
ఈ.. అభాగ్యులను ఆదుకోరూ..
కిడ్నీలు చెడిపోవడంతో అనారోగ్యం
ఆపన్నహస్తం కోసం రెండు కుటుంబాలు ఎదురుచూపు
ఎంబీఏ చదివి మంచి ఉద్యోగం సాధించాలన్నది ఆమె సంకల్పం.. ఒకరోజు తరగతి గదిలోనే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలిస్తే ఆ కుటుంబానికి నమ్మశక్యం కాని నిజం బయటపడింది. రెండు కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు చెప్పడంతో నిశ్చేష్టులయ్యారు.. కూతురు కోసం ఆ తల్లిదండ్రులు ఉన్నదంతా ఊడ్చిపెట్టారు. ఇప్పుడు చిల్లిగవ్వలేదు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మరొకరిది బీద కుటుంబం. భర్త వికలాంగుడు..భార్యే కూలి పనిచేసి పోషిస్తోంది. ఉన్నట్టుండి ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఈ కుటుంబం కూడా ఆర్థికసాయం కోసం అర్థిస్తోంది.
నకిరేకల్: శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన దోనూరి కృష్ణారెడ్డి, సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఈ కుటుంబం పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఇంటికి పెద్దకుమార్తె అయిన స్పందన ప్రాథమిక దశ నుంచే చదువులో రాణిస్తూ ఉన్నత ఆశయాలతో ముందుకుసాగుతోంది. స్పందన పదవ తరగతి వరకు నకిరేకల్‌లోని సరస్వతి పాఠశాలలో పూర్తిచేసింది. ఆ తరువాత ఇంటర్ కాకతీయ,డిగ్రీ వాసవీ కళాశాలలో పూర్తి చేసింది. ఆ తరువాత ఎంబీఏ చదివి మంచి ఉద్యోగం సాధించి కన్నతల్లిదండ్రుల కష్టాలను తొలగించాలని అనుకుంది. బ్యాంక్ రుణంతో హైదరాబాద్‌లోని నోవా కళాశాలలో ఎంబీఏ కోర్సులో ప్రవేశం పొందింది.
పరీక్షలు రాస్తూనే..
2010 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల సమయంలో స్పందనకు తీవ్ర జ్వరం వచ్చింది. పరీక్షలు రాస్తూనే కళ్లు తిరిగి పడిపోయింది. తక్షణమే స్పందనను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎమర్జన్సీ కేస్ అని ఎవ్వరూ చేర్చుకోలేదు. చివరికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు అన్ని చేశాక స్పందన రెండు కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యులు ధ్రువీకరించారు.
ఉన్నదంత ఊడ్చినా..
పెద్ద కూతురు స్పందనకు రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో దోనూరి కృష్ణారెడ్డి సుజాత దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. కడుపుతీపి చంపుకోలేక తమకున్న రెండు ఎకరాల భూమిని విక్రయించి కుమార్తె వైద్య ఖర్చుల కోసం వినియోగించారు. అయినా చాలకపోవడంతో వ్యవసాయానికి ఆధారమైన ట్రాక్టర్‌ను కూడా తాకట్టు పెట్టారు. ఐదేళ్లుగా ఆరోగ్య శ్రీ పథకం కింద స్పందనకు డయాలసిస్ చేయిస్తున్నారు. కూతురు కోసం స్వగ్రామమైన వల్లాలను విడిచి నకిరేకల్‌లోనే నివాసం ఉంటూ రెండు రోజుకు ఒకసారి హైదరాబాద్‌కు తీసుకువెళ్లి డయాలసిస్ చేయిస్తూ బిడ్డను కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం రెండు కిడ్నీలు ఫెయిలైన స్పందనకు 26ఏళ్ల వయస్సు ఉండడంతో వయస్సు కూడా తక్కువగా ఉన్నందున డయాలసిస్ కాకుండా కిడ్నీ మార్పు చేయిస్తే ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్‌లు సలహా ఇచ్చారు. కిడ్నీ మార్పిడికి రూ.6లక్షల పైనే ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు.
నా కూతురిని కాపాడండి : సుజాత, స్పందన తల్లి
నా బిడ్డ సావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దాని బాధ చూడలేకపోతున్నాం. ఉన్నదంతా అమ్మినా జబ్బు నయం కాలే.. ఐదేళ్లుగా బిడ్డ బాధపడుతోంది.. మనవతాహృదయంతో దాతలు ముందుకొచ్చి సాయమందిస్తే వాళ్ల రుణం మర్చిపోము. నా కూతురు కన్న కలలను కూడా సాకారం చేయిస్తాం. మనసున్న మహరాజులు నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి.
ఆర్థికసాయం చేయాలనుకున్న వారు.. ఆర్థికసాయం చేయాలనుకున్న 9502210262 నంబర్‌కు సంప్రదించండి. బ్యాంక్ ద్వారా సహాయం అందించాలనుంటే ఎస్‌బీహెచ్ నకిరేకల్ అకౌంట్ నంబర్ 62092763532, ఐఎ స్‌బి కోడ్ ఎస్‌బీహెచ్‌వై 002018కి డబ్బులు పంపించొచ్చు.