కదం తొక్కిన కార్మికులు
చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. బారికేడ్లను తోసుకుని ముంద ట్యాంక్‌బండ్‌పైకి పరుగులు తీశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. భారీ సంఖ్యలో కార్మికులు తరలిరావడంతో వీరిని అడ్డుకోవడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ప్రభుత్వం తమ కడుపు కొడుతోందంటూ కార్మికులు సర్కారుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ వైపు వందలాది మంది కార్మికులతో పాటు, పలువురు రాజకీయ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళా కార్మికుల అరెస్ట్
చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ మహిళా కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 20 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషామహల్ స్టేషన్‌కు తరలించారు. కాగా, చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్ చేసినట్టు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ముందస్తు అరెస్టులు చేసినట్టు వెల్లడించారు. ట్యాంక్ బండ్‌పై ప్రశాంత వాతావరణం ఉందన్నారు.
అశ్వత్థామరెడ్డి అరెస్టు..
చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హిమాయత్ నగర్ లిబర్టీ వద్ద నుంచి వెళ్తున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం
ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, శానసనమండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డిలను హైద్రాబాద్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు.
ఇంత దారుణమా?: భట్టివిక్రమార్క
రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేస్తున్నారనిసీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత నిర్బంధం దేశంలో ఎక్కడా లేదని, ఎప్పుడు ఇలాంటి నిర్బంధాన్ని చూడలేదని వాపోయారు. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు.
అరెస్టులే అరెస్టులు
చలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ములుగు జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులన పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, సర్పంచ్‌లు ఎండీ అహ్మద్ పాషా, గండి కుమార్, బీజేపీ నాయకులు బలరాం ఆలె, శోభన్ మోహన్, ఎల్కతుర్తి రాజన్న రవి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ నేతలు గీస సంపత్, తౌటం ప్రభాకర్, మరోజు కృష్ణమచారి, గొర్రె శశికాంత్, తాటికంటి రవికుమార్, తోట ఓదేలు, పున్నం మల్ల రెడ్డి, కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపుర్‌లో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో బీజేపీ నాయకుల అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంచిర్యాల డిపోకు చెందిన 17 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులను.. ఆర్టీసీ కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో వివిధ పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికుల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.
స్థానికులకు కష్టాలు
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వారిని కూడా పోలీసులు అనుమతించకపోవడంతో ఉద్యోగాలకు, కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు మూసివేసి, ట్రాఫిక్ మళ్లించడంతో కష్టాలు పడుతున్నామని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్ పరి సర ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. ట్యాంక్‌బండ్ రోడ్డున పూర్తిగా వేసి వాహనదారులు అటువైపు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్న నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పోలీసుల కళ్లుగప్పి ట్యాంక్‌బండ్ చేరుకునేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, విద్యార్థులు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చేందుకు యత్నిస్తున్నారు.శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అప్పర్ ట్యాంక్‌బండ్ పూర్తిగా మూసేస్తున్నామని నగర ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment