బాలుడు మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు
నకిరేకల్: ఇంటి వద్ద ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపేశారు. గొంతు కోసి.. గోళ్లు పీకేసి.. పొట్టపై కాళ్లతో తొక్కి.. చేతులపై విచక్షణారహితంగా గాయాలు చేసి పొట్టనపెట్టుకున్నారు. తర్వాత మృతదేహాన్ని తీసుకొచ్చి బాలుడి ఇంటిపైనే పడేసి వెళ్లిపోయారు. ఈ దారుణమైన ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం వడ్డెర కాలనీ సమీపంలో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కుక్కడం గ్రామానికి చెందిన రాపోలు రమేశ్, వాణి దంపతులు నాలుగేళ్ల క్రితం నకిరేకల్ పట్టణానికి బతుకుదెరువు కోసం వచ్చారు.
స్థానిక మార్కెట్ రోడ్డులోని వడ్డెర కాలనీ ఎగువన నివసిస్తున్నారు. వీరికి సాత్విక్ (9), రుత్విక్ (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ స్థానిక ఏవీఎం టాలెంట్ స్కూల్‌లో చదువుతున్నారు. తల్లి స్థానిక బట్టల షాపులో పని చేస్తుండగా.. తండ్రి ఇంట్లోనే మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు రుత్విక్‌కు జ్వరం రావడంతో పెద్ద కుమారుడు సాత్విక్‌ను కూడా సోమవారం పాఠశాలకు పంపించలేదు. రోజూమాదిరిగానే తల్లి తాను పనిచేసే దుకాణానికి వెళ్లింది. తండ్రి మగ్గం నేస్తూ ఇంట్లోనే ఉన్నాడు.
ఆడుకుంటూ అదృశ్యం...
సాత్విక్, రుత్విక్‌తోపాటు చుట్టుపక్కల పిల్లలంతా కలసి ఇంటి బయట ఆడుకుంటున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో సాత్విక్ అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని రుత్విక్ తన తండ్రికి చెప్పడంతో అర్ధరాత్రి వరకు చుట్టుపక్కల అంతా గాలించారు. అయినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో రమేశ్ ఇంటి రేకులపై సాత్విక్ మృతదేహం ఉన్న విషయాన్ని పక్కింటికి చెందిన విజయ్‌కుమార్ గమనించి, ఆ విషయాన్ని బాలుడి తండ్రికి తెలిపాడు.
వెంటనే ఇంటి పైకి ఎక్కి కుమారుడి మృతదేహాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. చిత్రహింసలు పెట్టి తమ కుమారుడిని చంపారన్న సంగతి తెలిసి తల్లిదండ్రులిద్దరూ కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు బాలుడిని తీసుకెళ్లి కొట్టి చంపి, మృతదేహాన్ని తీసుకొచ్చి వారి ఇంటిపైనే పడేశారని సీఐ గౌరినాయుడు వెల్లడించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని అతడి తండ్రి చెబుతున్నార ని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బాలుడి మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment