అమ్మా.. బస్సుల్లేవ్‌ టైమ్‌ పడ్తది! | People Suffering With TS RTC Strike Private Travels Double Charges | Sakshi
Sakshi News home page

అమ్మా.. బస్సుల్లేవ్‌ టైమ్‌ పడ్తది!

Published Sun, Oct 6 2019 7:37 AM | Last Updated on Mon, Oct 14 2019 11:12 AM

People Suffering With TS RTC Strike Private Travels Double Charges - Sakshi

ఆర్టీసీ సమ్మెతో సిటీ బస్సులుశనివారం ఎక్కడివి అక్కడేనిలిచిపోయాయి. మూడు వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సుల్లేక జేబీఎస్, ఎంజీబీఎస్‌ సహా ఆయా ప్రాంతాల్లోని బస్టాండ్‌లు వెలవెలబోయాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు వాహనాలు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులువస్తాయేమోనని గంటల తరబడి బస్టాపులలో పడిగాపులు కాశారు. ఫలితం లేకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ వాహనదారులు దోపిడీకి పాల్పడ్డారు. రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగాఆర్టీఏ రెండు వేల ప్రైవేట్, మినీ, స్కూల్‌ బస్సులు ఏర్పాటుచేయడం, తాత్కాలిక సిబ్బంది సహాయంతో బస్సులు నడపడంతో కొంత ఊరట లభించింది. మరోవైపు సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. సమయాన్ని పొడిగించి, అదనపు ట్రిప్పులునడపడంతో రికార్డు స్థాయిలో ప్రయాణికులు పయనించారు. 

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో శనివారం ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. సిటీ బస్సులతో పాటు దూరప్రాంతాలకు వెళ్లేవి సైతం స్తంభించాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లోని 29 డిపోలలో సుమారు 3,000 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కండక్టర్‌లు, డ్రైవర్లు, సూపర్‌వైజర్లు, మెకానిక్‌లు తదితర అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర బస్‌ స్టేషన్లలో, డిపోల వద్ద కార్మికులు ఆందోళన చేశారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమ్మె సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ అద్దె బస్సులను రోడ్డెక్కించింది. తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన కండక్టర్‌లు, డ్రైవర్‌ల సహాయంతో కొన్ని బస్సులను నడిపించారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తాత్కాలిక పర్మిట్లపై ప్రైవేట్‌ బస్సులు, కాంట్రాక్ట్, టూరిస్టు, స్కూల్‌ బస్సులను ఏర్పాటు చేశారు.

ఓవైపు దసరా రద్దీ, మరోవైపు సమ్మెతో ప్రైవేట్‌ ఆపరేటర్లు రెచ్చిపోయారు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రైవేట్‌ వాహనాల్లో చార్జీలపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ఇక ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్‌స్టేషన్‌లు, డిపోల వద్ద భారీ ఎత్తున మోహరించారు. రోడ్డెక్కిన బస్సులకు భద్రత కల్పించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ స్వయంగా హకీంపేట్, కుషాయిగూడ తదితర డిపోల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సమ్మె దృష్ట్యా ప్రైవేట్‌ బస్సులు, టాటాఏస్‌లు, వ్యక్తిగత వాహనాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో పలు చోట్ల ట్రాఫిక్‌జామ్‌ అయింది. ప్రయాణికుల కోసం ఆర్టీఏ చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్ఫతాలినిచ్చాయి. కానీ చార్జీల దోపిడీని నియంత్రించలేకపోయారు. మరోవైపు మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఆటోలు, సెవెన్‌ సీటర్‌  ఆటోలు, క్యాబ్‌లు కూడా అందుబాటులో ఉండడంతో ప్రయాణికుల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.  

కొన్ని మార్గాల్లో రాకపోకలు  
గ్రేటర్‌లోని అన్ని డిపోల పరిధిలో మొదటి రోజు 798 బస్సులు నడిపారు. ఇందులో 345 అద్దె బస్సులున్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన 826 మంది కండక్టర్‌లు, డ్రైవర్‌ల సహాయంతో 453 బస్సులను నడిపినట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే సికింద్రాబాద్‌–ఉప్పల్, జేబీఎస్‌– అఫ్జల్‌గంజ్, దిల్‌సుఖ్‌నగర్‌–కోఠి, బీహెచ్‌ఈఎల్‌–సికింద్రాబాద్‌ తదితర రూట్లలో ఇవి నడిచాయి. అలాగే జేఎన్‌టీయూ, సికింద్రాబాద్, పర్యాటకభవన్, తార్నాకల నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 40 ఎలక్ట్రిక్‌ ఓల్వో బస్సులు యథావిధిగా నడిచాయి. త్కాలిక డ్రైవర్‌లు, కండక్టర్‌ల నియామకాలు కొనసాగుతున్నాయని.. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గ్రేటర్‌ జోన్‌లోని మొత్తం 19,903 మంది కండక్టర్‌లు, డ్రైవర్లు, అధికారులు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందిలో 55 మంది అధికారులు, 179 మంది సెక్యూరిటీ సిబ్బంది, మరో ముగ్గురు సూపర్‌వైజర్లు మాత్రమే శనివారం విధులకు హాజరయ్యారు. మిగతా 19,666 మంది విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు కంటోన్మెంట్, దిల్‌సుఖ్‌నగర్‌ డిపోల్లో ఇద్దరు కండక్టర్‌లు మాత్రం విధుల్లో చేరారు.

‘ప్రైవేట్‌’లో దోపిడీ పర్వం..
సమ్మె నేపథ్యంలో ప్రైవేట్‌ వాహనాల దోపిడీ కొనసాగింది. ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేశారు. ప్రైవేట్‌ బస్సులు, వివిధ రకాల వాహనాలకు రవాణా అధికారులు ఎడాపెడా పర్మిట్లు ఇవ్వడం మినహా చార్జీలపై ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోలేదు. శనివారం ఒక్కరోజే సుమారు 2,000 వాహనాలకు తాత్కాలిక  పర్మిట్లు ఇచ్చారు. వీటిలో స్కూల్‌ బస్సులు కూడా ఉన్నాయి. కొన్ని బస్సులు సిటీలో తిరిగాయి. కానీ ఎక్కువ శాతం దూరప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. ఈ బస్సుల్లో చార్జీలపై నియంత్రణ లేకపోవడంతో ఎల్‌బీనగర్‌ నుంచి విజయవాడకు సాధారణంగా రూ.450 వరకు చార్జీ ఉంటే.. రూ.900 వరకు వసూలు చేశారు. అలాగే ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి హన్మకొండ వరకు సాధారణ రోజుల్లో రూ.150 ఉంటే.. రూ.350కి పెంచారు.

జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి కరీంనగర్‌ వరకు రూ.200 చార్జీ కాగా... రూ.450 వరకు తీసుకున్నారు. దసరా కావడంతో ప్రయాణికులకు మరో గత్యంతరం లేకుండా పోయింది. మినీ బస్సులు, టాటాఏస్‌లతో పాటు క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు తదితర అన్ని వాహనాల్లో దోపిడీ పెద్ద ఎత్తున కొనసాగింది. ఇక నగరంలోనూ సెవెన్‌ సీటర్‌ ఆటోలు, మూడు సీట్ల ఆటోలు ప్రయాణికుల జేబులు లూఠీ చేశాయి. సికింద్రాబాద్‌ నుంచి తార్నాక వరకు రూ.20 చార్జీ ఉంటే సెవెన్‌ సీటర్‌ ఆటోలు రూ.50 వరకు తీసుకున్నాయి. సాధారణ రోజుల్లోనే అడ్డగోలుగా చార్జీలు వసూలు చేసే ఆటోవాలాలు సమ్మెను మరింత సొమ్ము చేసుకున్నారు. అలాగే సమ్మె కారణంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ తదితర ఆసుపత్రులకు వచ్చే ఔట్‌పేషెంట్‌ల సంఖ్య కూడా సగానికి తగ్గిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఎంక్వైరీలో ఎవ్వల్లేరు!

అఫ్జల్‌గంజ్‌: సమ్మె విషయం తెలియక శనివారం ఇమ్లీబన్‌ బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు ఏ సమయానికి వస్తాయో? అసలు వస్తాయో లేదో? అనే విషయం కనుక్కుందామని ప్రయాణికులు విచారణ కేంద్రానికి వెళ్తే, అక్కడ సమాధానం చెప్పేవారే కరువయ్యారు. ఎంతసేపైనా బస్సులు రాకపోయేసరికి చేసేదేమీ లేక కొందరు ప్రయాణం వాయిదా వేసుకొని వెనుదిరిగి వెళ్లారు. మరికొందరు అందుబాటులో ఉన్న ట్రావెల్స్‌ను ఆశ్రయించారు.

చార్జీలకే సగం కూలీ
ప్రతిరోజు తూప్రాన్‌ నుంచి మేడ్చల్‌కు కూలీ పని కోసం వస్తాను. రోజంతా పనిచేస్తే రూ.200 ఇస్తారు. సమ్మె కారణంగా శనివారం ఆటోలో వచ్చాను. సాధారణ రోజుల్లో అయితే రూ.20 తీసుకుంటారు. కానీ సమ్మె అని రూ.50 వసూలు చేశారు. రానూపోను రూ.100 చార్జీలకే పోయింది. ఇక సగం కూలీనే నాకు మిగిలింది.  – లక్ష్మీ, తూప్రాన్, మెదక్‌ జిల్లా 

సమ్మె సరికాదు
దసరా సమయంలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్తారని తెలిసి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం సరికాదు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో తగిన నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. బస్సుల్లేకప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కోవాల్సి వస్తోంది. శనివారం కార్యాలయాలకు వెళ్లేందుకుఉద్యోగులు నానాపాట్లు పడ్డారు.  – మహేశ్వర్‌గౌడ్, అంబేడ్కర్‌ వర్సిటీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement