![తెలంగాణ ఎంసెట్ మెడికల్ లీకు వీరుల అరెస్టు](/styles/webp/s3/article_images/2017/09/5/51492607186_625x300.jpg.webp?itok=lcl0z54m)
తెలంగాణ ఎంసెట్ మెడికల్ లీకు వీరుల అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తెలంగాణ ఎంసెట్-2 (2016) మెడికల్ పేపర్ల లీకేజి కేసులో ప్రధాన సూత్రధారులు శివబహదూర్ సింగ్, అనూప్ కుమార్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో అరెస్టు చేసిన వీళ్లిద్దరినీ ట్రాన్సిట్ వారంటు మీద హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలంగాణ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్‌బీ సింగ్ అలియాస్ పండిట్ ప్రధాన సూత్రధారి. తనకున్న పరిచయాలతో అతడు తెలంగాణ ఎంసెట్ మెడికల్ పేపర్‌ను బయటకు తీసుకొచ్చాడు.
2005 నుంచి అతడు ఈ తరహాలో వివిధ పేపర్లు లీక్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు లక్నోలో రైల్వే గ్రూప్-డి పేపర్ లీకేజి కేసు, 2008లో అలహాబాద్‌లో రైల్వే డ్రైవర్స్ పరీక్ష పేపర్ లీకేజి కేసు, 2015లో పంజాబ్‌లో టీఈటీ పరీక్ష లీకేజి కేసు, పీఎస్‌సీ పరీక్ష లీకేజికి సంబంధించి రెండు కేసులు, 2015లోనే జమ్ము కశ్మీర్ టీచర్ల ప్రవేశపరీక్ష లీకేజి కేసు, కోల్ ఇండియా కేసు, మహారాష్ట్రలో వార్ధా మెడికల్ కాలేజి పేపర్ లీకేజి కేసు, చండీగఢ్ టీచర్ల ప్రవేశ పరీక్ష కేసు, కోల్‌కతా టీఈటీ పరీక్ష పేపర్ లీకేజి కేసు, 2016 డిసెంబర్‌లో డీఎంఆర్‌సీ పరీక్ష పేపర్ లీకేజి కేసు, చివరగా 2016లో తెలంగాణ మెడికల్ ప్రవేశపరీక్ష పేపర్ లీకేజి కేసు ఇతడి మీద ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాలలో అనూప్ కుమార్ సింగ్ ఇతడికి సహాయకుడిగా ఉండేవాడని పోలీసులు తెలిపారు.