ఇద్దరు సీఎంలు మన జిల్లా వాళ్లే.. | Two Chief Ministers Are From Medak District | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఎంలు మన జిల్లా వాళ్లే..

Published Fri, Nov 23 2018 1:21 PM | Last Updated on Fri, Nov 23 2018 1:21 PM

Two Chief Ministers Are From Medak District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎంలుగా, మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు నిర్వర్తించి ఈ ప్రాంతానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 1980లో సీఎంగా టీ. అంజయ్య బాధ్యత స్వీకరించిన అనంతరం రామాయంపేట నుంచి శాసనసభకు పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి గెలిచిన తెలంగాణ మలిదశ ఉద్యమ నేత కేసీఆర్‌ సీఎం పదవిని చేపట్టారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో అందోల్‌ ఎమ్మెల్యేగా ఉన్న దామోదర్‌ రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. నర్సాపూర్‌ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొందిన సీ. జగన్నాథరావు డిప్యూటీ సీఎం పదవిని చేపట్టి ఈ ప్రాంత ప్రాభవాన్ని చాటారు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్వాతంత్య్రానంతరం తొలిసారిగా హైదరాబాద్‌ స్టేట్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న వికారాబాద్‌ మెదక్‌ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మర్రి చెన్నారెడ్డి, 1970, 80 దశకాల్లో రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1957 నాటికి వికారాబాద్‌ నియోజకవర్గం హైదరాబాద్‌లో అంతర్భాగం కావడంతో మర్రి చెన్నారెడ్డి పొరుగు జిల్లా నేతగా ముద్ర పడ్డారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కలహాల మూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1978–83 మధ్య కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. 1978లో మర్రి చెన్నారెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించగా, ఆయనపై సొంత పార్టీలోనే అసమ్మతి తలెత్తింది. దీంతో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న టంగుటూరి అంజయ్య 11 అక్టోబర్‌ 1980న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల మేరకు ఆరు నెలల్లోగా శాసనసభలో ప్రాతినిథ్యం పొందాల్సి ఉండటంతో ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు అంజయ్య సన్నద్దమయ్యారు. రామాయంపేట ఎమ్మెల్యే రాజన్నగారి ముత్యంరెడ్డిని రాజీనామా చేయించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 1981 ఏప్రిల్‌ 8న జరిగిన రామాయంపేట ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసిన అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే కొద్దికాలంలోనే కాంగ్రెస్‌ అసమ్మతి రాజకీయాల మూలంగా 1982 ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1983 ఎన్నికల్లోనూ రామాయంపేట అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేసిన అంజయ్య విజయం సాధించారు.

నాటి ఉద్యమ నేతే.. నేటి సీఎం
1983 ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కే. చంద్రశేఖర్‌రావు తొలి ప్రయత్నంలో ఓటమి పాలయ్యారు. 1985, 1989, 1994, 1999 సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి వరుస విజయాలు సాధించిన కేసీఆర్‌.. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుతో విభేదించి టీడీపీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్‌ 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. 2001 ఉప ఎన్నికతో పాటు, 2004 సాధారణ ఎన్నికల్లోనూ సిద్దిపేట నుంచి టీఆర్‌ఎస్‌ పక్షాన కేసీఆర్‌ విజయం సాధించి, సిద్దిపేటలో డబుల్‌ హ్యాట్రిక్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. 2004లో కరీంనగర్, 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కేసీఆర్, తిరిగి 2014 సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2014లో జరిగిన తొలి ఎన్నికలో కేసీఆర్‌.. గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రత్యేకతను చాటారు.

డిప్యూటీ సీఎంగా సీజేఆర్‌..
1961లో నర్సాపూర్‌ సమితి అధ్యక్షుడిగా పనిచేసిన సి.జగన్నాథరావు 1962లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 1962–1994 మధ్యకాలంలో ఎనిమిది పర్యాయాలు నర్సాపూర్‌ సెగ్మెంట్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1967, 1972, 1983 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన సీజెఆర్‌ పలువురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1982 ఫిబ్రవరి 24న భవనం వెంకట్రాంరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్‌లో సీజేఆర్‌ ఉపముఖ్యమంత్రి హోదాలో హోం మంత్రిగా పనిచేశారు. ఒక పర్యాయం రాష్ట్ర శాసనమండలికి కూడా సీజెఆర్‌ ఎన్నికయ్యారు.

ఉద్యమ నేపథ్యంలో ఉప మఖ్యమంత్రిగా దామోదర..
తండ్రి రాజనర్సింహ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న దామోదర రాజనర్సింహ 1989 ఎన్నికల్లో తొలిసారిగా అందోలు రిజర్వుడు స్థానం నుంచి కాంగ్రెస్‌ పక్షాన విజయం సాధించారు. 1989 మొదలుకుని ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు అందోలు స్థానానికి పోటీ చేసిన దామోదర నాలుగు పర్యాయాలు గెలుపొందారు. 2007 ఏప్రిల్‌లో జరిగిన కేబినెట్‌ విస్తరణలో అందోలు ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహకు వైఎస్‌ కేబినెట్‌లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా చోటు దక్కింది. 2009 ఎన్నికల్లో వైఎస్‌ నేతృత్వంలో  ఏర్పాటైన మలి విడత కేబినెట్‌లో దామోదర రాజనర్సింహ మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 2009 సెప్టెంబర్‌ 02న సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు.

ఆయన స్థానంలో కే.రోశయ్య సీఎం పదవి చేపట్టగా, వైఎస్‌ మంత్రివర్గంలో పనిచేసిన దామోదర, గీత, సునీత చేరారు. 2010 నవంబరులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌రెడ్డి పదవి చేపట్టగా, ఈ ముగ్గురు నేతలకే మళ్లీ మంత్రి పదవి దక్కింది. అయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం దామోదర రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నత విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement