
ఒకే ఫ్లైట్‌లో ఇద్దరు నగర స్మగ్లర్లు!
2 కిలోల బంగారంతీసుకువచ్చిన వృద్ధురాలు
366 గ్రాములు తెచ్చిన మరో మహిళ
అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు ఒకే విమానంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు స్మగ్లర్లను బుధవారం రాత్రి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.70.98 లక్షలు విలువైన 2.366 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జెడ్డా నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఇద్దరు మహిళలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిలో ఒకరైన 60 ఏళ్ల వృద్ధురాలు విమానాశ్రయంలో అనుమానాస్పదంగా సంచ రించడాన్ని కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గుర్తించారు.
అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా... వస్త్రాల్లో దాచుకున్న రెండు కేజీల బంగారం బయటపడింది. వృద్ధురాలిని క్యారియర్‌గా వాడుకున్న సూత్రధారులు ఒక్కోటి కేజీ బరువున్న బిస్కెట్‌ను మూడేసి ముక్కలు చేసి జెడ్డాలో అప్పగించారని బయటపడింది. దీన్ని హైదరాబాద్ చేరిస్తే కొంత మొత్తం కమీషన్ ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్యారియర్ ఫొటోను వాట్సాప్ ద్వారా ఇక్కడున్న రిసీవర్లకు సూత్రధారులు పంపారు.
శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే తమ వాళ్లే వచ్చి బంగారం తీసుకుని నగదు చెల్లిస్తా రంటూ వృద్ధురాలికి చెప్పారు. ఈ రిసీవర్ల కోసం వెతుకుతున్న నేపథ్యంలోనే వృద్ధురాలు కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఇదే విమానంలో వచ్చిన మరో మహిళ సైతం తన దుస్తుల్లో 366 గ్రాముల బంగారం దాచుకుని వచ్చింది.
నగరానికే చెందిన ఈమెను సైతం అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ మహిళ వ్యక్తిగతంగానే బంగారం తీసుకు వస్తున్నట్లు అనుమా నిస్తున్నారు. వృద్ధురాలికి బంగారం ఇచ్చిన సూత్రధారులు, ఇక్కడ దాన్ని తీసుకునే రిసీవర్ల కోసం కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.