ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి! | Udaya Samudram Lift Irrigation Scheme Delayed Due To Land Acquisition Problem At Nalgonda | Sakshi
Sakshi News home page

ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి!

Published Tue, Aug 27 2019 10:38 AM | Last Updated on Tue, Aug 27 2019 10:38 AM

Udaya Samudram Lift Irrigation Scheme Delayed Due To Land Acquisition Problem At Nalgonda - Sakshi

ఉదయసముద్రం ఎత్తిపోతల పథకంలో నిర్మాణంలో ఉన్న  పంప్‌ హౌజ్‌

సాక్షి, నల్లగొండ: ఉదయ సముద్ర ఎత్తిపోతల పథకంలో దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని చెబుతున్నా ఇంకా.. టన్నెల్‌ లైనింగ్, కాల్వలు, డిస్టిబ్యూటరీల నిర్మాణంలో పెండింగ్‌ పనులు, పంప్‌ హౌజ్‌ యాగ్జిలరీ పనులు పూర్తి కావాల్సి ఉంది. భూ సేకరణకు రూ.250 కోట్లు, అదే మాదిరిగా, మరో రూ.200 కోట్లు వివిధ పనులు, ప్రైస్‌ ఎస్కలేషన్‌ తదితరాలకు కలిపి మొత్తంగా రూ.450 కోట్లు ఇస్తే కానీ ఈ ఎత్తిపోతల పథకం ముందర పడేలా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వాస్తవాలు, గణాంకాల ఆధారంగానే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ పాదయాత్ర చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

రాజకీయ అంశంగా మారిన  ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులు గడిచిన పదకొండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టును మంజూరు చేసిన నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వయంగా శంకుస్థాపన చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ద్వారా కృష్ణా జలాలను తీసుకు వచ్చి నల్లగొండ పట్టణ సమీపంలోని ఉదయసముద్రంలో నింపడం.. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌కు (మధ్యంలో కొంత సొరంగం) చేర్చి అక్కడినుంచి కుడి, ఎడమ మేజర్‌ కాల్వల ద్వారా ఆరుతడి పంటల కోసం లక్ష ఎకరాలకు సాగునీరు అందివ్వడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. కానీ, పదకొండేళ్లు గడిచిపోతున్నా పనులు తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉంది.

ఇప్పటికే పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయని, టన్నెల్‌ లైనింగ్‌ పని ఒక్కటే పెండింగ్‌లో ఉందని, అది పూర్తి కావడానికి మరో పదకొండు నెలలు పడుతుందని, ఆ తర్వాతే ప్రాజెక్టుకు నీరిస్తామని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం శీత కన్నేసిందని, రైతులకు ఎంతగానో ఉపయోగపడే దీనిని పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుం దనే నిధులు ఇవ్వడం లేదని ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనే ప్రాజెక్టుకు ఎక్కువ నిధులు కేటాయిం చామని అధికార పార్టీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతివిమర్శల మాటెల్లా ఉన్నా.. ఉదయ సముంద్రం ఎత్తి పోతల పథకం పనులు నత్తనకడక సాగడానికి వాస్తవ కారణాలు వేరేగా ఉండడం విశేషం

పూర్తి కాని భూసేకరణ.. రూ.250కోట్లు అవసరం
ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి, కాల్వ లు, డిస్టిబ్యూటరీల కోసం మొత్తంగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి మొత్తంగా 3,880 ఎకరాలు అవసరమని నివేదికలు చెబుతున్నాయి. కానీ, ఇప్పటిదాకా గడిచిన పదకొండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి మాత్రం 1,379 ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. నిధుల కొరత వల్లే భూ సేకరణ పనులు ముందుకు సాగడం లేదని చెబుతున్నారు. గతంలో సేకరించిన భూమికి ఇంకా పూర్తిస్థాయిలో నష్టపరిహారం కూడా చెల్లించలేదని సమాచారం. భూ సేకరణ కోసం రూ.35 కోట్లు అత్యవసరంగా కావాలని అధికారులు నివేదికలు పంపగా, ఈ ఏడాది జనవరినుంచి ఆర్థికశాఖ క్లియరెన్స్‌ కోసం వారి వద్దే పెండింగులో పడిపోయిందంటున్నారు. మరో రూ.35 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, లేదంటే పనులు చేయలేమని కాంట్రాక్టు ఏజెన్సీ నెత్తినోరు కొట్టుకుంటున్నా ఆర్థికశాఖ నుంచి ఎలాంటి చలనమూ లేదని విమర్శలు వస్తున్నాయి.

కాంట్రాక్టు ఏజెన్సీకి ఇవ్వాల్సిన రూ.35కోట్లు బిల్లుల ఫైల్‌  2018 అక్టోబర్‌నుంచి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ వద్ద క్లియరెన్స్‌ కోసం ఎదురు చూస్తున్నాయని సమాచారం. పెండింగ్‌ బిల్లులు చెల్లించనిదే పనులు చేయలేమని చేతులు ఎత్తేసిన కాంట్రాక్టు సంస్థను ఒప్పించే మార్గమే కనిపించడం లేదని, పనులు ముందుకు సాగాలంటే అత్యవసరంగా రూ.70 కోట్లు నిధులు అవసరమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇవి కాకుండా.. మరో రూ.80కోట్లు నిధులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తే కానీ... టన్నెల్‌ లైనింగ్, కుడి, ఎడమ మేజర్‌ కాల్వలు, పంప్‌ హౌజ్‌ ఆగ్జిలరీ పనులు చేపట్టడానికి వీలు కాదని చెబుతున్నారు. ఇక, అత్యంత ప్రధానమైన భూసేకరణకు సంబంధించి ఇప్పటికి సేకరించింది పోను మిగిలిన 2,501 ఎకరాల భూ సేకరణకు రూ.250 కోట్లు అవసరమని, ఇది సేకరిస్తే కానీ,  కెనాల్, డిస్టిబ్యూటరీలు పూర్తి చేయడానికి వీలు కాదని చెబుతున్నారు. 

ప్రాజెక్టు ఖర్చు... ఇలా !
రాజకీయ వాదోప వాదాలకు కారణమైన ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలో ఇప్పటి దాకా రూ.363 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రాజెక్టు మంజూరు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా రూ.197 కోట్లు ఖర్చు చేయగా.. తెలంగాణ ఏర్పాటు నుంచి ఈ ఏడాది జూలై వరకు రూ.166 కోట్లు వెచ్చించారు. ఇందులో ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పంపులు మోటార్ల కోసం రూ.76 కోట్లు, సొరంగం తవ్వకం, పంప్‌ హౌజ్, జలాశయ నిర్మాణం తదితర సివిల్‌ పనులకు రూ.121 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

కాగా, 2014 మే నుంచి ఈ ఏడాది జులై వరకు తెలంగాణ స్వరాష్ట్రంలో పంపులు, మోటార్ల కోసం రూ.68కోట్లు, సొరంగం పనులు, పంప్‌ హౌజ్, జలాశయ నిర్మాణం తదితర సివిల్‌ పనుల కోసం రూ.98కోట్లు వెరసి రూ.166 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి రూ.450 కోట్లు అవసరం కానుండడం, ప్రధానంగా ఎక్కువ మొత్తంలో భూ సేకరణ జరపాల్సి ఉండడంతో ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది..? తమ బీడు భూములకు నీరెప్పుడు వస్తుందోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement