస్ :83309 33419, 83309 33537
జేబీఎస్: 040 278022203
Comments
Please login to add a commentAdd a comment