మహానాడుకు దేవేందర్ గైర్హాజరు
మొయినాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో టీడీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు, మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ మహానాడుకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యం కారణంగానే దేవేందర్‌గౌడ్ హాజరుకాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన కుమారుడు వీరేందర్‌గౌడ్ మాత్రం యువనేతలతో కలిసి సందడి చేయడం కనిపించింది. ఉదయం 10.30 గంటలకే పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆలస్యంగా సాయంత్రం 4.30 గంటలకు చేరుకున్నారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వరం , రాజేంద్రనగర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ప్రకాష్‌గౌడ్, మాదవరం కృష్ణారావు, మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలోని తూర్పు డివిజన్ నుంచి కొంత వరకు విచ్చేసినా పశ్చిమ రంగారెడ్డి నుంచి మాత్రం అంతంత మాత్రంగానే హాజరయ్యారు.
అందరికీ దొరకని భోజనం...
టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు హాజరైన ప్రతినిధులందరికీ భోజనం దొరకలేదు. ఈసారి 20వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ నాయకులు మొదటి నుంచీ చెబుతున్నా ఆ స్థాయిలో మాత్రం ఏర్పాట్లు చేయలేదు. మొదటి రోజు సుమారు పదివేల మందికి మాత్రమే ఏర్పాట్లు చేయడంతో అది ఏమాత్రం సరిపోలేదు. దీంతో చాలామంది మధ్యాహ్నానికే తిరుగు ముఖం పట్టారు. మరి కొందరైతే ఏకంగా వంటశాలలోకి వెళ్లి దొరికినకాడికి తిని సరిపెట్టుకున్నారు.
మాట్లాడేందుకు జిల్లా నేతలకు దక్కని అవకాశం
మొదటి రోజు జిల్లా నేతలకు మాట్లాడే అవకాశం దక్కలేదు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర నేతలు హాజరైనప్పటికీ ఏ ఒక్కరికి మాట్లాడే ఛాన్‌స రాలేదు. మొదటి రోజు మూడు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించారు. తెలుగుదేశం విజయం- తెలుగుజాతి కార్యకర్తలకు అంకితం, 2014 ఎన్నికల సమీక్ష, అవినీతి రహిత భారతదేశం- సంస్కరణలు అనే అంశాలపై చర్చించినప్పటికీ మాట్లాడేందుకు జిల్లా నేతలెవరికీ అవకాశం ఇవ్వలేదు. జిల్లాలో జరుగుతున్న కార్యక్రమంలో జిల్లా నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై స్థానిక తెలుగు తమ్ముళ్లు కొంత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
భోజనాల సమయంలో తోపులాట
మహానాడు కార్యక్రమంలో మధ్యాహ్న భోజన సమయంలో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. భోజనం చేసేందుకు పార్టీ కార్యకర్తలంతా ఒకేసారి రావడంతో వారిని నియంత్రించడంలో వలంటీర్లు విఫలమయ్యారు. దూసుకొచ్చిన కార్యకర్తలను వాలంటీర్లు తోసేయడంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు. 20 రకాల వంటకాలతో కార్యకర్తలందరికీ ఏ లోటు లేకుండా భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పి అరకొరగా ఏర్పాట్లు చేయడంతో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా ‘ఆక్టోకాఫర్’
చేవెళ్ల/మొయినాబాద్‌రూరల్: మహానాడులో ‘ఆక్టోకాఫర్‘ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పరికరం మినీ హెలికాప్టర్‌ను పోలి ఉంటుంది. రిమోట్ ద్వారా గాలిలో తిప్పుతూ దృశ్యాలను చిత్రీకరించడానికి ఉపయోగిస్తారు. ఈ పరికరానికి వీడియో కెమెరాతో పాటుగా ఫొటో కెమెరా ఉంటుంది. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎంతమంది జనం హాజరైంది, ప్రజల కదలికలను ఆక్టోకాఫర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. మంగళవారం ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సన్నివేశాన్ని దీని ద్వారా చిత్రీకరించారు. ఈ పరికరం ద్వారా తీసిన దృశ్యాలను, సన్నివేశాలను మహానాడు ప్రధాన సమాచార కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌పై నేరుగా చూసే అవకాశం కల్పించారు.