వంశీకృష్ణ (ఫైల్)
కోల్‌సిటీ (గోదావరిఖని): కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని జిల్లా ఆరవ అదనపు జడ్జి కోర్టు నుంచి అండర్ ట్రయల్ ఖైదీ నీలపు వంశీకృష్ణ ఎస్కార్ట్ పోలీసులను కళ్లుకప్పి తప్పించుకున్నాడు. మూత్రవిసర్జనకు వెళ్తానని ఎస్కార్ట్‌తో చెప్పి కోర్టు ప్రహరీగోడ దూకిన వంశీకృష్ణ అప్పటికే రోడ్డుపై బైక్‌తో సిద్ధంగా ఉన్న యువకుడితో కలిసి పరారయ్యాడు. అతడిపై గోదావరిఖని వన్‌టౌన్ ఠాణాలో రౌడీషీట్‌తోపాటు పలు హత్యకేసులున్నాయి. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు... ఐబీ కాలనీకి చెందిన నీలపు వంశీకృష్ణ(23)ను గంజాయి రవాణా కేసులో ఈ నెల 15న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు అతడికి రిమాండ్ విధించగా కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. 2010 నవంబర్ 7న ఐబీ కాలనీలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట పిడుగు సతీష్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటనలో వంశీకృష్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచారణ నిమిత్తం వంశీకృష్ణను కరీంనగర్ జైలు నుంచి గోదావరిఖని కోర్టుకు గురువారం ఉదయం ఎస్కార్ట్ పోలీసులు మధుసూదన్‌రావు (ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్), సుభాష్ (కానిస్టేబుల్) తీసుకొచ్చారు. కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టులో సమర్పించడానికి సుభాష్ వెళ్లగా వంశీకృష్ణకు ఎస్కార్ట్‌గా మధుసూధన్‌రావు ఉన్నారు. మూత్ర విసర్జన కోసం వెళ్తానని మధుసూదన్‌ను నమ్మంచిన అతడు కోర్టు గోడదూకి అప్పటికే బైక్‌తో సిద్ధంగా ఉన్న యువకుడితో కలసి పరారయ్యాడు. ఈ ఘటనపై వెంటనే మధుసూధన్‌రావు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.