లోపలికి దూరేయ్ కన్నా... జేబీఎస్‌లో .. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో...
ఇదీ విరుగుడు: సమ్మె నేపథ్యంలో ఆర్టీఏ, ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు మంజూరు చేస్తుండగా.. డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తున్నాయి. మరోవైపు మెట్రో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మెట్రో రైళ్లు శనివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 3–5 నిమిషాలకు ఒక రైలు ఉంటుందన్నారు. అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
డబుల్ బాదుడు :సమ్మెపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంతో ప్రైవేట్ ఆపరేటర్లు దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే చార్జీలను రెండింతలు చేశారు. హైదరాబాద్ – విజయవాడకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సు చార్జీ రూ.450 వరకుంటే.. ఇప్పుడది రూ.900. అలాగే వైజాగ్‌కు చార్జీని రూ.860 నుంచి రూ.1,500 వరకు పెంచారు. అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సు ఆగింది.. సమ్మెతో స్తంభించింది.. డిపోలకే పరిమితమైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నగరం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని దూరప్రాంతాలకు వెళ్లే కొన్ని బస్సులను శుక్రవారం రాత్రి నుంచేనిలిపివేశారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 29 డిపోలలో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు,రీజినల్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మినహా మిగతా 19వేల మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు తదితర సిబ్బంది సమ్మెలోకి వెళ్లారు. కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి రావడంతో కార్మికులంతా ఒక్కటై సమ్మె చేస్తున్నారు. దీంతో నగరంలో రాకపోకలు సాగించే 3,850 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. మరోవైపు సమ్మెను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం చాలామంది సొంతూళ్లకు వెళ్లారు. ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్‌బీనగర్, ఉప్పల్ కిటకిటలాడాయి. ఏపీలోని విజయవాడ, గుంటూరు, తిరుపతి, వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాలతో పాటు బెంగళూరు, ముంబై, షిర్డీ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను శుక్రవారం రాత్రి నుంచే నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే టీఎస్ ఆర్టీసీ ముందస్తు బుకింగ్‌లు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది.
ప్రత్యామ్నాయ చర్యలివీ...
కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించారు. డిపోల వారీగా తాత్కాలిక సిబ్బందిని నియామకానికి చర్యలు చేపట్టారు. కనీసం 18 నెలల సీనియారిటీతో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారిని, పదో తరగతి పాసైన వారిని డ్రైవర్లుగా, కండక్టర్లుగా నియమించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో ఈ నియామకాలు జరుగుతున్నాయని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. అలాగే సుమారు 250 అద్దె బస్సులను యథావిధిగా నడిపేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులను కూడా తాత్కాలికంగా నియమించుకోనున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలో తిరిగే 1.4 లక్షల ఆటోలతో పాటు వివిధ జిల్లాల నుంచి నగర శివార్లలోకి రాకపోకలు సాగించే మరో 50 వేల ఆటోలను కూడా సిటీలోని అన్ని ప్రాంతాలకు అనుమతినిస్తున్నారు. మరో 50వేలకు పైగా ఉన్న సెవెన్ సీటర్ ఆటోలపై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రతి 5 నిమిషాలకు ఒక ట్రిప్పు చొప్పున తిరుగుతున్న మెట్రో రైళ్లు ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాత్రి 11:30 గంటల వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 121 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, బేగంపేట్, లింగంపల్లి, హైటెక్ సిటీ లాంటి ప్రధాన రైల్వేస్టేషన్‌ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.
ప్రైవేట్ బస్సులకు అనుమతి
దసరా సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రవాణా అధికారులు ప్రైవేట్ బస్సులకు ప్రత్యేక అనుమతులిస్తున్నారు. 12,000 స్కూల్ బస్సులను కూడా అద్దె ప్రాతిపదికపై నడపనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్, టూరిస్టు బస్సులను స్టేజీ క్యారేజీలుగా తిప్పుతారు. అలాగే పోలీసు భద్రతతో బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా నగరంలో ఆటోవాలాలు, ఇతర ప్రైవేట్ వాహనాలు పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపనున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జేటీసీ పాండురంగ్ నాయక్ చెప్పారు.
మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైళ్లు శనివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. రద్దీని బట్టి ప్రతి మూడు, ఐదు నిమిషాలకో రైలును నడుపుతామన్నారు. రద్దీ పెరిగితే రైళ్ల ఫ్రీక్వెన్సీని అప్పటికప్పుడు తగ్గిస్తామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అమీర్‌పేట్, ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్ స్టేషన్ల నుంచి రాత్రి 11:30 గంటలకు చివరి రైలు బయలుదేరి అర్ధరాత్రి 12:30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందన్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ రూట్లలోని స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్‌అండ్‌టీ సీనియర్ అధికారులు రద్దీ నియంత్రణకు ఎల్బీనగర్, అమీర్‌పేట్, హైటెక్‌సిటీ, సికింద్రాబాద్ ఈస్ట్, పరేడ్‌గ్రౌండ్స్ తదితర స్టేషన్లలో స్వయంగా రంగంలోకి దిగుతారన్నారు. ప్రయాణికులు క్రమశిక్షణను పాటించి క్యూలైన్లలో స్టేషన్లు, రైళ్లలోకి చేరుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులకు సహాయ పడాలని కోరారు. స్మార్ట్‌కార్డుల కొనుగోలు ద్వారా టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గుతుందన్నారు.
డిపోకు ఒక ఆఫీసర్
అఫ్జల్‌గంజ్: సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు. ఎంజీబీఎస్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... డిపోల వారీగా పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ అధికారులతో కమిటీ వేసి, వారి సహకారంతో బస్సులను నడపనున్నట్లు చెప్పారు. అలాగే డిపోకు ఒక ఆఫీసర్‌ను కేటాయించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామన్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులు సీబీఎస్ (పాత బస్టాండ్)లో... సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో ఉంటాయన్నారు. అలాగే హన్మకొండ, వరంగల్, నర్సింపేట్, పరకాల, జనగాం, తొర్రూరు, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్డు నుంచి... కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట్ వైపు వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం చేసిన ఈ మార్పులను గమనించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment