ఆస్తి కోసం అంతమొందించారు
కరీంనగర్ క్రైం:
కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన కైలాస్ నర్సింగరావు(27) అయినవారి చేతిలోనే హత్యకు గురయ్యాడు. అతని అత్తమామల ఆస్తిపై కన్నేసిన సమీప బంధువే పాలేర్ల చేత చంపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన అనుముల మల్లయ్య కుమార్తె పద్మను నర్సింగరావుకు ఇచ్చి ఆగస్టు 22న వివాహం జరిపించారు.
పెళ్లి సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నర్సింగరావుకు, అతడి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తూ పెళ్లి చేసుకోవద్దని బెదిరింపులకు గురిచేశారు. అయినా నర్సింగరావు పద్మను వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరు కిసాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 15న అనుముల మల్లయ్య వద్ద పాలేరుగా పనిచేసే స్వామి.. నర్సింగరావుకు ఫోన్ చేసి మద్యం తాగుదాం రమ్మని కోరాడు. స్వామి తనకు తెలిసిన వ్యక్తే కావడంతో ఎలాంటి అనుమానం లేకుండా అతడి వెంట బైక్‌పై వెళ్లాడు. అప్పటినుంచి నర్సింగరావు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు.
ఈ నెల 17న కరీంనగర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నర్సింగరావు అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. నర్సింగరావు ఇంటి నుంచి వెళ్లిన సమయంలో అతడిని ఫోన్‌లో ఎవరు సంప్రదించారని ఫోన్‌కాల్ లిస్టును పరిశీలించారు. చివరగా నర్సింగరావుకు స్వామి ఫోన్ చేసినట్టు గుర్తించి.. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, హత్య విషయాన్ని వెల్లడించాడు.
నర్సింగరావు ఇంట్లోంచి బయటకు వచ్చాక గాంధీనగర్‌లో మద్యం కొనుక్కుని ఇరుకుల్ల పాత బ్రిడ్జి వరకు వెళ్లామని చెప్పాడు. అక్కడ మరో పాలేరు కొమురయ్యతో కలిసి నర్సింగరావుకు మత్తుమందు కలిపిన మద్యం తాగించిన అనంతరం టవల్‌ను మెడకు బిగించి చంపి మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టినట్టు చెప్పాడు. నర్సింగరావు బైక్‌ను సమీపంలోని బావిలో పడేసి.. ఎవరికీ అనుమానం రాకుండా గోపాల్‌పూర్ వెళ్లారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం హత్యాప్రదేశానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి.. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులు స్వామిది వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం హస్పెట గ్రామం కాగా, కొమురయ్యది అదే మండలం.
సూత్రధారి సమీప బంధువే..
అనుముల మల్లయ్యకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వరుసకు అల్లుడైన అదే గ్రామానికి చెందిన ముస్కు రాజిరెడ్డి(45) మల్లయ్యకు చెందిన వ్యవసాయ భూములు, ఆస్తులను పర్యవేక్షిస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్తిపై కన్నేసిన రాజిరెడ్డి.. మల్లయ్యకు కుమార్తె పద్మనే ఏకైక వారసురాలు కాబట్టి ఆమెను లొంగదీసుకుంటే ఆస్తిని కాజేయవచ్చని పథకం పన్నాడు. ఇదే క్రమంలో పద్మకు వచ్చిన పలు సంబంధాలను చెడగొట్టాడు.
నర్సింగరావుతో వివాహం నిశ్చయం కాగా.. దానిని నిలిపివేయాలని అతడి కుటుంబాన్ని పరోక్షంగా బెదిరింపులకు గురిచేశాడు. ఇవేమీ పట్టించుకోని నర్సింగరావు పద్మను వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి మల్లయ్య.. రాజిరెడ్డిని పక్కన పెడుతూ సొంత అల్లుడైన నర్సింగరావును దగ్గరకు తీయడం ప్రారంభించాడు.
ఆస్తి తనకు దక్కాలంటే నర్సింగరావును అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన రాజిరెడ్డి.. మల్లయ్యతోపాటు తన వద్ద పాలేర్లుగా పనిచేస్తున్న కొమురయ్య, స్వామిలతో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. వారికి అడ్వాన్స్‌గా రూ.90 వేలు ముట్టచెప్పి, మత్తుమందు తీసుకువచ్చి ఇచ్చాడు. ఈ మేరకు స్వామి, కొమురయ్యలు నర్సింగరావును హత్య చేశారు.
పది గంటల్లోనే ఛేదించిన పోలీసులు
17వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ సీఐ స్వామి 18వ తేదీన మధ్యాహ్నం అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 19వ తేదీ తెల్లవారుజాము వరకే హత్య చేసిన విషయం నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పది గంటల్లోనే ఛేదించిన త్రీటౌన్ సీఐని డీఎస్పీ రవీందర్ అభినందించారు. హత్యకు పథకం వేసిన రాజిరెడ్డితోపాటు నిందితులైన స్వామి, కొమురయ్యను అదుపులోకి తీసుకున్నారు.
సంఘటన స్థలాన్ని డీఎస్పీ రవీందర్, త్రీటౌన్ సీఐ స్వామి, వన్‌టౌన్ సీఐ కరుణారావు, ఎస్సై నాగార్జురావు, రూరల్ ఎస్సై శ్రీనివాస్ పరిశీలించారు. తహశీల్దార్ జయచంద్రారెడ్డి సమక్షంలో మృతదేహానికి సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి నర్సింగరావు తండ్రి పాండురంగారావు, సోదరులు గుండెలవిసేలా రోదించారు.