BRS Candidates List For Upcoming Elections Will Announce In Sravana Masam - Sakshi
Sakshi News home page

BRS: శ్రావణ  మాసంలోనే కారు సీట్లు ఖరారు!

Published Sat, Jun 17 2023 12:53 AM | Last Updated on Sat, Jun 17 2023 4:20 PM

BRS Candidates List Comes In Sravana Masam For Upcoming Elections - Sakshi

ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా ప్రకటించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్‌ఎస్‌లో తీవ్రపోటీ నెలకొనడం, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో పనిమంతులకే తిరిగి టికెట్‌ దక్కుతుందని ఇప్పటికే స్పష్టతనిచ్చిన నేపథ్యంలో.. ముందుగానే జాబితాను ప్రకటించడం ద్వారా పారీ్టలో సందిగ్ధతకు తెరదించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టు సమాచారం. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. ప్రభుత్వ రద్దు ప్రకటనతోపాటే ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేశారు. అప్పుడు ఎన్నికలకు సుమారు మూడు నెలల ముందే ఒకేసారి 105 మంది జాబితాను విడుదల చేయడం సంచలనం సృష్టించింది. అదే తరహాలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు సుమారు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. 

మంచి ముహూర్తం చూసుకుని.. 
మరో రెండు రోజుల్లో ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది. అది ముగిశాక అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. అంటే జూలై మూడో వారం నుంచి నెలాఖరు మధ్యలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ తొలి జాబితాలో సుమారు 90 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉందని.. గణనీయంగానే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ల కోత పడొచ్చని ప్రచారం జరుగుతోంది. సుమారు 15శాతం మందికి మళ్లీ పోటీచేసే అవకాశం దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టికెట్ల కోసం పారీ్టలో తీవ్ర పోటీ ఉన్న సీట్లు, విపక్షాల ఎత్తుగడలు, ఇతర పారీ్టల నుంచి బలమైన నేతల చేరికకు అవకాశం ఉన్నచోట్ల ఎంపికను చివరి నిమిషం వరకు ఆపే అవకాశం ఉందని అంటున్నాయి.

 సంస్థాగతంగా చక్కదిద్దేందుకే ముందస్తు జాబితా! 
సుమారు 40కిపైగా అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం తీవ్రపోటీ నెలకొంది. ఆయా చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకా, మరెవరికైనా సీటు దక్కుతుందా అన్న ఆసక్తి కనిపిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లతోపాటు ఇతర ఆశావహులు కలుపుకొని సుమారు 70 మంది బలమైన నేతలు ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ఇప్పటికే లెక్కలు వేసుకుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరూ టికెట్‌పై స్పష్టత కోసం ప్రయతి్నంచే క్రమంలోనే బీఆర్‌ఎస్‌ను వీడారు. తాజాగా కూచాడి శ్రీహరిరావు (నిర్మల్‌) కాంగ్రెస్‌లో చేరగా.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (నాగర్‌కర్నూల్‌) కూడా హస్తం పారీ్టలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజా ప్రతినిధి కూడా పార్టీ మారేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో అభ్యర్థుల జాబితాను ముందస్తుగా ప్రకటించడం ద్వారా నష్ట నివారణ చర్యలు చేపట్డడం సులభం అమవుతుందని సీఎం భావిస్తున్నారు. 

బుజ్జగింపులు.. సాగనంపడాలు..

నియోజకవర్గాలు, గ్రామస్థాయి వరకు పార్టీల బలాబలాలు, ప్రభావం చూపే నేతలు, వారి గుణగణాలపై పూర్తిస్థాయి నివేదికలను బీఆర్‌ఎస్‌ సిద్ధ్దం చేసుకుంది. ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అసంతృప్త నేతలను బుజ్జగించడం, సాధ్యంకాని పక్షంలో సాగనంపడ ం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పారీ్టల్లోకి వెళ్లే అవకాశమున్న నేతల జాబితాను నిఘా సంస్థల నివేదికల ఆధారంగా కేసీఆర్‌ సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ‘‘ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు అన్ని పారీ్టల నుంచి పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలకు సంబంధించి కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. విపక్షాల ఎత్తుగడలను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నచోట వారిని మార్చి ఇతరులకు అవకాశం ఇచ్చే అంశంలో కేసీఆర్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంటారు’’ అని బీఆర్‌ఎస్‌ కీలక నేత ఒకరు పేర్కొన్నారు.

 లోక్‌సభ ఎన్నికలకూ సన్నద్ధమయ్యేలా.. 
ఈసారి లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారమున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తన వ్యూహానికి పదును పెడుతున్నారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లను కూడా కలుపుకొని కనీసం 50 లోక్‌సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్‌ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement