వరంగల్ : అప్పుల బాధతో వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక గురువారం పురుగల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ యువరైతు సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మద్దూరు మండలంలోని నర్సాయపల్లికి చెందిన ఇర్రి గురువారెడ్డి(33) తనకున్న నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి,మొక్కజొన్న పంటలు సాగుచేశాడు. పంట పెట్టుబడులకు రూ3.80 లక్షల అప్పు చేశాడు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటలు సరిగా పండలేదు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చేర్యాల ఆస్పత్రికి తరలించగా... వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
అదేవిధంగా... స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఛాగల్లుకు చెందిన రైతు యాట చంద్రమౌళి(50) సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రమౌళికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. దానికి తోడు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. వాటిలో వేసిన పంటలు ఆశించిన మేర దిగుబడులు రాకపావడంతోపాటు కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు పెరిగిపోవడంతో మనోవేదనకు గురై పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్ధరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
Published Mon, May 11 2015 8:13 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement