
ఇన్‌సెట్లో మృతులు అమ్రేస్‌దాస్(ఫైల్), అన్వర్(ఫైల్)
కుత్బుల్లాపూర్: రక్షణ ప్రమాణాలు పాటించడం లేదని మూడుసార్లు మూతపడి మళ్లీ కార్యకలాపాలు సాగిస్తున్న జీడిమెట్ల పారిశ్రామికవాడలోని జీవిక లైఫ్ సైన్సెస్ లేబొరేటరీస్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం భారీ రియాక్టర్ పేలుడు సంభవించడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రియాక్టర్ పేలడంతో జరిగిన రసాయన చర్యతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ద్రావకాలు రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులపై పడటంతో బిహార్‌కు చెందిన అన్వర్(22) సజీవ దహనమయ్యాడు. తీవ్రంగా గాయపడిన అమ్రేష్‌దాస్(21)ను ఆటోట్రాలీలో ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి చెందాడు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న మరో నలుగురు కార్మికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కంపెనీలో ఎనిమిది రియాక్టర్లు ఉండగా సోమవారం ఒక్క రియాక్టర్‌తోనే ఉత్పత్తులు చేస్తున్నామని, ఆ సమయంలో ఈ ఘటన జరిగిందని కార్మికులు తెలిపారు.
ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అంబులెన్స్ ఆలస్యంగా వచ్చాయి. ప్రమాదం జరిగిన పరిశ్రమలోకి వెళ్లేందుకు పోలీసులు సాహసించలేదు. చుట్టుపక్కల పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులతోనే మృతదేహాలను వెలికి తీయించారు. స్థానికులు, కార్మికుల కథనం ప్రకారం... బిహార్ రాష్ట్రానికి చెందిన అమ్రేష్‌దాస్(21), అన్వర్(22) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి సుభాష్‌నగర్ డివిజన్ రాంరెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. అన్వర్ 8 నెలలు, అమ్రేష్‌దాస్ 3 నెలల నుంచి జీవిక పరిశ్రమలో పని చేస్తున్నారు. అన్వర్‌కు భార్య హదిషా బేగం, ఇద్దరు పిల్లలు ఉండగా, అమ్రేష్‌కు భార్య ఉంది. మృతదేహాలను తరలిస్తున్న సందర్భంలో బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. నష్ట పరిహారం కింద రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, పరిశ్రమ నిర్వాహకులు మాణిక్ రెడ్డి, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించారు.
ఆరు పరిశ్రమలు ధ్వంసం...
జీవిక పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమ పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దట్టమైన పొగలు అలముకోవడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రసాయనాల తీవ్రత దృష్ట్యా జీవిక పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న మరో ఆరు పరిశ్రమలు ధ్వంసమయ్యాయి. పరిశ్రమకు దూరంగా ఉన్న సాయిబాబానగర్‌లోని ఓ మూడంతస్తుల భవనం భూకంపం వచ్చినట్లు కొంచెం ఊగిందంటే ప్రమాద తీవ్రత ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీకి రెండు వైపులా ఉన్న రోడ్లలో రేకులు, గాజుగ్లాసుల శకలాలు చిందర వందరగా పడ్డాయి. ఫైర్ సేఫ్టీ, ఇతర అనుమతులు లేకపోవడంతో పాటు రసాయన కాలుష్యాన్ని వెదజల్లుతోందని ఈ పరిశ్రమను గతంలో మూడుసార్లు పీసీబీ అధికారులు సీజ్ చేశారు. 2015, 2017లో మౌనిక కెమికల్స్ పేరుతో నిర్వహించిన పరిశ్రమ మూతపడగా, 2018 నుంచి జీవిక పరిశ్రమగా పేరు మార్చి నడుపుతున్నారు. అయినా భద్రతాప్రమాణాలు పాటించని ఈ కంపెనీ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతోనే ఈ ఘటన జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment