సమ్మెట.. ఎట్లనన్నా పోవాలె.. | Hyderabad People Fear on TSRTC Strike From Tomorrow | Sakshi
Sakshi News home page

సమ్మెట.. పండగెట్ల?

Published Fri, Oct 4 2019 11:08 AM | Last Updated on Fri, Oct 4 2019 12:53 PM

Hyderabad People Fear on APSRTC Strike From Tomorrow - Sakshi

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బారులుతీరిన ప్రయాణికులు

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకే మొగ్గు చుపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో రెండోరోజూ చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5 నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెను ఎదుర్కొనేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. దసరా ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించింది. గ్రేటర్‌లో తిరిగే ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేట్, స్కూల్‌ బస్సులు తదితర వాహనాలను అందుబాటులోకి  తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. అదే విధంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్ల ట్రిప్పులు అదనంగా నడపాలని అధికారులకు సూచించింది. సమ్మె దృష్ట్యా ఉబర్, ఓలా లాంటి క్యాబ్‌లు, ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలు అడ్డగోలు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ జేటీసీ పాండురంగ్‌ నాయక్‌ హెచ్చరించారు. గ్రేటర్‌లో 29 డిపోల నుంచి ప్రతిరోజు 3,850 బస్సులు  ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. 32 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. 1,050కి పైగా రూట్లలో సిటీ బస్సులు రోజుకు 42వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. నగరంలోని అన్ని డిపోలకు చెందిన సుమారు 19వేల మందికి పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు తదితర సిబ్బంది సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. 50 మంది డిపో మేనేజర్లు, డివిజనల్‌ మేనేజర్లు, రీజినల్‌ మేనేజర్లు, ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ మాత్రమే విధులు నిర్వహిస్తారు. దీంతో బస్సుల నిర్వహణకు పూర్తి స్థాయిలో బ్రేక్‌ పడనుంది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయడం సాధ్యం కాకపోయినా.. వీలైనంత వరకు ఇబ్బందులను అధిగమించేలా, రద్దీని ఎదుర్కొనేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్నట్లు రవాణా అధికారులు తెలిపారు. 

రూ.100తో అనుమతి...  
వివిధ ట్రావెల్స్‌ సంస్థలకు చెందిన 7 సీట్లు, 15 సీట్లు, 25 సీట్లతో నడిచే మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, కాంట్రాక్ట్, టూరిస్టు పర్మిట్లపై నడిచే  ప్రైవేట్‌ బస్సులకు తాత్కాలిక పర్మిట్లను అందజేయనున్నారు. వాహన యజమానులు రోజుకు రూ.100 చొప్పున చెల్లించి ఈ పర్మిట్లను పొందవచ్చు. ఆర్టీసీ అద్దె బస్సులు, సెట్విన్‌ బస్సులను నిర్దేశిత రూట్లలోనే కాకుండా అన్ని మార్గాల్లోకి అనుమతించనున్నారు. అలాగే  ప్రస్తుతం నగర శివార్లకే పరిమితమైన సెవెన్‌ సీటర్‌ ఆటోలను నగరంలోకి అనుమతించనున్నట్లు జేటీసీ చెప్పారు. పిల్లలకు దసరా సెలవుల దృష్ట్యా గ్రేటర్‌లోని సుమారు 12వేల స్కూల్‌ బస్సులను తాత్కాలిక పర్మిట్లపై ప్రయాణికుల రవాణా సదుపాయం కోసం వినియోగించనున్నారు. గ్రేటర్‌లో తిరుగుతున్న 1.4 లక్షల ఆటోరిక్షాలతో పాటు మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ తదితర జిల్లాలకు చెందిన ఆటోలను కూడా నగరంలో తిరిగేందుకు అనుమతినిస్తారు. మరోవైపు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ  తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీరిలో డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రూ.1,000 చొప్పున వేతనాలు అందజేస్తారు. ఏడాదిన్నర అనుభవం కలిగిన హెవీ డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్నవారు ఇందుకు అర్హులు. అలాగే పదో తరగతి పాసైనవారు కండక్టర్‌గా పనిచేయవచ్చు. ఆర్టీఏ పర్యవేక్షణలో డిపోల వారీగా ఈ నియామకాలు జరుగుతాయి. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు డ్రైవర్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. అలాగే ఆర్టీసీ రిటైర్డ్‌ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్ల సేవలను వినియోగించుకోనున్నారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బారులుతీరిన ప్రయాణికులు, చిన్నారితో ప్రమాదకరంగా ప్రయాణం
దసరాకు ఊరెళ్లేదెలా...
దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 4,935 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 1,000 బస్సులకు పైగా వివిధ రూట్లలో నడిపారు. ఈ నెల 5, 6 తేదీల్లోనే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని సుమారు 20 లక్షల మందికి పైగా ప్రయాణికులు తెలుగు రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు. అన్ని రైళ్లలో ఇప్పటికే రద్దీ భారీగా ఉండడంతో నగరవాసులు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులపైనే ఆధారపడి ఉన్నారు. సమ్మె నేపథ్యంలో ప్రైవేట్‌ బస్సులు ఇప్పటికే దారి దోపిడీకి తెరలేపాయి. ఒకవేళ 5 నుంచి సమ్మె చేసే నేపథ్యంలో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. శని, ఆది, సోమవారాల్లోనే కనీసం 15 లక్షల మందికి పైగా ప్రయాణికులు సొంతూళ్లకు తరలివెళ్లే అవకాశం ఉంది. కానీ శనివారం నుంచే ఆర్టీసీ సేవలు నిలిచిపోతే ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలపైన ఆధారపడాల్సిందే. దీంతో ప్రయాణికులపై చార్జీల భారం పెరగనుంది. అలాగే నగరంలోని ఆటోరిక్షాలు, సెవెన్‌ సీటర్‌ ఆటోలు, క్యాబ్‌లు ప్రయాణికుల జేబులు లూఠీ చేసేందుకు అవకాశం ఉంది. 

ఎట్లనన్నా పోవాలె...   
దసరా రద్దీ కొనసాగుతోంది. గురువారం సైతం ప్రయాణికులు పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలి వెళ్లారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి బయలుదేరే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రిజర్వేషన్‌లు లభించకపోవడంతో ప్రయాణికులు సాధారణ బోగీల్లో బయలుదేరారు. మరోవైపు జనరల్‌ టికెట్‌ల కోసం బుకింగ్‌ కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాశారు. బండెక్కే క్రమంలో చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికుల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరయ్యారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి సాధారణ సమయాల్లోనే రోజుకు 1.95 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా... గురువారం ఒక్కరోజే  2.30 లక్షల మందికి పైగా తరలి వెళ్లినట్లు అంచనా. అలాగే నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి కూడా జనం భారీ ఎత్తున సొంతూళ్లకు తరలి వెళ్లాలరు. ఒకవైపు ఆర్టీసీలో సమ్మె ఘంటికలు, మరోవైపు ప్రైవేట్‌ బస్సుల్లో రెట్టింపు చార్జీల దోపిడీ దృష్ట్యా రైళ్లపై ఆధారపడిన సామాన్యులకు అరకొర రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రయాణికుల డిమాండ్‌కు, రద్దీకి తగినట్లుగా సాధారణ బోగీలు లేకపోవడంతో కేవలం 75 మంది కూర్చొని వెళ్లాల్సిన బోగీల్లో 150 మందికి పైగా కిక్కిరిసి వెళ్లాల్సి వస్తోంది. 

నిరంతర నిఘా  
ప్రైవేట్‌ వాహనాలకు ఇచ్చే తాత్కాలిక పర్మిట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల సహకారంతో నగరంలో తనిఖీలు నిర్వహిస్తాం. ఇష్టారాజ్యంగా చార్జీలు తీసుకుంటే వాహనాల పర్మిట్లను రద్దు చేస్తాం. ఆర్టీసీ చార్జీలకు అనుగుణంగా ప్రైవేట్‌ చార్జీలు ఉండాలి. అలాగే ఉబర్, ఓలా తదితర క్యాబ్‌లు అడ్డగోలుగా చార్జీలు వసూలు చేసినా చర్యలు తప్పవు.  – జె.పాండురంగ్‌ నాయక్, జేటీసీ, హైదరాబాద్‌   

కంట్రోల్‌ సెంటర్‌...
సమ్మె నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు, తగిన చర్యలు చేపట్టేందుకుఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్‌ కార్యాలయంలో24/7 పనిచేసే కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ కేంద్రానికి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకుఅధికారులు చర్యలు తీసుకుంటారు. అలాగే వివిధవిభాగాల మధ్య సమన్వయం కోసం కూడా ఈ కేంద్రం పని చేస్తుంది. ప్రయాణికులు 040–23321279 నంబర్‌లో సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement