
సిటీకి సలామ్ చేస్తున్న బీహారీలు
జిందగీ దియా!
నాగరికత మానవుడిని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. కష్టాల్లోనే మనిషి అనే ్వషణ మొదలవుతుంది. బతుకుతెరువు దూరమైనపుడు కొత్త దారి వెతుక్కోవాల్సిందే. బీమారీ రాజ్యం నుంచి దశాబ్దాల కిందట బీహారీలు హైదరాబాద్‌కు వలస వచ్చారు. భాగ్య నగరంలో బతుకుభాగ్యం పొందారు. భిన్న సంస్కృతుల పూదోటలో కొత్తకుసుమాలయ్యారు. తరతరాలుగా ఇక్కడి గాలి పీలుస్తూ.. హైదరాబాదీలయ్యారు.
బీహార్ అంటేనే వెనుకబాటుతనం గుర్తుకొస్తుంది. అభివృద్ధి ఆనవాళ్లయినా కనిపించని ఊళ్లు గుర్తుకొస్తాయి. అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితుల్లో సజావుగా సాగు చేయలేక, బతుకు సాగక సతమతమయ్యే రైతులు గుర్తుకొస్తారు. దశాబ్దాల కిందట కరువు ఛాయలు కమ్మిన వేళ.. ఉపాధి లేక చాలామంది బీహారీలు వలసబాట పట్టారు. వారిలో కొందరు పొట్ట చేత పట్టుకుని భాగ్యనగరానికి చేరుకున్నారు. నగరం వారికి నిలువనీడనిచ్చింది. తమకు జీవితాన్నిచ్చిన నగరంతో ఇక్కడి బీహారీలూ అనుబంధాన్ని పెనవేసుకున్నారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న సుభాష్‌నగర్, అయోధ్యనగర్, వినాయక్‌నగర్ ప్రాంతాల్లో బీహారీలు ఎక్కువగా ఉంటున్నారు. మొదటితరంలో వలస వచ్చిన వారి పిల్లలకు ఇక్కడే పెళ్లిళ్లు జరిగాయి. వారి పిల్లల చదువుసంధ్యలు ఇక్కడే సాగుతున్నాయి. ఇక్కడే పుట్టిపెరుగుతున్న బీహారీల పిల్లలు తమ మాతృభాష భోజ్‌పురితో సమానంగా పక్కా దక్కనీ భాష కూడా మాట్లాడతారు.
ఛఠ్ పూజ ప్రత్యేకం
దశాబ్దాలుగా నగరంలో స్థిరపడినా, బీహారీలు తమ సంప్రదాయాలను మాత్రం తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బీహారీల ప్రధాన పర్వదినం ‘ఛఠ్‌పూజ’. కార్తీక శుక్ల షష్ఠిరోజున.. అంటే, దీపావళి వెళ్లిన ఆరో రోజు ఈ పండుగ జరుపుకుంటారు. సూర్యుడికి చెల్లెలయిన ఛఠ్‌మాతకు పూజించి, సూర్యాస్తమయ సమయంలో చెరువులోకి దిగి, సూర్యుడికి నమస్కరించి కఠోర ఉపవాస దీక్ష చేపడతారు.
మరునాడు వేకువ జామున నాలుగు గంటలకు చెరువు వద్దకు చేరుకుని, అక్కడ పూజలు చేసి, సూర్యోదయం తర్వాత సూర్యుడికి నైవేద్యం సమర్పిచి దీక్ష విరమిస్తారు. పురాణకాలంలో సీత, కుంతి, ద్రౌపది తదితరులు ఈ పూజ చేసినట్లు చెబుతారు. బీహారీలు జరుపుకొనే మరో ముఖ్యమైన పండుగ ‘తీజ్’. వివాహిత మహిళలు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఈ పూజలు చేస్తారు.
రాత్రివేళల్లోనే పెళ్లిళ్లు..
బీహారీల పెళ్లిళ్లు రాత్రిపూట మాత్రమే జరుగుతాయి. పగటివేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు. అమ్మాయి ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది. ఎదుర్కోళ్ల తర్వాత అబ్బాయిని పెళ్లిపందిరికి తీసుకొస్తారు. సంపన్నులు ఐదురోజులు ఘనంగా జరుపుకుంటారు. పేదలు కూడా మూడు రోజులు పెళ్లివేడుక జరుపుకుంటారు.పెళ్లి కాగానే అమ్మాయిని తీసుకువెళ్లిపోతారు. మరునాడు మంచిరోజైతే అమ్మాయిని తిరిగి పుట్టింటికి తీసుకువస్తారు. పెళ్లికి ముందు కుండలో మట్టిపోసి, గోధుమ గింజలు విత్తుతారు. మూడు నుంచి ఐదు రోజుల్లో ఇవి మొలకెత్తుతాయి. ఇవి మొలకెత్తే సరికి పెళ్లి తంతు పూర్తవుతుంది.