సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమ్మె పరిష్కారానికి ఇరువర్గాలు బెట్టు వీడి ప్రయత్నాలు చేయాలన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశాన్ని పక్కనపెట్టి మిగిలిన 21 డిమాండ్లను పరిశీలించా లని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్నందున దాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. మిగిలిన డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రెండు మూడు రోజుల్లో నివేదిక అందించేలా చూడాలంటూ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. ఆ నివేదిక అందిన తర్వాత చర్చలపై తుది నిర్ణ యం తీసుకోనున్నారు. ఈనెల 28న జరిగే విచారణలో హైకోర్టుకు అదే విషయాన్ని నివేదించనున్నారు.
కోర్టు ఉత్తర్వులతో..
ఆర్టీసీ సమ్మెపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సంబంధించి ఆర్టీసీ ఎండీకి కొన్ని సూచనలు చేసింది. కానీ ఇందుకు సంబంధించిన మధ్యంతర ఉత్తర్వుల ప్రతి అధికారులకు అందకపోవడంతో సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కోర్టు చేసిన వ్యాఖ్యలను స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే స్పందించాలని నిర్ణయించారు. అధికారులు రెండుసార్లు సీఎంతో సమావేశం కోసం వెళ్లినా.. ఉత్తర్వుల ప్రతి లేకుండా చేసేదేమీ లేకపోవడంతో ముఖ్యమంత్రి కూడా భేటీలో పాల్గొనలేదు. చివరకు మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు అందడంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తొలుత అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం రాత్రి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నివేదిక పరిశీలించాకే చర్చలపై నిర్ణయం..
కార్మిక సంఘాలు చేసిన డిమాండ్లలో 21 అంశాలను కొత్తగా ఏర్పాటైన కమిటీ పరిశీలిస్తుంది. వాటి అమలు సాధ్యాసాధ్యాలపై పూర్తి వివరాలతో నివేదికను ఎండీకి అందజేస్తుంది. దాన్ని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాతనే కార్మిక సంఘాలతో చర్చలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదంతా కోర్టు తదుపరి వాయిదా (ఈనెల 28)లోపు జరగాల్సి ఉంది. కోర్టుకు ఆ రోజు తన నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుంది.
ఇటు కమిటీ.. అటు అద్దె బస్సులకు ఆదేశాలు
కార్మికుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేయాలని ఆదేశించిన సీఎం కేసీఆర్.. అదే సమయంలో వెయ్యి అద్దె బస్సులను సమకూర్చుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులకు సూచించారు. వాస్తవానికి ఇప్పటికే అద్దె బస్సుల కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా.. దానికి సంబంధించి దాఖలైన టెండర్లను అధికారులు సోమవారం రాత్రి పరిశీలించారు. జిల్లాల్లో 250 బస్సులకు 9,700 దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో మాత్రం 750 బస్సులకు కేవలం 18 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. తాజాగా మరో వెయ్యి బస్సులకు నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. సరిపడా దరఖాస్తులు రానిపక్షంలో మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
కమిటీలో సభ్యులు వీరే...
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఇన్‌చార్జీ ఎండీ సునీల్‌శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఆర్టీసీ ఈడీ టి.వెంకటేశ్వర్‌రావు అధ్యక్షుడిగా ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేష్‌లు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పడింది. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండికి అందిస్తుందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
మోదీ ప్రభుత్వం చేసిన చట్టప్రకారమే చేస్తున్నాం...
ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్బలంతో చట్టవ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు పలకడం అనైతికమని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీలు ఆర్టీసీ విషయంలో చేస్తున్న వాదనలు విచిత్రంగా ఉన్నాయి. ఆర్టీసీని, రూట్లను ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం, అవకాశం కల్పిస్తూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చట్టం చేసింది. దానికి వ్యతిరేకంగా ఇక్కడి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసింది. కానీ ఆ పార్టీ నేతలు తెలంగాణ విషయంలో మాత్రం విచిత్రంగా, విభిన్నంగా మాట్లాడుతున్నారు’’అని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘‘1950లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటారు వాహనాల చట్టాన్ని రూపొందించారు. దాని ప్రకారమే రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని కూడా ఆ చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టంలోని 3వ సెక్షన్‌లో సవరణలు చేస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019 బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు ఆమోదించి, చట్టం చేసింది. ఆర్టీసీలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాలని అందులో పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడానికి, తక్కువ ధరల్లో ప్రయాణం సాగించడానికి పోటీ అనివార్యమని కూడా కేంద్రం అభిప్రాయపడింది. మొబైల్ రంగంలో, విమానయాన రంగంలో ప్రైవేటుకు అవకాశం కల్పించడం వల్ల ఆయా రంగాల్లో రేట్లు తగ్గాయని, సౌకర్యాలు పెరిగాయని వివరించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పారు. అలాంటిది బీజేపీ నాయకులు తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు’’అని కేసీఆర్ విమర్శించారు. కేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే, స్థానిక బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్న విషయంపై ప్రధానికి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రికి లేఖ రాయాలనే అభిప్రాయపడ్డారు. దీనిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. సీఎంతో జరిగిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు పాల్గొన్నారు.
విలీనంపై పట్టు పట్టబోమని చెప్పారు..
‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలి. కార్మిక సంఘాల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ నెరవేరితే తప్ప చర్చలకు కార్మికులు రారని ఎప్పుడూ చెప్పలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. వాటిని పరిశీలించాలి’’అని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీని కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ బాధ్యతను ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మకు అప్పగించారు. ఈనెల 18న హైకోర్టు నేరుగా ఆర్టీసీ ఎండీకే సూచనలు చేయడంతో ఆయనే స్పం దించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment