qutubullapur
-
అభివృద్ధా.. అరాచకమా? తేల్చుకోండి
గతంలో బీజేపీ వాళ్లు అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పారు. ఎవరికైనా పడ్డాయా? ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల వరద సాయాన్ని అడ్డుకున్నోళ్లు రూ.25 వేలు ఇస్తామంటున్నారు. అమ్మకు అన్నం పెట్టనోళ్లు... చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారట.బీజేపీ నాయకులు ఏం చెప్పినా వినడానికి ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు, హుషార్ హైదరాబాద్.. ఆరేళ్లలో కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు కేంద్రం నుంచి ఎంత డబ్బు తెచ్చారో చెప్పాలి. ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు.కులం, మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా అంతా కలిసిమెలిసి ఉంటున్నాం. ఇప్పుడు నాలుగు ఓట్ల కోసం విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాక్షి, కూకట్పల్లి (హైదరాబాద్) : టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగ రం ముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. విద్వేషాల వలలో పడకుండా... సిటీజనులు అభివృద్ధిని చూసి గ్రేటర్లో టీఆర్ఎస్కు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. కూకట్పల్లి నుండి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఆయన శనివారం శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్‌లలో నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొన్నారు. పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఆరేళ్లలో హైదరాబాద్ నగరం ఎంతో ప్రశాంతతతో ఉందని, ఈ ప్రశాంతతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని చెప్పారు. కులం, మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుం డా నగర ప్రజలందరం కలిసిమెలిసి ఉంటు న్నామన్నారు. ఇలాంటి ప్రశాంతమైన వాతా వరణాన్ని చెడగొట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మొన్న కరోనా వచ్చినా, నిన్న వరదలు వచ్చి నా ప్రజల వెంట ఉన్నది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేననే విషయం ప్రజలకు తెలుసన్నారు. వరదలతో ఇబ్బందిపడిన పేదలకు ప్రభు త్వం చేస్తున్న వరదసాయాన్ని ఆపింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఎన్ని కల్లో గెలిస్తే రూ.25 వేలు ఇస్తామని కొంతమంది ప్రజల్ని మభ్యపెడుతున్నారని, అంతేకాదు చలాన్లు కడతాం, అందిస్తాం, ఇదిస్తాం అంటూ తలాతోక లేకుండా మాట్లాడుతున్నా రని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అందజేసిన రూ. 10 వేల వరద సహాయాన్ని అడ్డుకున్నవాళ్లు రూ. 25 వేలు ఇస్తామని చెప్పడం... అమ్మకు అన్నం పెట్టనోళ్లు చిన్నమ్మకు బంగా రు గాజులు చేయిస్తామన్నట్లుగా ఉందన్నారు. మరో వైపు కారు పోతే కారు.. బైకు పోతే బైకు ఇస్తామంటూ వస్తారని, వాటిని ఏమాత్రం నమ్మవద్దన్నారు. గతంలో అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, ఎవరి అకౌంట్లోనైనా పడ్డాయా? అని ప్రశ్నించారు. ‘మీరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మడానికి ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు, హుషార్ హైదరాబాద్’అని గుర్తుపెట్టుకోవాలని బీజే పీని ఉద్దేశించి అన్నారు. ఈ ఆరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి అన్నపూర్ణ పథకం, బస్తీ దవాఖానాలు, శివార్లకు మంచినీటి సదుపాయం, నిరంతర కరెంటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయన్నారు. రూ. 67 వేల కోట్లతో వంద ల కొద్దీ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఆరేళ్లలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు కేంద్రం నుంచి ఎంత డబ్బు తెచ్చారో చెప్పాలన్నారు. ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లడుగుతున్నారని నిలదీశారు. ఇప్పుడు కరెంటు పోతే వార్త... ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనేక రంగాల్లో హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. యాపిల్, అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని, నగరంలో ఉన్న ప్రశాంతత, శాంతిభద్రతలే అందుకు కారణమని చెప్పారు. ఈ ఆరేళ్లలో నగరంలో 67 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు 14 రోజులకోమారు నీరు వచ్చే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజూ, రెండురోజులకోమారు నీటిని ఇచ్చే పరిస్థితికి చేరుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నారు. నగరంలో గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు, పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ పథకం, వీధివీధికి సీసీ కెమెరాలు, సీసీ రోడ్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్.... ఇలా వందల కార్యక్రమాలు ఈ ఆరేళ్ల కాలంలో చేశామన్నారు. అందరినీ అక్కున చేర్చుకునే తల్లి లాంటి హైదరాబాద్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని, నగరం నాశనమైతే మొత్తం తెలంగాణకే దెబ్బ అన్నారు. అభివృద్ధిని చూసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు సురేందర్, కోనేరు కోనప్ప, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, రేఖానాయక్, జోగు రామన్న, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్, బాలమల్లు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. అభివృద్ధా.. అరాచకమా? తేల్చుకోండి పచ్చగా ఉన్న హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అలాంటి అరాచక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇండియా– పాకిస్తాన్. హిందూ– ముస్లిం అంటూ విద్వేషాలు రెచ్చగొట్టి నాలుగు ఓట్లు రాల్చుకోవడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను నగర ప్రజలు గమనించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లో మరెక్కడా ఆలయాలే లేవన్నట్లుగా పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడంలోనే వారి అసలు ఉద్దేశం అర్థమవుతోందన్నారు. హైదరాబాద్ నగరాన్ని నరకం చేయాలని చూస్తున్న వ్యక్తుల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ రకమైన హైదరాబాద్ ఉంటే మన పిల్లాపాపలు ప్రశాంతంగా ఉంటారో, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ప్రజలు ఆలోచించాలన్నారు. అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. -
రియాక్టర్ పేలి ఇద్దరు మృతి
కుత్బుల్లాపూర్: రక్షణ ప్రమాణాలు పాటించడం లేదని మూడుసార్లు మూతపడి మళ్లీ కార్యకలాపాలు సాగిస్తున్న జీడిమెట్ల పారిశ్రామికవాడలోని జీవిక లైఫ్ సైన్సెస్ లేబొరేటరీస్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం భారీ రియాక్టర్ పేలుడు సంభవించడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రియాక్టర్ పేలడంతో జరిగిన రసాయన చర్యతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ద్రావకాలు రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులపై పడటంతో బిహార్‌కు చెందిన అన్వర్(22) సజీవ దహనమయ్యాడు. తీవ్రంగా గాయపడిన అమ్రేష్‌దాస్(21)ను ఆటోట్రాలీలో ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి చెందాడు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న మరో నలుగురు కార్మికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కంపెనీలో ఎనిమిది రియాక్టర్లు ఉండగా సోమవారం ఒక్క రియాక్టర్‌తోనే ఉత్పత్తులు చేస్తున్నామని, ఆ సమయంలో ఈ ఘటన జరిగిందని కార్మికులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అంబులెన్స్ ఆలస్యంగా వచ్చాయి. ప్రమాదం జరిగిన పరిశ్రమలోకి వెళ్లేందుకు పోలీసులు సాహసించలేదు. చుట్టుపక్కల పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులతోనే మృతదేహాలను వెలికి తీయించారు. స్థానికులు, కార్మికుల కథనం ప్రకారం... బిహార్ రాష్ట్రానికి చెందిన అమ్రేష్‌దాస్(21), అన్వర్(22) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి సుభాష్‌నగర్ డివిజన్ రాంరెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. అన్వర్ 8 నెలలు, అమ్రేష్‌దాస్ 3 నెలల నుంచి జీవిక పరిశ్రమలో పని చేస్తున్నారు. అన్వర్‌కు భార్య హదిషా బేగం, ఇద్దరు పిల్లలు ఉండగా, అమ్రేష్‌కు భార్య ఉంది. మృతదేహాలను తరలిస్తున్న సందర్భంలో బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. నష్ట పరిహారం కింద రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, పరిశ్రమ నిర్వాహకులు మాణిక్ రెడ్డి, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించారు. ఆరు పరిశ్రమలు ధ్వంసం... జీవిక పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమ పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దట్టమైన పొగలు అలముకోవడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రసాయనాల తీవ్రత దృష్ట్యా జీవిక పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న మరో ఆరు పరిశ్రమలు ధ్వంసమయ్యాయి. పరిశ్రమకు దూరంగా ఉన్న సాయిబాబానగర్‌లోని ఓ మూడంతస్తుల భవనం భూకంపం వచ్చినట్లు కొంచెం ఊగిందంటే ప్రమాద తీవ్రత ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీకి రెండు వైపులా ఉన్న రోడ్లలో రేకులు, గాజుగ్లాసుల శకలాలు చిందర వందరగా పడ్డాయి. ఫైర్ సేఫ్టీ, ఇతర అనుమతులు లేకపోవడంతో పాటు రసాయన కాలుష్యాన్ని వెదజల్లుతోందని ఈ పరిశ్రమను గతంలో మూడుసార్లు పీసీబీ అధికారులు సీజ్ చేశారు. 2015, 2017లో మౌనిక కెమికల్స్ పేరుతో నిర్వహించిన పరిశ్రమ మూతపడగా, 2018 నుంచి జీవిక పరిశ్రమగా పేరు మార్చి నడుపుతున్నారు. అయినా భద్రతాప్రమాణాలు పాటించని ఈ కంపెనీ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతోనే ఈ ఘటన జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. -
ఎమ్మెల్యే ఇల్లు కూల్చేయాల్సిందే: హైకోర్టు
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు చెందిన భవనాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. తగినంత సెట్బ్యాక్లతో జి+1 నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని.. 4 అంతస్తులు కట్టడంతో దాన్ని కూల్చేయాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. భవనాల్లో ఉన్నవాళ్లు మూడు నెలల్లో ఖాళీ చేయాలని, 6 నెలల్లోగా కూల్చివేత ప్రక్రియ మొత్తం పూర్తికావాలని హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 79 నుంచి 82 వరకు గల స్థలంలో జీహెచ్ఎంసీ నుంచి తీసుకున్న అనుమతి ప్లాన్‌ను ఉల్లంఘిస్తూ భారీ వాణిజ్య సముదాయాలను నిర్మించారని, దీనిపై ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారంటూ వివేక్ సమీప బంధువు కె.ఎం.ప్రతాప్ గతేడాది ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి.. వాటిని అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చేయాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌చేస్తూ వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆ భవనంలో ఉన్న నారాయణ కాలేజీ యాజమాన్యం ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. చివరకు ధర్మాసనం కూడా సింగిల్ జడ్జి తీర్పునే సమర్థిస్తూ.. భవనాలను కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. -
కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యేపై పీఎస్‌లో ఫిర్యాదు
-
ప్యూర్ లెదర్
ఇవి అచ్చంగా తోలుబొమ్మలేనండోయ్..! అలాగని.. నాలుగు దిక్కుల నడిమి సంతలో.. నాట్యం చేసే బొమ్మలు కావు. ప్యూర్ లెదర్‌తో రూపొందించిన అందమైన బొమ్మలు. చల్ చల్మనే చలాకి గుర్రాలు.. తెల్లని కొమ్ముల నల్లని ఏనుగులు.. చెంగు చెంగున దూకే హరిణాలు.. ఇలా ఎన్నో బొమ్మలు కుత్బుల్లాపూర్ సుచిత్ర రహదారిలో క నువిందు చేస్తున్నాయి. జీవకళ ఉట్టిపడుతున్న ఈ బొమ్మలను చూడగానే ఆ దారిన వెళ్తున్న బాటసారులు కన్నార్పకుండా చూడటమే కాదు.. కాసులు చెల్లించి సొంతం చేసుకుంటున్నారు. ఇక చిన్నపిల్లలైతే.. తల్లిదండ్రులను సతాయించి మరీ వాటిని సాధిస్తున్నారు. రూ.150 నుంచి రూ.350 వరకూ పలుకుతున్న ఈ బొమ్మలు కింద పడ్డా పగలకపోవడం వీటి అదనపు ఆకర్షణ. -
సిటీకి సలామ్ చేస్తున్న బీహారీలు
జిందగీ దియా! నాగరికత మానవుడిని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. కష్టాల్లోనే మనిషి అనే ్వషణ మొదలవుతుంది. బతుకుతెరువు దూరమైనపుడు కొత్త దారి వెతుక్కోవాల్సిందే. బీమారీ రాజ్యం నుంచి దశాబ్దాల కిందట బీహారీలు హైదరాబాద్‌కు వలస వచ్చారు. భాగ్య నగరంలో బతుకుభాగ్యం పొందారు. భిన్న సంస్కృతుల పూదోటలో కొత్తకుసుమాలయ్యారు. తరతరాలుగా ఇక్కడి గాలి పీలుస్తూ.. హైదరాబాదీలయ్యారు. బీహార్ అంటేనే వెనుకబాటుతనం గుర్తుకొస్తుంది. అభివృద్ధి ఆనవాళ్లయినా కనిపించని ఊళ్లు గుర్తుకొస్తాయి. అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితుల్లో సజావుగా సాగు చేయలేక, బతుకు సాగక సతమతమయ్యే రైతులు గుర్తుకొస్తారు. దశాబ్దాల కిందట కరువు ఛాయలు కమ్మిన వేళ.. ఉపాధి లేక చాలామంది బీహారీలు వలసబాట పట్టారు. వారిలో కొందరు పొట్ట చేత పట్టుకుని భాగ్యనగరానికి చేరుకున్నారు. నగరం వారికి నిలువనీడనిచ్చింది. తమకు జీవితాన్నిచ్చిన నగరంతో ఇక్కడి బీహారీలూ అనుబంధాన్ని పెనవేసుకున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్లోని జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న సుభాష్‌నగర్, అయోధ్యనగర్, వినాయక్‌నగర్ ప్రాంతాల్లో బీహారీలు ఎక్కువగా ఉంటున్నారు. మొదటితరంలో వలస వచ్చిన వారి పిల్లలకు ఇక్కడే పెళ్లిళ్లు జరిగాయి. వారి పిల్లల చదువుసంధ్యలు ఇక్కడే సాగుతున్నాయి. ఇక్కడే పుట్టిపెరుగుతున్న బీహారీల పిల్లలు తమ మాతృభాష భోజ్‌పురితో సమానంగా పక్కా దక్కనీ భాష కూడా మాట్లాడతారు. ఛఠ్ పూజ ప్రత్యేకం దశాబ్దాలుగా నగరంలో స్థిరపడినా, బీహారీలు తమ సంప్రదాయాలను మాత్రం తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బీహారీల ప్రధాన పర్వదినం ‘ఛఠ్‌పూజ’. కార్తీక శుక్ల షష్ఠిరోజున.. అంటే, దీపావళి వెళ్లిన ఆరో రోజు ఈ పండుగ జరుపుకుంటారు. సూర్యుడికి చెల్లెలయిన ఛఠ్‌మాతకు పూజించి, సూర్యాస్తమయ సమయంలో చెరువులోకి దిగి, సూర్యుడికి నమస్కరించి కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. మరునాడు వేకువ జామున నాలుగు గంటలకు చెరువు వద్దకు చేరుకుని, అక్కడ పూజలు చేసి, సూర్యోదయం తర్వాత సూర్యుడికి నైవేద్యం సమర్పిచి దీక్ష విరమిస్తారు. పురాణకాలంలో సీత, కుంతి, ద్రౌపది తదితరులు ఈ పూజ చేసినట్లు చెబుతారు. బీహారీలు జరుపుకొనే మరో ముఖ్యమైన పండుగ ‘తీజ్’. వివాహిత మహిళలు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఈ పూజలు చేస్తారు. రాత్రివేళల్లోనే పెళ్లిళ్లు.. బీహారీల పెళ్లిళ్లు రాత్రిపూట మాత్రమే జరుగుతాయి. పగటివేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు. అమ్మాయి ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది. ఎదుర్కోళ్ల తర్వాత అబ్బాయిని పెళ్లిపందిరికి తీసుకొస్తారు. సంపన్నులు ఐదురోజులు ఘనంగా జరుపుకుంటారు. పేదలు కూడా మూడు రోజులు పెళ్లివేడుక జరుపుకుంటారు.పెళ్లి కాగానే అమ్మాయిని తీసుకువెళ్లిపోతారు. మరునాడు మంచిరోజైతే అమ్మాయిని తిరిగి పుట్టింటికి తీసుకువస్తారు. పెళ్లికి ముందు కుండలో మట్టిపోసి, గోధుమ గింజలు విత్తుతారు. మూడు నుంచి ఐదు రోజుల్లో ఇవి మొలకెత్తుతాయి. ఇవి మొలకెత్తే సరికి పెళ్లి తంతు పూర్తవుతుంది.