బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే ప్రత్యేక రైలులో ఎక్కేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భౌతిక దూరం పాటిస్తూ వేచి ఉన్న ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు ఎట్టకేలకు కదిలాయి. బుధవారం తొలిసారి 2 కరోనా స్పెషల్ రైళ్లు హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయి. బెంగళూర్ నుంచి ఢిల్లీకి వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (02691) ఉదయం 7.55 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. అలాగే ఢిల్లీ నుంచి బెంగళూర్‌కు వెళ్లే మరో సూపర్‌ఫాస్ట్ రైలు (02692) సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది.
రెండు రైళ్లు 10వ నంబర్ ప్లాట్‌ఫాం నుంచే రాకపోకలు సాగించాయి. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, ఇతర ఉన్నతాధికారులు రైళ్ల రాకపోకలను స్వయంగా పరిశీలించారు. ప్రయాణికుల సదుపాయం కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు ప్రయాణికుల రాకపోకల సందర్భంగా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించారు. ప్రయాణికులు దిగిన తర్వాతే ఎక్కేవారిని అనుమతించారు. ప్రయాణికుల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించారు. ఎక్కేవారికి, దిగేవారికి చేతులు శుభ్రం చేసుకొనేందుకు శానిటైజర్లు అందజేశారు.
(చదవండి: అలసట తెలీని వలస హీరోలు)
మాస్కులతో వచ్చిన వారినే స్టేషన్‌లోకి అనుమతించారు. థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఉదయం బెంగళూర్ నుంచి వచ్చిన రైలులో 240 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. మరో 204 మంది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూర్‌కు వెళ్లిన రైలులో 275 మంది ఇక్కడికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
మరో 455 మంది సికింద్రాబాద్ నుంచి బెంగళూర్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ రెండు రైళ్లు రోజూ రెగ్యులర్‌గా రాకపోకలు సాగించనున్నాయి. అలాగే ఈ నెల 17వ తేదీ ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరే రైలు ఆ మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకోనుంది. 20వ తేదీ సాయంత్రం మరో రైలు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి వెళ్లనుంది. ఈ రైలు వారానికి ఒకసారి ఢిల్లీ–సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించనుంది.
ప్రయాణికులు సంతృప్తి..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అధికారులు చేసిన ఏర్పాట్లపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేశారు. రైలులోనూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినంత భౌతిక దూరం పాటించామని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్‌లో భౌతిక దూరం పాటించేందుకు చేసిన ఏర్పాట్లతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పలువురు ప్రయాణికులతో మాట్లాడి వారి ప్రయాణం ఎలా సాగిందనే వివరాలతో పాటు, తాము చేపట్టిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
(చదవండి: లక్షణాల్లేని వారి నుంచే సంక్రమణ..)
బెంగళూరు–ఢిల్లీ రైలు నుంచి బుధవారం ఉదయం సికింద్రాబాద్‌లో దిగిన తనకు హోం క్వారంటైన్ ముద్ర వేసినట్లు చూపిస్తున్న మహిళ
Comments
Please login to add a commentAdd a comment