తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్‌లకు పాజిటివ్‌ | Two More IPS officers test positive for Covid-19 in Telangana | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకూ పాజిటివ్‌ 

Published Sat, Jun 20 2020 11:25 AM | Last Updated on Sat, Jun 20 2020 1:55 PM

Two More IPS officers test positive for Covid-19 in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పోలీసు విభాగంలో ఇప్పటి వరకు కింది స్థాయి సిబ్బందినే చుట్టేస్తున్న కరోనా వైరస్‌ ఉన్నతాధికారులకూ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఓ ఐపీఎస్‌ అధికారి వైరస్‌ బారినపడగా తాజాగా మరో ఇద్దరు ఐపీఎస్‌లకు పాజిటివ్‌ వచ్చింది. వీరు నగరం కేంద్రంగా పని చేస్తున్న వారే కావడం గమనార్హం. ఈ పరిణామంతో ఆయా అధికారుల వద్ద పని చేసిన, చేస్తున్న గన్‌మెన్‌లు, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది) 

అలాగే మహిళా ఐపీఎస్‌ ఉన్నతాధికారి కూడా కరోనా బారినపడ్డారు. మరోవైపు డీజీపీ కార్యాలయంలో సైతం ఉద్యోగికి కరోనా సోకింది. తన వద్ద పనిచేసే సహాయకుడికి కూడా పాజిటివ్‌ రావడంతో అడిషనల్‌ డీజీ స్థాయి అధికారి ఒకరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ఒక్క బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని హోమ్‌ ఐసోలేషన్‌కు తరలించారు. (ఒక్క రోజులోనే 14,516 కరోనా కేసులు)

19 రోజులు.. 3026 పాజిటివ్‌ కేసులు 
ఇటీవల రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు గ్రేటర్‌ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ..అక్కడ..వీరు..వారు అనే తేడా లేకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగి స్తుంది. గురువారం 302 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. శుక్రవారం రికార్డు స్థాయిలో 329 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా గ్రేటర్‌లో ఈ నెలలో ఇప్పటి వరకు 3026 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 116 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇప్పటికే ఓ ఉద్యోగికి పాజిటివ్‌ రాగా...తాజాగా జిల్లా అధికారికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం. (విధుల విభజనతో కరోనాపై యుద్ధం)

గాంధీ సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ మృతి 
గాంధీ ఆస్పత్రి :  కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ ఆస్పత్రి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. జనగాం జిల్లా, బచ్చన్నపేటకు చెందిన బాలరాజు (55) మల్లాపూర్‌లో ఉంటూ ఎజిల్‌ సెక్యూరిటీ సంస్థ తరుపున  గాంధీ ఆస్పత్రిలో  సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల  క్రితం అస్వస్థతకు గురైన బాలరాజు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా కరోనా లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఈనెల 17న రాత్రి ఆస్పత్రిలో చేరిన అతను ఐసీయులో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం  మృతి చెందాడు. (మూడు నెలలుగా గాంధీలోనే తిండి.. ఠికానా..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement