
మద్యం మత్తులో పాట పాడాడంటూ జైల్లో పెడితే.. మట్టిలో మాణిక్యం అంటూ..
వైరల్: ఊచల వెనుక పాడిన పాటను పోలీసు వాళ్లే చిత్రీకరించారు. అతని మధుర గాత్రానికి ఫిదా అయ్యి వైరల్ చేశారు. కటకటాల వెనుక పాడిన పాటకు ఇంటర్నెట్ ఫిదా అయ్యింది. ఆ వ్యక్తి మరింత ఫేమస్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక.. తన పాట ఫేమస్ కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడతను. దానికి కొనసాగింపుగానూ అతనికి ప్రభుత్వ సాయం ప్రకటనతో పాటు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
బిహార్‌లోని కైమూర్ దహ్రక్ గ్రామానికి చెందిన కన్హయ్యరాజ్‌ను.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో బక్సర్ పోలీసులు అరెస్టు చేశారు. యూపీ నుంచి తాగొచ్చాడని(బీహార్‌లో మద్యపాన నిషేధం అమలు ఉండడంతో) పోలీసులు అతని ఆ రాత్రి జైల్లో ఉంచారు. అయితే ఆ పూట జైలు శిక్ష అతని జీవితాన్ని మార్చేసింది. ఉదయం విడుదలై బయటకు వచ్చిన కన్హయ్యను.. ఆ తర్వాత అంతా కొత్తగా చూడడం మొదలుపెట్టారు. అతని పాట ఫేమస్ అయ్యిందని వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లలో చక్కర్లు కొడుతోందని స్నేహితులు చెప్పారు. దీంతో తన గొంతు విన్న కన్హయ్య తెగ ఖుష్ అయ్యాడు. అయితే..
మద్యం సేవించినందుకు తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, పవన్ సింగ్(భోజ్‌పురి హీరో) పాట పాడినందుకు.. ఆ పాటలో ఒక పదం అభ్యంతకరంగా ఉందని ఆ హీరో ఫ్యాన్ ఫిర్యాదు చేసినందుకే తనను అరెస్ట్ చేశారని కన్హయ్య చెప్తున్నాడు. కానీ, ఆ వీడియోను తాను అప్పుడే డిలీట్ చేశానని వివరణ ఇచ్చాడతను. ఇక ఆ రాత్రి జైల్లో గడిపిన తాను సరదాగా పాట పాడనని, అది ఎవరు వీడియో తీశారు, ఎలా వైరల్ అయ్యిందో కూడా తనకు తెలియదని అంటున్నాడతను.
ఆర్థిక కష్టాలతో చిన్నతనంలోనే చదువుకు తాను దూరం అయ్యానని, రిపబ్లిక్‌డే, ఇతర ఫంక్షన్‌లకు పాటలు కూడా పాడతానని చెప్తున్నాడు కన్హయ్య. ఇక జైలు వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ అంకిత్ తివారీ తన మ్యూజిక్ ఆల్బమ్‌లో పాడేందుకు కన్హయ్యకు అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి మట్టిలో మాణిక్యాలను రాటు దేల్చాల్సిన అవసరం ఉందని, అతని కుటుంబానికి అవసరమయ్యే సాయం అందిస్తామని ప్రకటించడం గమనార్హం. తనలో దాగున్న ప్రతిభ నలుగురికి తెలియడం, దాని ద్వారా తన కుటుంబ పరిస్థితిని మార్చుకునే అవకాశం దొరికినందుకు ఆ దేవుడికి, తనను వైరల్ చేసినవాళ్లకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడతను.
नशा एक सामाजिक बुराई है और सिर्फ कला में शक्ति है इस बुराई को हराने की ।@shalabhmani जी मैं इस व्यक्ति को अपनी म्यूजिक कंपनी @MistMusic_ की तरफ से एक गाना गाने का मौका देता हूं । 🙏 https://t.co/qug7cto5Rp
— Ankit Tiwari (@officiallyAnkit) January 9, 2023